AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
Andhra Pradesh Post Poll Violence: ఏపీలో మే 13న ఎన్నికలు జరగగా, ఎన్నికలకు ముందు, తరువాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌కు అందజేశారు.
Andhra Pradesh Post Election Violence | అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు, అనంతరం చెలరేగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఈ నివేదికను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ (SIT Chief Vineet Brijlal) అందజేశారు. ఎన్నికల సమయంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. దీనిపై విచారణ చేపట్టాలని వినీత్ బ్రిజ్‌లాల్ ఆధ్వర్యంలో 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే.
అల్లర్లు, హింస చెలరేగిన పల్నాడు, మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, మరికొన్ని ప్రాంతాల్లో సిట్ బృందాలు రెండు రోజులపాటు పర్యటించాయి. స్థానికులు, నేతలతో పాటు పోలీసులను విచారించి పలు వివరాలు సేకరించి ప్రాథమిక నివేదిక రూపొందించారు. సోమవారం నాడు ఏపీ డీజీపీ ఆఫీసుకు వెళ్లిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేశారు.
ఎన్నికల రోజు 33 హింసాత్మక ఘటనలు
రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హింసపై ప్రాథమిక నివేదికను డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సిట్ అందించింది. ఎన్నికల రోజు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక విచారణ బృందం (SIT) గుర్తించింది. అల్లర్లపై ఈసీ ఏర్పాటు చేసిన సిట్ టీమ్ అధికారులు 2 రోజులపాటు విచారణ చేపట్టారు. హింసాత్మక ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ టీమ్ పరిశీలించింది. సోమవారం దర్యాప్తు నివేదిక సమర్పించాల్సి ఉండటంతో.. ఆదివారం అర్ధరాత్రి వరకు సిట్ దర్యాప్తు కొనసాగింది. రెండు రోజులపాటు తాము సేకరించి వివరాలను సిట్ అధికారులు ప్రాథమిక నివేదికను రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకి అందించారు.
రాష్ట్ర డీజీపీకి 150 పేజీల నివేదిక
ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 150 పేజీల నివేదికను రాష్ట్ర డీజీపీకి సోమవారం అందించారు. తిరుపతి, అనంతపురం, పల్నాడు, జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు సిట్ గుర్తించింది. సిట్ రిపోర్ట్ ప్రకారం అల్లర్లపై 33 కేసులు నమోదు కాగా, 12 మందిని అరెస్ట్ చేయగా.. మొత్తం నిందితులు 1370 మంది ఉన్నారు. 33 కేసులలో పల్నాడు జిల్లాలో 22 కేసులు, అనంతపురంలో 7 కేసులు, తిరుపతి జిల్లాలో 4 ఎఫ్ఐఆర్‌లు నమోదు అయినట్లు సిట్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. స్థానికులు, పోలీసులను కూడా విచారించిన సిట్ బృందం, ఎఫ్ఐఆర్‌లలో కొత్త సెక్షన్లు చేర్చే విషయంపై సిఫార్సు చేశారు. కొత్తగా ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకున్నారు. హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసీ కొందరు నిర్లక్ష్యం చేశారన్న సిట్ బృందం పేర్కొంది.
ఎన్నికల సమయంలో పోలీసులు స్థానిక నేతలతో కుమ్మక్కయ్యారని సిట్ బృందం అభిప్రాయపడింది. హింసాత్మక ఘటనలు జరుగుతున్నా నిర్లక్ష్యం వహించడమే అందుకు నిదర్శనమని రిపోర్టులో ప్రస్తావించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలకు సంబంధించి కొందరు అధికారులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌లకు సిట్ నివేదికను ఏపీ ప్రభుత్వం పంపనుంది. సిట్ టీమ్ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకుంటుంది.