TDP 2nd List : గురువారం టీడీపీ రెండో జాబితా - జనసేన, బీజేపీకి సీట్లపై క్లారిటీ ఉందన్న చంద్రబాబు !
Andhra TDP : గురువారం టీడీపీ రెండో జాబితాను విడుదల చేయనున్నారు. ఎంపీ సీట్లకు కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు.
Second list of TDP will be released on Thursday : తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదలకు రంగం సిద్ధం చేసుకుంది. గురువారం రెండో జాబితాను విడుదల చేస్తామని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన వీలైనన్ని ఎక్కువ సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే 94 చోట్ల అభ్యర్థులను ఖరారు చేశారు. ఇంకా యాభై చోట్ల అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. చాలా మంది సీనియర్ నేతలు టిక్కెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ, జనసేన పార్టీలకు 31 సీట్లు కేటాయించారు. టీడీపీ 144 సీట్లలో పోటీ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీతో పాటు పవన్ కల్యాణ్ తొలి జాబితాలో ఐదుగురిని ప్రకటించారు. తర్వాత ఆరో పేరుగా నిడదవోలు నుంచి కందుల దుర్గేష్ ను ఖరారు చేశారు. ఇంకా పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీకి కేటాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ అధికారికంగా ఆయా పార్టీలకు కేటాయించిన అసెంబ్లీ సీట్లపై స్పష్టత లేదు. అదికారిక ప్రకటన చేయలేదు . దీనిపైనా చంద్రబాబు స్పందించారు. ఎవరెవరికి ఏఏ సీట్లు కేటాయించామన్నదానిపై పార్టీలకు స్పష్టత ఉందన్నారు. వారు అభ్యర్థులను ప్రకటిస్తారని స్పష్టం చేశారు.
అంతకు ముందు.. కలలకు రెక్కలు అనే కార్యక్రమంపై చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా 'కలలకు రెక్కలు' పథకం తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు.
భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక్క ప్రత్యేకహోదా కోసం తప్ప...ఇంకే విషయంలోనూ విభేదాలు లేవని చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కూడా అమరావతి రాజధాని అని చెబుతుందన్నారు. పోలవరం ను కేంద్రం కట్టవద్దని చెప్పలేదని.. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా స్టీల్ ప్లాంట్ పై ఎందుకు ఒప్పించలేదని చంద్రబాబు ప్రశ్నించారు .
ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.