MLA Gorantla: సీఎం జగన్ హత్యారాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి - టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య తీవ్ర వ్యాఖ్యలు
హత్యారాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు రాజ్యపాలనకు వస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.
ముఖ్యమంత్రి హత్యారాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి..
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి..
హత్యారాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు రాజ్యపాలనకు వస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఒక ఉదాహరణ అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. సీఎం జగన్ కరుడుగట్టిన ఉగ్రవాదికంటే ప్రమాదకరం అన్నారు. పదవుల కోసం వారి స్వార్ధం కోసం కుటుంబసభ్యులను మట్టుపెట్టిన వారు దేనికైనా తెగిస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పోలీసు వ్యవస్థ నిర్వీర్యమై నిస్తేజమై అభాసుపాలవుతోందన్నారు. సిట్ అధికారులు అంతా దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు.
పాపం పండినప్పుడు పరిహారం చెల్లించకతప్పదు..
హత్యలు చేయించి మాఫీ చేయించడం కోసం చేసిన ప్రయత్నం ఫలితం అనుభవించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నాడని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. తన పాపాల్ని చంద్రబాబు పై నెట్టేందుకు ప్రయత్నించాడని, తన న్యూస్ పేపర్ ద్వారా విషప్రచారం చేసి నమ్మించాడని అన్నారు. న్యాయం ఆయనవైపు ఉంటే కుటుంబసభ్యులు సీబీఐ కేసుల్లో ఎందుకు ఇరుక్కుంటున్నారని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేసేందుకు ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయని, అందుకే నీ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకువెళ్లే పరిస్థితి వస్తోందన్నారు. దీని వెనుక ఎన్ని హత్యలు జరిగాయో ఆ జిల్లా వాసులందరికీ తెలుసన్నారు.
న్యాయవ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి..
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆర్డర్ చూశాక తెలంగాణ హైకోర్టులో పనిచేసిన జడ్జి తక్షణం రాజీనామ చేస్తే బాగుంటుందని తనకనిపిస్తోందని బుచ్చయ్య అన్నారు. న్యాయవ్యవస్థపై మచ్చలేకుండా ఉండాలంటే, ఆ జడ్జి ఎందుకు అలా తీర్పు ఇచ్చారో చూసి రాజీనామా చేస్తే బాగుంటుందన్నారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ ప్రతిపక్షాలు పాత్ర లేదని తేల్చిందని, స్టెరిలైజ్ చేసిన కోడి కత్తితో నువ్వే గాటు పెట్టించుకుని కోడికత్తి శ్రీను అనే నిందితుడ్ని జైలుపాలు చేశావని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. రాజ్యాంగేతర శక్తిగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని, న్యాయవ్యవస్థకే సవాలుగా మిగులుతున్నారన్నారు. హక్కులు హరిస్తున్న సీఎం జగన్ ఎన్నికేసులు పెడతావో పెట్టుకో అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలను పక్కనపెట్టు అని, పోలీసులు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించకోక తప్పదన్నారు.
మిగిలిన 19 మంది సిట్టింగ్‌లకు సీట్లు కన్ఫామ్..
పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిపి ఇంతవరకు పొత్తుల గురించి మాట్లాడలేదన్నారు. ఎవరికివారు కర్చీఫ్‌లు వేసుకుంటున్నారన్నారు. టీడీపీలో 24 మందిలో నలుగురు వెళ్లిపోయారని, ప్రస్తుతం ఉన్న 19 మందికి టిక్కెట్లు కన్ఫామ్ అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు పరిమితమని, అంతే కానీ భర్తలకు, భార్యలకు, తమ్ముళ్లకు మాత్రం కాదని, స్పష్టంగా చెబుతున్నానని బుచ్చయ్య తెలిపారు. నాతో కుర్రాళ్లు పరుగెత్తలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.
ఆదిరెడ్డి వాసు కోసమేనా ఆ వ్యాఖ్యలు..?
రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది ఎవరికి వారు ఖర్చీఫ్‌లు వేసుకుంటున్నారని, ఇంతవరకు టీడీపీ, జనసేన పొత్తుల గురించే మాట్లాడుకోలేదన్నారు. టీడీపీలో మిగిలిన 19 మంది సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఖరారు అని, అంతేకానీ భర్తలు, భార్య, తమ్ముళ్లకు కాదని తేల్చిచెప్పారు.. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవాని గెలుపోందారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం నుంచి భవాని ఇక పోటీ చేయరని, ఆమె స్థానంలో తానే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తానని ఆదిరెడ్డి శ్రీనివాస్(వాసు) ఇప్పటికే ప్రకటించారు. తాజాగా బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజమండ్రి టీడీపీలో హాట్ టాపిక్ అవుతున్నాయి.