Andhra News: కువైట్‌లో గదిలో మహిళను బంధించి చిత్రహింసలు - మంత్రి స్పందనతో క్షేమంగా స్వగ్రామానికి
AP News: ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి అక్కడ చిత్రహింసలకు గురై తీవ్ర ఇబ్బందులు పడిన ఏపీ మహిళను ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి రప్పించింది. దీంతో బాధిత మహిళ మంత్రి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
AP Woman Returned From Kuwait: ఉపాధి కోసం కువైట్ వెళ్లి అక్కడ పని ప్రదేశంలో తీవ్ర ఇబ్బందులు పడిన ఏపీకి చెందిన మహిళను ఏపీ ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. బాధిత కుటుంబం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా (Annamayya District) తంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుపతి కవిత అనే మహిళ ఉపాధి నిమిత్తం కువైట్ (Kuwait) వెళ్లారు. అక్కడ పని ప్రదేశంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఓ వీడియోలో తెలిపారు. ఓ గదిలో బంధించి తనను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని.. తనను కాపాడాలని వేడుకున్నారు. దగ్గరలో ఉన్న తన సోదరి వద్ద తాత్కాలిక ఆశ్రయం పొంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని (Ram Prasad Reddy) వీడియో ద్వారా సంప్రదించారు. తన భర్త దివ్యాంగుడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను స్వగ్రామానికి తీసుకొచ్చే విధంగా చూడాలని మంత్రిని కోరారు.
సురక్షితంగా స్వదేశానికి..
మహిళ ఆవేదనపై స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి.. బాధిత మహిళను రక్షించాలని.. ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు (Kondapalli Srinivas) విజ్ఞప్తి చేశారు. దీంతో ఏపీ ఎన్నార్టీ 24X7 హెల్ప్ లైన్ ద్వారా కువైట్‌లో ఉన్న సామాజిక కార్యకర్త జిలకర మురళి, షేక్ రహీదా బేగం సహకారంతో స్వదేశానికి రప్పించారు. శుక్రవారం రాత్రి కువైట్ నుంచి ఎయిరిండియా ఎక్స్ ప్రెస్‌లో చెన్నై ఎయిర్ పోర్టుకు కవిత చేరుకుంది. తనను స్వదేశానికి తీసుకొచ్చిన మంత్రి, సామాజిక కార్యకర్తలు, అధికారులకు బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Viral News : నీకు 10వేలు, నీకు 15వేలు, నీకు 18వేలు- వైరల్ అవుతున్న జగన్ వీడియో