(Source: ECI/ABP News/ABP Majha)
AP Politics: టీడీపీ, జనసేన కలిస్తే వారి ఆశలు గళ్లంతే! మూడు నియోజకవర్గాల నేతల్లో టెన్షన్ టెన్షన్
టీడీపీ, జనసేనకు బలమైన ప్రాంతంగా చెప్పుకునే అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు పొత్తుల హైరానా మొదలయ్యింది. పొత్తు పొడిస్తే మూడు నియోజకవర్గాల్లో ఆశావహుల ఆశలు గల్లంతవుతాయేమోనని తలలు పట్టుకుంటున్నారట.
టీడీపీ, జనసేనకు అత్యంత బలమైన ప్రాంతంగా చెప్పుకునే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పుడు పొత్తుల హైరానా మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తు పొడిస్తే ఆశావహుల ఆశలు గల్లంతవుతాయేమోనని నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇందులో మరీ ముఖ్యంగా ఈసారి టీడీపీపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు మరీ హైరానా పడుతున్నారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన అధినాయకత్వం గెలుపే లక్ష్యంగా సీట్లు కేటాయింపులు జరుపుకునే అవకాశాలే మెండుగా కనిపిస్తుండగా ఇన్నాళ్ల ఆశలన్నీ అడియాశలు అవుతాయేమోనని దిగులు పడుతున్నారు.
అమలాపురం టీడీపీలో హైరానా..
అమలాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ బలంగానే ఉంది. అమలాపురం అల్లర్ల నేపథ్యంలో కొన్ని సామాజిక వర్గాల మధ్య విభేదాలు వచ్చినా ఎమ్మెల్సీల పదవుల కట్టబెట్టి కొంతవరకు సర్ధుబాటు చేసుకుంది అధికార పార్టీ. అయినా మెజార్టీలో అసంతృప్తులు, ఇప్పటి వైసీపీ నాయకత్వంపై అయిష్టత ఇంకా పలు సందర్భాలు బహిర్గతమవుతూనే ఉంది. అయినప్పటికీ నష్టనివారణ చర్యలు చేపట్టిన పార్టీ దిద్దుబాటు పనుల్లో నిమగ్నమయ్యింది.. ఇక ప్రధాన పోటీదారు అయిన టీడీపీలో అంతర్గత పోరు తారాస్థాయిలో కనిపిస్తోంది. దీనికి ప్రధానంగా ప్రస్తుతం నియోజకవర్గ ఇంఛార్జ్ ఉన్న అయితాబత్తుల ఆనందరావుపై వ్యతిరేకతే ప్రధానంగా చర్చకు దారితీస్తోంది. మరో పక్క ఆనందరావు, చినరాజప్ప, గంటి హరీష్‌మాధూర్ వర్గాలుగా విడిపోవడం దీంతో అమలాపురం నియోజకవర్గ టీడీపీ సీటుపై ఆశావహుల జాబితా చాంతాడంతగా మారింది.
ఇంటి పోరు తలనొప్పిపై ఇంతవరకు తలపట్టుకున్న మాజీ ఎమ్మెల్యే ఆనందరావు ఇప్పుడు పొత్తులతో కొత్త తలనొప్పిని ఎదుర్కోని పరిస్థితి తప్పడం లేదు అనిపిస్తోంది. ఎందుకంటే అమలాపురంలో జనసేన కూడా అంతే బలంగా ఉండడం దీనికి కారణంగా కనిపిస్తోంది. అమలాపురం సీటు విషయంలో జనసేన వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబుపై జనసేనానికి మంచి అభిప్రాయం ఉండడంతో అమలాపురం జనసేన గెలిచే సీటు అని, పొత్తులు ఖరారైతే జనసేన అమలాపురం వదలవద్దని అధినాయకునికి సంకేతాలు పంపడమేకాదు ఒప్పించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో టీడీపీ ఆశావహుల్లో ప్రధానుడైన మాజీ ఎమ్మెల్యే ఆనందరావు తన సీటు తాను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారట. అమలాపురం టీడీపీకు కేటాయిస్తేనే విజయం తధ్యం అన్న సంకేతాలు అధినాయకత్వానికి బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన అమలాపురంలో అటు టీడీపీలో అనేక మంది ఆశావహులు వరుసలో ఉండగా జనసేన నుంచి రాజబాబు, మొన్నటి ఎన్నికల్లో జనసేన ఎంపీ అభ్యర్ధిగా పోటీచేసిన డీఎమ్మార్ శేఖర్ లైన్లో ఉన్నారు.
