Nara Lokesh: కాకినాడలో యువ వైద్యుడి ఆత్మహత్య, వైసీపీ నేతల భూదాహమే కారణమంటూ లోకేశ్ మండిపాటు
Nara Lokesh fires on YSRCP leaders: వైఎస్సార్ సీపీ నేతల భూదాహం ఓ డాక్టర్ ప్రాణాలు బలిగొందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
Kakinada Young Doctor committed suicide: అమరావతి: అధికార వైఎస్సార్ సీపీ నేతల భూదాహం ఓ డాక్టర్ ప్రాణాలు బలిగొందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ధ్వజమెత్తారు. ఏపీ మాజీ మంత్రి కన్నబాబు (AP Ex minister Kannababu) తమ్ముడు కల్యాణ్ బెదిరింపులు, దౌర్జన్యాలు భరించలేక కాకినాడకు చెందిన యువ వైద్యుడు శ్రీ కిరణ్ (33) ఆత్మహత్య (Doctor Suicide in Kakinada) చేసుకున్నాడని నారా లోకేష్ ఆరోపించారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ డాక్టర్ ను సైతం వైసీపీ భూ బకాసురులు వదిలిపెట్టడం లేదన్నారు.
డాక్టర్ శ్రీ కిరణ్‌కి చెందిన భూమిని మాజీ మంత్రి కన్నబాబు సోదరుడు కళ్యాణ్ కొనుగోలు చేసి.. వాటి డబ్బులు ఇవ్వకుండా వేధించాడని నారా లోకేష్ ఆరోపించారు. పదే పదే అడుగుతున్నా తన భూమి కొనుగోలుకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదని, మరోవైపు 5 ఎకరాల భూమి ఒరిజినల్ డాక్యుమెంట్లు సైతం తిరిగివ్వకుండా తనవద్దే ఉంచుకుని కల్యాణ్ వేధించాడని చెప్పారు. వైసీపీ నేతలు, వారి అనుచరుల వేధింపులు, బెదిరింపులు భరించలేక యువ డాక్టర్ శ్రీ కిరణ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. యువ వైద్యుడి మరణానికి వైసీపీ నేతల భూ దాహమే కారణమని, వారి ఆగడాలను తట్టుకోలేక డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. శ్రీకిరణ్ మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదని, అన్యాయాన్ని ఎక్కడికక్కడ ఎదరించాలని బాధితులకు టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.
బాధితుడి తల్లి ఏమన్నారంటే..
డాక్టర్ శ్రీకిరణ్ తల్లి శేషారత్నం మాట్లాడుతూ.. మాజీ మంత్రి కన్నబాబు తమ్ముు కళ్యాణ్ కు భూమి అమ్మినట్లు తెలిపారు. అనంతరం కళ్యాణ్.. అచ్చంపేట పెదబాబుకు విక్రయించారని చెప్పారు. మీ నాన్న లేరని తెలుసు అని, అంతా తాను చూసుకుంటానని చెప్పి మా అబ్బాయితో దస్తావేజులు, పత్రాలు అన్నీ కన్నబాబు సోదరుడు తీసుకున్నాడని తెలిపారు. మీకు న్యాయం చేస్తానని చెప్పి పత్రాలు తమ వద్ద పెట్టుకుని ఇబ్బందులకు గురిచేశారని వివరించారు. మా అబ్బాయి నిన్న మాట్లాడేందుకు వెళ్లి.. ఎకరం భూమి సపరేట్ గా ఉంది, అది అమ్మడం లేదు భూమి పత్రాలు ఇవ్వాలని కోరినట్లు మృతుడి తల్లి శేషారత్నం చెప్పుకొచ్చారు. మీకు డబ్బు రాదు అని చెప్పడంతో ఇంటికి తిరిగొచ్చిన శ్రీకిరణ్ మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త ఆ భూమిని కోనుగోలు చేశారని, చనిపోయేముందు తన భర్త అదే పొలంపై కొంత అప్పు తీసుకొచ్చారని తమకు ఈ మధ్యే తెలిసిందన్నారు. ఆ భూమి కోర్టు వివాదానికి వెళ్లగా సమస్య కొంత తీరింది. రూ.85 లక్షలు కట్టి కోటిన్నర రూపాయాలు కట్టినట్లు చెప్పి అచ్చంపేట పెదబాబు మా భూమి మొత్తం తీసుకునే ప్రయత్నం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. మీ దస్తావేజులు తాను తిరిగిచ్చేది లేదని అచ్చంపేట పెదబాబు, కళ్యాణ్ తెగేసి చెప్పడంతో ఆందోళనకు గురైన డాక్టర్ శ్రీకిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి తల్లి శేషారత్నం వివరించారు. వేధింపులకు గురిచేయడం, బెదిరింపుల కారణంగానే తన కొడుకు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.