Andhra Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలు - ఎస్‌ఈసీ సాహ్ని యోచన - ప్రభుత్వం ఒప్పుకుంటుందా ?
AP local elections: ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈవీఎంలను వాడాలనే ప్రతిపాదనను ఎస్‌ఈసీ నీలం సహాని తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

AP local elections With EVMs: ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఈవీఎంలతో నిర్వహించాలన్న ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహాని ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెడతామని ఆమె తెలిపారు. ప్రబుత్వం అంగీకరిస్తే ఈవీఎంల కొనుగోలు సహా ఇతర లాంఛనాలు పూర్తి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంలతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని.. ఎస్‌ఈసీ నివేదిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విరివిగా ఈవీఎంల వాడకం
మన దేశంలో స్థానిక సంస్థలు (పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషీన్లు 2000ల నుంచి విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలోని ఇటీవలి ఎన్నికల్లో కూడా ఈవీఎంలు ఉపయోగించారు. 2024 డిసెంబర్‌లో మధ్యప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఈవీఎంలు ,VVPAT (వోటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్) ఉపయోగించింది. మొత్తం 23,000కి పైగా గ్రామ పంచాయతీల్లో ఈవీఎంలతో ఎన్నికలు జరిగాయి. 2021 సెప్టెంబర్-డిసెంబర్‌లో బీహార్‌లో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 8,000కి పైగా గ్రామ పంచాయతీలు, 534 పంచాయత్ సమితులు, 39 జిల్లా పరిషత్‌లకు ఈవీఎంలు ఉపయోగించారు. 2022 డిసెంబర్‌లో ముంబై, పూణే, నాగ్‌పూర్ వంటి 27 మున్సిపల్ కార్పొరేషన్లు, 26 జిల్లా పరిషత్‌లు, 118 పంచాయత్ సమితులకు ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా ఈవీఎంలు వాడారు.
సాధారణ ఎన్నికల్లో వచ్చిన సమస్యలే
అన్ని చోట్ల ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. ఈవీఎంలు సమర్థవంతంగా పనిచేశాయి. వోటింగ్ ప్రక్రియ సజావుగా జరిగి ఓటింగ్ పెరిగిందని అధికారులు తెలిపారు. అయితే అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలపై ఆరోపణలు చేశాయి. "ఈవీఎంలలో మానిప్యులేషన్" జరిగిందని ఫలితాలు "రిగ్గింగ్డ్" చేశారని ఆరోపించాయి. ఎన్నికల తర్వాత కొన్ని కేసులు కోర్టుల్లో వేసారు, కానీ SEC "ఎలాంటి మానిప్యులేషన్ లేదు" అని తేల్చింది. మూడు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు "ఈవీఎంలలో ఫ్రాడ్" ఆరోపించి, "పేపర్ బాలట్లు" డిమాండ్ చేశాయి. ఎన్నికల తర్వాత కొన్ని ప్రాంతాల్లో రీ-పోలింగ్ జరిగింది. సుప్రీం కోర్టు కూడా ECIకి ఈవీఎంల భద్రతపై సూచనలు ఇచ్చింది. ఫీడ్‌బ్యాక్ ఎక్కువగా రాజకీయ వివాదాలతో ముడిపడి ఉంది.
ఏపీలో రాజకీయ పార్టీలు అంగీకరించడం కష్టమే!
ఏపీలో ముందస్తుగా మూడు నెలల ముందుగానే ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ఎస్‌ఈసీ.. ఈవీఎంలు వాడాలంటే అన్నిపార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే రాజకీయ పార్టీలు అంగీకరించడం కష్టమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బ్యాలెట్ ఓట్ల ద్వారానే వైసీపీకి బుద్ది చెప్పాలని టీడీపీ కూడా అనుకుంటోంది. అందుకే ఏపీలో రాజకీయ పార్టీలు స్థానిక ఎన్నికలను బ్యాలెట్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.





















