పిల్లి సుభాష్ Vs చెల్లుబోయిన: వేణుకు టికెట్ ఇస్తే రాజీనామా చేసేస్తా, ఆయన చెప్పుకింద బతకట్లేదు - ఎంపీ పిల్లి సుభాష్ సంచలన వ్యాఖ్యలు
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదివారం (జూలై 23) చంద్రబోస్ మాట్లాడారు.
కోనసీమ జిల్లా రామచంద్రాపురం వైఎస్ఆర్ సీపీలో అంతర్గత విభేదాలు మరోస్థాయికి చేరాయి. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆదివారం (జూలై 23) చంద్రబోస్ మాట్లాడారు.
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. అవసరమైతే వైఎస్ఆర్ సీపీ నుంచి వైదొలిగి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, క్యాడర్ దగ్గర చెల్లుబోయిన వేణు ఎన్ని రోజులు నటిస్తారని ప్రశ్నించారు. తమను వేణు చెప్పు కింద బతికే వాళ్లం అనుకుంటున్నారా? అని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి తాము సీఎం జగన్‌తోనే ఉన్నామని గుర్తు చేశారు. ఇద్దర్నీ పిలిచి సమావేశపరుస్తానని సీఎం జగన్ చెప్పారని అన్నారు. అసలు క్యారెక్టర్ లేని వ్యక్తితో తాను కూర్చోనని చెప్పేశానని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఈ విషయంలో ఇబ్బంది పెట్టొద్దని జగన్‌కు చెప్పానని అన్నారు.
మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం..
రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణు వర్గం ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించింది. దీనికి మంత్రితోపాటు ఆయన కుమారుడు, మంత్రి ముఖ్య అనుచరులు అంతా హాజరయ్యారు. అయితే ఈసమావేశం పూర్తిగా తన బలప్రదర్శన చేసుకునే విధంగానే ఉండడంతో అటు ఇదే నియోజకవర్గంలో కీలక నేత పిల్లి సుభాష్ చంద్రబోస్‌పై తన అనుచరులనుంచి ఒత్తిడి తీవ్ర మైంది.. ఇప్పటికే వారం రోజుల క్రితం రామచంద్రపురంలో బోస్ అనుకూల వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో రామచంద్రపురం వైసీపీ టిక్కెట్ బోస్ తనయుడు సూర్యప్రకాష్‌కు ఇవ్వాలని, మంత్రి వేణు తమను అన్నివిధాలుగా రాజకీయంగా అణగద్రొక్కాలని ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.
ముఖ్యమంత్రి వద్దకు చేరిన పంచాయతీ..
రామచంద్రపురం నియోజకవర్గం కేంద్రంగా రచ్చకెక్కిన వైసీపీలో అంతర్యుద్ధం చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వద్దకు చేరింది. దీంతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. ఈసందర్భంగా రచ్చకెక్కిన విభేదాలు వల్ల పార్టీకు నష్టం వాటిల్లుతోందని, ఏమైనా ఉంటే ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడతానని జగన్ చెప్పినప్పటికీ రామచంద్రపురంలో వేణు పోటీచేయడం తనకు ఇష్టం లేదని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని రామచంద్రపురంలో ఇప్పుడు బోస్ వెల్లడించారు. అయితే ఈవిషయంలో ముఖ్యమంత్రి జగన్ బోస్‌పై ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడ్డాయి. తాజాగా ఎంపీ బోస్ మరోసారి రామచంద్రపురంలో మంత్రి వేణుకు టిక్కెట్టు ఇస్తే తాను కానీ, తన కుమారుడు కానీ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని, పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని బోస్ వెల్లడించారు.
తెలుగు దేశం వైపు చూపులు?
రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు బలమైన వర్గం ఉంది.. వేణుకు ఆస్థాయిలోనే వర్గం ఉన్నప్పటకీ స్థానికుడు కాదన్న విమర్శ ఉంది.. ముఖ్యమంత్రి జగన్ తనకు సంతృప్తికరమైన స్థానాన్ని ఇచ్చారని చెబుతూనే తనకు మంత్రి వేణు రామచంద్రపురంలో పోటీచేయడం ఇష్టం లేదని తేల్చిచెబుతున్నారు బోస్.. అయితే అధిష్టానం ఇప్పటికే రామచంద్రపురం నుంచి వేణు పోటీ చేస్తారని ఓ క్లారిటీ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే తోట త్రీమూర్తులు టీడీపీ ను వీడి వైసీపీలో చేరాక ఆయనకు మండపేట వైసీపీ బాద్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో కొత్తపేటకు చెందిన మాజీ శాసన మండలి వైస్ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్‌గా టీడీపీ నియమించింది. అయితే బోస్ వంటి బలమైన నాయకుడు టీడీపీలోకి వస్తే వెంటనే ఆహ్వానించడమే కాకుండా పార్టీ టిక్కెట్టు కూడా ఇస్తామని హామీఇచ్చే అవకాశం లేకపోలేదని చర్చ జరుగుతోంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు ముఖ్యమంత్రి ఈనెల 26న రానున్న నేపథ్యంలో బోస్‌ను పిలిపించి మాట్లాడి రచ్చకెక్కిన రగడను సర్దుబాటు చేస్తారా.. ఈలోనే నిర్ణయం తీసుకుని బోస్ పార్టీకి రాజీనామా చేస్తారా అన్నది మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది..