(Source: ECI/ABP News/ABP Majha)
Ap News:ఊపేసిన ఉప్పాడ పట్టు, అదరగొట్టి అరకు కాఫీ, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ప్రోగాంలో ఏపీకి ఆరు పతకాలు
చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించి చేయూతనిచ్చేందుకు కేంద్రం ప్రవేశంపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ప్రోగాంలో ఏపీకి ఆరు పతకాలు దక్కాయి.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకంలో ఏపీ ప్రభుత్వానికి ఏకంగా ఆరు అవార్డులు(Medels) దక్కాయి. సామాజిక, ఆర్ధిక అభివృద్దిని ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోని ప్రతి జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని ఎంపిక చేసి, బ్రాండింగ్, విస్తృత ప్రచారం కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ( One District One Product) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 12 అవార్డుల్లో ఒక్క ఏపీనే 6 అవార్డులు కైవసం చేసుకోవడం విశేషం. అరకు(Araku) కాఫీ, సవర ఆదివాసీ పెయింటింగ్, చిత్తూరు టెర్రకోట, దుర్గి రాతి శిల్పాలు వంటి స్థానిక ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం ద్వారా ఇది విజయవంతమైంది. రాష్ట్రం అంతర్గత వనరులను గుర్తించి, ఉపయోగించుకునే ప్రక్రియ ద్వారా ఒకే జిల్లా ఒకే ప్రోడక్ట్ (ఓడీఓపీ) చొరవ అట్టడుగు వర్గాలకు ఆర్థిక విలువను అందించింది.
జామ్దానీ జబర్దస్త్
కాకినాడ జిల్లా ఉప్పాడ (Uppada) జామ్దాని చీరలు, అల్లూరి జిల్లా అరకు(Araku) కాఫీకి బంగారు పతకాలు కైవసం చేసుకోగా... పొందూరు( Pondhuru) కాటన్, కోడుమూరు, గద్వాల్(Gadwal) చీరలకు కాంస్య పతకాలు దక్కాయి. మదనపల్లె(Madanapalle) పట్టు, మంగళగిరి(Mangalagiri) చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు వచ్చాయి. ఉప్పాడ జామ్దాని చీరలకు దాదాపు మూడు వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. జామ్దాని చీరలు ఈ ప్రాంతంలో నేతన్నల చేతుల్లోనే ప్రాణం పోసుకుంటాయి. బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అపురూప కళలో చీరలపై మొక్కలు, పూలు డిజైన్లు వేస్తారు. శుభకార్యాల్లో ఉప్పాడ జామ్దానీ పట్టుచీరలు ధరించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తారు. వందశాతం పట్టుతో రూపుదిద్దుకునే ఈ చీరల కోసం నేత కళాకారులు ఎంతో సహనం, ఓర్పుతో నేస్తారు. ఒక్కో చీర నేయడానికే సుమారు 15 రోజుల సమయం తీసుకుంటంది. అంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే ఉప్పాడ జామ్దాని చీర బంగారు పతకం కైవసం చేసుకుంది.
అరకు కాఫీ అపురూపం
దేశంలో అస్సాం టీ తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతలు అరకు కాఫీకే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ(Vizag) మన్యంలో పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా గిరిజనులు అడవుల్లో పండించడం వల్లే ఈ కాఫీ పొడికి అంత రుచి వచ్చింది. అరకులో తయారయ్యే అర్గానిక్ కాఫీ విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందింది.ఇది దేశంలోనే మొట్టమొదటి ఆర్గానిక్ కాఫీ బ్రాండ్. దీని రుచి అమోఘం.. అందుకే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో బంగారు పతకం కైవసం చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్ బట్టలకు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ హ్యాండ్‌స్పన్ ఫాబ్రిక్ తయారీకి ప్రసిద్ధి. అలాగే గద్వాల్, కోడుమూరు పట్టు చీరలు సైతం వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో ఇవి కాంస్య పతాకాలు కైవసం చేసుకున్నారు. పట్టుగూళ్ల పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మదనపల్లెలోనాణ్యమైన పట్టుదారం లభిస్తుంది. దీంతో తయారైన పట్టుచీరలు, అలాగే మంగళగిరిలో చేనేత చీరలు సైతం ఎంతో ఆకట్టుకోవడంతో ప్రత్యేక జ్యూరీ అవార్డులు దక్కించుకున్నాయి.
సగానికి సగం కైవసం
ఇటీవల ఢిల్లీ(Delhi)లో జరిగిన కార్యక్రమంలో అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. రాష్ట్రానికి వచ్చిన అవార్డలతో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి జగన్(Ap Cm Jagan) ను కలవగా...ఆయన వారందరినీ అభినందించారు. రాష్ట్రం నుంచి టెక్స్‌టైల్స్, హస్తకళలు, చేనేత, మత్స్య, పారిశ్రామిక రంగాలతో సహా 26 ఉత్పత్తుల కోసం దరఖాస్తులను సమర్పించగా...14 ఉత్పత్తులు షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయని వారు సీఎంకు వివరించారు. వీటిల్లో ఆరు అవార్డులు గెలుచుకున్నాయన్నారు. మొత్తం అవార్డుల్లో సగానికి సగం రాష్ట్రానికే వచ్చాయని వివరించారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన అధికారులను సీఎం జగన్ అభినంధించారు.