ఏపీ సీఎం, వారి కుటుంబానికి ఎస్ఎస్జీ భద్రత, బిల్లు తీసుకొచ్చిన ఏపీ సర్కార్
ముఖ్యమంత్రి, వారి కుటుంబానికి భద్రత కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. సీఎం, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడున్నా, సెక్యూరిటీ కల్పించేలా ప్రత్యేక భద్రతా గ్రూపు బిల్లును తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి, వారి కుటుంబానికి భద్రత కల్పించే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎక్కడున్నా, సెక్యూరిటీ కల్పించేలా ప్రత్యేక భద్రతా గ్రూపు బిల్లును తీసుకొచ్చింది. స్పెషల్ సెక్యూరిటీ గ్రూపులో పనిచేయటానికి పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లోని సిబ్బందిని డిప్యుటేషన్ ప్రాతిపదికన తీసుకుంటారు. వారికి ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఎస్‌ఎస్‌జీ గ్రూపులోని సభ్యులు విధి నిర్వహణలో భాగంగా చేపట్టే పనులకు న్యాయపరమైన రక్షణ ఉంటుంది.
ముఖ్యమంత్రి, వారి సమీప కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉన్నా ప్రభుత్వం భద్రతను పర్యవేక్షించనుంది. సీఎం కుటుంబానికి అవసరమైన భద్రత కల్పించేందుకు ఎస్‌ఎస్‌జీలోని సభ్యులు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ఇంట్లో ఉన్నా, విదేశాల్లో ఉన్నా, ప్రయాణాల్లోనూ ఎస్ఎస్జీ సెక్యూరిటీ కల్పించనుంది. ఈ ప్రత్యేక బృందం వారి వెన్నంటే ఉంటూ వారి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. భద్రతాపరంగా అవసరమైన కట్టడి నిబంధనలనూ అమలు చేస్తుంది. వారి దగ్గరకు ఎవరైనా రావాలన్నా నియంత్రిస్తుంది. ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం ఎస్‌ఎస్‌జీ బాధ్యతలను చూస్తుంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యక్తిగత భద్రతకు పటిష్టమైన యంత్రాంగం ఉంది. ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళం అక్టోపస్‌ను సీఎం వైఎస్ జగన్ భద్రతను పర్యవేక్షిస్తోంది. కౌంటర్ టెర్రరిజంలో ప్రత్యేకమైన శిక్షణ కలిగిన ఈ బలగాలు రక్షణ విధుల్లో ఉన్నాయి. సీఎం భద్రతలో ఉన్న ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ తోపాటు అదనపు భద్రత కోసం ఆక్టోపస్ టీమ్ కూడా పనిచేస్తోంది. 30 మంది సభ్యులు ఆక్టోపస్ టీమ్ ప్రత్యేక బృందాలుగా విడిపోయి పనిచేస్తోంది. ఒక్కో బృందంలో ఆరుగురు సభ్యుల చొప్పున ఐదు బృందాలుగా ఏర్పడి నిర్ధేశించిన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఆక్టోపస్ బృందాలు సీఎం వెంట ఉండటంతోపాటు ఆయన పర్యటనలు, సభలు, సమావేశాల సందర్భంగా షిఫ్ట్‌ల వారీగా విధులు నిర్వర్తిస్తారు.
జడ్ ప్లస్ సెక్యూరిటీ కోరిన ఏపీ సర్కార్
ముఖ్యమంత్రి జగన్కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్టు ఏపీ ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్దారించాయి. ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందనీ పేర్కొంటూ...ఈ ఏడాది మే చివరిలో రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి నోట్ పంపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉందంటూ... రాష్ట్రప్రభుత్వం ఆ నోట్లో పేర్కొంది. ఇప్పటి వరకూ దేశంలోని ముఖ్యమంత్రుల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు మాత్రమే ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులతో ముప్పు ఉన్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ స్థాయి భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ముఖ్యమంత్రి జగన్కు వామపక్ష తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు, ఐఎస్ఐ ఉగ్రవాదుల నుంచి భద్రత కల్పించాల్సి ఉందని కోరింది. వ్యవస్థీకృత నేర ముఠాల నుంచి కూడా ఆయనకు ముప్పు ఉందని స్పష్టం చేసింది. జెడ్ ప్లస్ స్కేల్ భద్రత కల్పించే వ్యక్తిగా జామర్, బులెట్ ప్రూఫ్ కార్ ఇతర సెక్యూరిటీ బందోబస్తు కల్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది.