Andhra Pradesh: ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ముద్రగడ ఫ్యామిలీ, ఎక్కడి నుంచి బరిలోకి!
Mudragada Padmanabham: ముద్రగడ తన సమాజిక వర్గ అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నారో అదే సామాజికవర్గంలో మెజార్టీ వర్గం ప్రత్యక్షరాజకీయాల్లోకి రావడం కంటే కుల ఉద్యమనేతగానే చూడాలన్న భావన ఉంది.
AP Elections 2024: రాజమండ్రి: కాపు ఉద్యమ నేతగా మూడు దశాబ్ధాలకు పైబడి ఉద్యమ బాటలో ఉన్న నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం(Mudragada Padmanabham). ఇప్పుడు ఆయన రాష్ట్ర రాజకీయాలవైపు చూస్తున్నారా అంటే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే అవునే వినిపిస్తోంది.. ఆయన పోటీచేసేందుకు ముందుకు రాకపోయినా ఆయన కుమారుడు గిరిరావు ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పలు పార్టీ నాయకులు ఇప్పటికే ముద్రగడను ఆయన ఇంటి వద్ద నేరుగా వెళ్లి కలవడం, ఆయన కుమారుడు కూడా నాన్న ఆదేశిస్తే పోటీకు సిద్ధం అంటూ ప్రకటించడం బట్టి చూస్తే ముద్రగడ కుటుంబం మరోసారి ఎన్నికల బరిలో ఉండడం ఖాయం అన్నది స్పష్ట మవుతోంది.
ముద్రగడ తన సామాజిక వర్గ అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నారో.. అదే సామాజికవర్గంలో మెజార్టీ వర్గం ముద్రగడ ప్రత్యక్షరాజకీయాల్లోకి రావడం కంటే కుల ఉద్యమనేతగానే చూడాలనుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కృషి వల్లే ప్రస్తుతం కాపులకు చాలా వరకు ప్రయోజనం చేకూరుతోందని, ఇదే కొనసాగించడం ద్వారా కాపులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంటుందని చర్చ జరుగుతోంది. అదే ఏదైనా పార్టీ తరపున ఆయన ఎన్నికల బరిలో దిగితే ఉద్యమంపై పట్టు కోల్పోవడం జరుగుతుందని, దీనివల్ల కాపు హక్కులు సాధనకు ఇబ్బందులు తలెత్తుతాయని అభిప్రాయపడుతున్నారు..
ఆయన వెంట ఉన్నవారు సైతం..
కాపు రిజర్వేషన్లు ఉద్యమ సమయంలో, ముద్రగడ పద్మనాభం చేపెట్టిన అన్ని కార్యక్రమాల్లోను ఆయన వెన్నంటి ఉండే పలువురు కాపు ఉద్యమ నాయకులు ఇప్పటికీ ముద్రగడ వెంటే నడుస్తున్నారు. వారిలో కొంత మంది పలు పార్టీల్లో కూడా ఉన్నారు. ఇందులో మెజార్టీ వర్గం అయితే ముద్రగడ ఏదైనా పార్టీలో చేరే కంటే స్వతంత్రంగా ఉంటూ పార్టీ ముద్రను మీద పడనీయకుండా కాపు ఉద్యమం కోసం పాటుపడితే అనుకున్న లక్ష్యం తప్పకుండా సాధించగలరని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. అవసరమైతే తాము కూడా పార్టీలను వీడి ముద్రగడ వెంట పూర్తిస్థాయిలో ఉండేందుకు సిద్ధం అంటున్నారట..
ఇంతకీ ముద్రగడ ఏపార్టీ వైపు చూస్తున్నారు..
ముద్రగడ పద్మనాభం వైసీపీకి అనుకూల ధోరణిలో కనిపించారు. ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జి, ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా ముద్రగడను కలిసి పలు విషయాలు చర్చించారు. ఆతరువాత వైసీపీ దూతగా ఎమ్మెల్సీ తోట త్రీమూర్తులు కూడా పలు సార్లు ముద్రగడ గడప తొక్కి పార్టీలోకి రావాలని ఆహ్వానం కూడా పలికారు... అయితే ఈవిషయంలో ఇప్పటికీ ఎటువంటి ప్రకటన వెలువడలేదు.. చంద్రబాబు నాయుడును బహిరంగ లేఖల ద్వారా విమర్శించడం, ఆతరువాత వారాహి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ బహిరంగ లేఖలో పవన్ కల్యాణ్‌ను కూడా ముద్రగడ పరోక్షంగా విమర్శించిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే ముద్రగడ తప్పకుండా వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా జనసేన పార్టీ కాపు ముఖ్య నేతలు బలిశెట్టి శ్రీనివాసరావు, కందుల దుర్గేష్ తదితరులు ముద్రగడ ను ఆయన ఇంటికే వెళ్లి కలుసుకుని చర్చలు జరపడం, ఆ తరువాత ముద్రగడను కలుసుకునేందుకు నేరుగా పవన్ కల్యాణ్ కిర్లంపూడి ముద్రగడ ఇంటికి వస్తున్నారని ప్రకటన కూడా చేశారు. అయితే దాదాపు నెలరోజులు గడుస్తున్నా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఈలోపు టీడీపీ జగ్గంపేట ఇంచార్జ్ జ్యోతుల నేహ్రూ, ఇతర ముఖ్యనేతలు కూడా ముద్రగడ ను కలుసుకోవడం మరో చర్చకు దారితీసింది.. ఏది ఏమైనా ముద్రగడ రాజకీయంగా తన మార్గాన్ని ఎటూ తేల్చుకోలేకపోతున్నారన్న చర్చ జరుగుతుండగా కాపు ఉద్యమ నేతల్లో ముఖ్యులు చాలా మంది ఆయన కాపు ఉద్యమ రధసారధిగానే ఉండాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.