Sarkar Express: ఇకపై సర్కార్ ఎక్స్‌ప్రెస్ పుదుచ్చేరి వరకు, నెరవేరిన ఏళ్లనాటి కల!
పుదుచ్చేరిలో అంతర్భాగమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉండే యానాం ప్రజలు ఎక్కువగా పుద్దుచ్చేరి వెళుతుంటారు.
కాకినాడ పోర్టు నుంచి చెన్నై మీదుగా చెంగల్‌పట్టు వరకు వెళ్లే సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఇక నుంచి పుదుచ్చేరి వరకు వెళ్లనుంది. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించేందుకు కృషి చేసిన పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళసై సొందరాజన్, స్పీకర్ సెల్వం, రాజ్యసభ సభ్యుడు సెల్వగణపతి, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తోపాటు విధాన నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే సర్కార్ ఎక్స్‌ప్రెస్ చెంగల్ పట్టును దాటి పుదుచ్చేరి వరకు వెళుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
యానాం ప్రజలకు ఇది శుభవార్త..
పుదుచ్చేరిలో అంతర్భాగమైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉండే యానాం ప్రజలు ఎక్కువగా పుద్దుచ్చేరి వెళుతుంటారు. ఇక్కడి విద్యార్థులు చాలా మంది పుదుచ్చేరిలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు, పలువురు ఉద్యోగులు, వ్యాపారులు పుదుచ్చేరి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో పుదుచ్చేరి వెళ్లేందుకు కాకినాడ లో సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కినప్పటికీ చెన్నైలో దిగి వేరొక రైలులో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీనిపై కొంతకాలంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించాలని పలుసార్లు రైల్వేశాఖకు విజ్ఞప్తులుచేశారు. యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ పలుసార్లు ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రాలను పలుసార్లు సమర్పించారు. ఇటీవలే వరదల సమయంలో యానాం వచ్చిన పుదుచ్చేరి లెప్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసైకు ఇదే అంశంపై ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. దీంతో ఇన్నాళ్లకు సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలు పుదుచ్చేరి వరకు వెళ్లే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది.