YS Jagan: ఏలేరుకి వరద చంద్రబాబు వల్లనే, ఆ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస - జగన్ ఎద్దేవా
YS Jagan Comments: పిఠాపురం పరిధిలో జగన్ పర్యటన సందర్భంగా ఏలేరు వరదలకు ప్రభుత్వమే కారణమని నిందించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతోనే ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని జగన్ అన్నారు.
YS Jagan Comments on Chandrababu Naidu: పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని.. ఇది చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఏలేరు వరదలకు కారణమైన వారిని నిందించారు. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడకు ఎలాగైతే వరదలు వచ్చాయో అదేలాగా ఏలేరు రిజర్వాయర్ రైతులను ముంచేసిందని జగన్ అన్నారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని రమణక్కపేటలో జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఏలేరు రిజర్వాయర్ వరద నీటి నిర్వహణ విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ నుంచి సమాచారం ఉండగా.. అయినా అధికారులు పట్టించుకోలేదని అన్నారు. వాతావరణ విభాగం నుంచి ఆగష్టు 31వ తేదీనే ముందస్తు సమాచారం ఉందని అన్నారు. అప్పుడే కలెక్టర్లతో రివ్యూ చేసి ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదని అన్నారు. అసలు ఏలేరు జలాశయానికి వచ్చే ఇన్ ఫ్లోను ఎందుకు మేనేజ్ చేయలేకపోయారని జగన్ ప్రశ్నించారు. దీన్ని బట్టి ఇది బాధ్యత లేని ప్రభుత్వం అని అర్థం అవుతూందని అన్నారు. ఇవి కూడా పూర్తిగా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని జగన్ అభివర్ణించారు.
వైఎస్ హాయాంలోనే
ఏలేరుకు ఆధునీకరణ పనులను 2008లో నిధులు కేటాయించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన తర్వాత ఆ కార్యక్రమాన్ని ఎవరూ పట్టించుకోలేదని జగన్ విమర్శించారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక, అంచనాలు పెంచారు కానీ.. పనులు మాత్రం చేయలేదని అన్నారు. తమ హయాంలో ఏటా వర్షాలు పడి జలాశయాలు నిండుగా ఉండడం వల్ల.. కాలువ ఆధునీకరణ పనులు వేగంగా చేయలేకపోయామని అన్నారు.
గోబెల్స్ ప్రచారాలకు చంద్రబాబు తమ్ముడి వరుస అని జగన్ ఎద్దేవా చేశారు. అబద్ధాలను మ్యానుఫ్యాక్చర్ చేయడంలో దిట్ట అని అన్నారు. వాటిని అమ్ముకోగలిగే కెపాసిటీ ఈ భూమ్మీద కేవలం ఒక్క చంద్రబాబుకే ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా జగన్ వల్లనే అని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు. ‘‘చంద్రబాబూ ఇకనైనా జగన్నామం ఆపు.. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు అయింది. మంచి చేయాల్సిన దాని గురించి ఆలోచించి.. నిజాయితీగా పాలన చేయడం నేర్చుకోవాలి’’ అని చంద్రబాబుకి జగన్ హితవు పలికారు.
ఈ సమయంలో తన ప్రభుత్వం ఉండి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం అంది ఉండేది కాదని అన్నారు. సీజన్ ప్రారంభంతోనే సాయం చేసి ఉండేవాళ్లమని.. గతంలో పంట నష్టం జరిగితే హెక్టార్‌కు రూ.17 వేలు ఇచ్చామని జగన్ గుర్తు చేశారు.