Rajinikanth Phone Call to Nara Lokesh: లోకేష్ కి ఫోన్ చేసిన రజినీకాంత్, కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవన్న తలైవా
తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని అన్నారు రజినీకాంత్. నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ ఏపీ రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా మారారు. నారా లోకేష్ కి ఫోన్ చేసిన ఆయన ధైర్యం చెప్పారు. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని కొనియాడారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకి రక్షగా నిలుస్తుందన్నారు రజినీకాంత్. ఇలాంటి సమయంలో లోకేష్ ధైర్యంతో ఉండాలని సూచించారు.
తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని అన్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన కచ్చితంగా బయటకు వస్తారని ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, ఆయన చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.
పరామర్శల వెల్లువ..
ప్రస్తుతం నారా లోకేష్ రాజమండ్రిలోనే ఉన్నారు. ఇతర రాష్ట్రాలనుంచి పలువురు నాయకులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. నిన్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించారు. పలువురు నాయకులు నేరుగా రాజమండ్రి వచ్చి లోకేష్ ని పరామర్శించి ధైర్యం చెప్పి వెళ్తున్నారు. జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ కూడా నారా లోకేష్ ని కలిశారు. తాము ఆయనకు అండగా ఉంటామన్నారు. తప్పుడు కేసులు కోర్టులో నిలబడవని, చంద్రబాబు కచ్చితంగా బయటకు వస్తారన్నారు శ్రావణ్ కుమార్.
జనసేన సంఘీభావం..
వివిధ జిల్లాల జనసేన నేతలు కూడా రాజమండ్రి వచ్చి నారా లోకేష్ ని పరామర్శించి వెళ్తున్నారు. ఈరోజు విశాఖ జిల్లా జనసేన నేతలు ఆయన్ను కలిశారు. తమ మద్దతు లోకేష్ కి ఉంటుందన్నారు. టీడీపీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో తాము కూడా పాల్గొన్నామని చెప్పారు. చంద్రబాబుని విడుదల చేసే వరకు జరిగే న్యాయపోరాటంలో తాము కూడా భాగస్వాములమవుతామన్నారు. టీడీపీ చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటామని చెప్పారు. లోకేష్ కూడా వారికి ధన్యవాదాలు తెలిపారు. నిరసనల్లో పాల్గొన్నందుకు, బంద్ కి మద్దతిచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
వైసీపీ రియాక్షన్ ఏంటి..?
సూపర్ స్టార్ రజినీకాంత్ ఫోన్ కాల్ వ్యవహారం మరోసారి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఫోన్లో పరామర్శించడంతో సరిపెట్టకుండా, తన మిత్రుడు మంచి మనిషి అంటూ రజినీకాంత్ కితాబిచ్చినట్టు టీడీపీ చెప్పుకోవడం, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని చంద్రబాబు పాలన గురించి రజినీకాంత్ గొప్పగా చెప్పినప్పుడు కూడా వైసీపీనుంచి ఓ రేంజ్ లో సెటైర్లు పడ్డాయి. మంత్రులు, మాజీ మంత్రులంతా రజినీకాంత్ పై విరుచుకుపడ్డారు. అదో పెద్ద వార్ ఎపిసోడ్ గా నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ రజినీకాంత్ పరామర్శ, చంద్రబాబు గురించి గొప్పగా చెప్పడంతో వైసీపీ నుంచి ఘాటు విమర్శలు వినిపించే అవకాశముంది. గతంలో రజినీపై తీవ్రంగా విరుచుకుపడ్డ నేతలు, ఈసారి కూడా ఆయన పరామర్శ ఫోన్ కాల్ పై కచ్చితంగా స్పందిస్తారు. ప్రస్తుతానికి వైసీపీనుంచి ఇంకా స్పందనలు మొదలు కాలేదు. మొదలైతే మాత్రం మళ్లీ సోషల్ మీడియాలో మాటల యుద్ధం ప్రారంభమైనట్టే లెక్క.