రాజోలులో జనసేన జెండానేనా..?
రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో జనసేన తరపున ఎన్నికైన ఏకైక స్థానం రాజోలు. ఇది కూడా ఎస్సీ రిజర్వుడు స్థానం కాగా జనసేన పార్టీ గుర్తుపై గెలిచిన రాపాక వరప్రసాదరావు వైసీపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు ఆపార్టీ తరపున ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈసారి టిక్కెట్టు నాదే అని దీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అనూహ్యంగా గతంలో వైసీపీ తరపున పోటీచేసి ఓడిపోయిన బంతు రాజేశ్వరరావు పార్టీకు రాజీనామా చేసి జనసేన తీర్ధం పుచ్చుకోవడం జనసేన అభ్యర్థిత్వంపైనే ఆశలు పెట్టుకోవడం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే టీడీపీ మాజీ మంత్రి, మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు కూడా ఇది నాకు ఆఖరి ఛాన్స్ అంటూ అధిష్టానం ముందు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ నిర్ణయం మేరకు రాజోలు వెళ్లి పోటీచేసి గెలిచిన గొల్లపల్లి ఆ తరువాత ఓడిపోయినా పార్టీ కోసం పనిచేస్తున్నారు. గతంలో టీడీపీ, జనసేన కలవాలని.. కలిస్తేనే వైసీపీ అరాచక పాలనను అంతమొందిచవచ్చని మాట్లాడారు. జనసేన గెలిచే అవకాశాలున్న రాజోలు నియోజకవర్గాన్ని జనసేన వదులుకుంటుందా.. లేక టీడీపీకి అప్పచెబుతుందా అనేది తేలాలంటే కొంతకాలం వేచిచూడకతప్పదు.
ముమ్మిడివరం టీడీపీ వశమేనా..?
జనరల్ నియోజకవర్గమైన ముమ్మిడివరంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కు బలమైన అభ్యర్ధిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబుకు మంచి పేరుంది. ఈయన 2019లోనూ గట్టిపోటీ ఇచ్చారు. ముమ్మిడివరంలో టీడీపీ కూడా బలంగా ఉంది. ఇక పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేసి రిజైన్ చేసిన పితాని బాలకృష్ణ 2019లో జనసేన తరపున పోటీ చేశారు. కానిస్టేబుల్ కొడుకును అంటూ చెప్పుకునే పవన్‌కళ్యాణ్ మీదే ఆశలు పెట్టుకున్నారు బాలకృష్ణ. టీడీపీ తరపున బలమైన అభ్యర్ధి కావడం, మాజీ ఎమ్మెల్యే అవ్వడం, నియోజకవర్గంలో టీడీపీకు మంచి పట్టు ఉండడం, ఆయనకు పోటీ లేకపోవడం వంటి అంశాలు ఎక్కువ శాతం ముమ్మిడివరం టీడీపీకే వెళ్లిపోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అందరికీ ఆప్షన్ పి.గన్నవరమే...
టీడీపీ, జనసేన పొత్తులు ఖరారై అటు టీడీపీ, ఇటు జనసేన ఎవ్వరు ఎక్కడ తమ అభ్యర్ధిత్వాన్ని కోల్పోయినా వారికి మరో ఆప్షన్‌గా పి.గన్నవరం నియోజకవర్గం కనిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీకి పి.గన్నవరం నియోజకవర్గానికి ఇంచార్జ్ నియమించలేదు. అమలాపురం పార్లమెంటరీ నియోజకరవర్గ ఇంచార్జ్ గంటి హరీష్‌మాధుర్ బాలయోగి అక్కడి పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. గతంలో జనసేనకు పాముల రాజేశ్వరి దేవి ఇంచార్జ్‌గా వ్యవహరించి 2019లో పోటీచేశారు. ఓటమితో తటస్తంగా మారడంతో జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ ఎవ్వరినీ భర్తీ చేయలేదు. అయితే ఇక్కడ వైసీపీ, టీడీపీ ప్రధాన పోటీ ఉండే అవకాశాలుండడంతో ఈ సీటును పొత్తులో భాగంగా టీడీపీకు కేటాయించే అవకాశాలే ఎక్కువ ఉండడంతో అమలాపురం, రాజోలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్ధిత్వాన్ని ఆశించి భంగపడే పరిస్థితి గనుక దారితీస్తే ఆ ఆశావహులకు పి.గన్నవరం నియోజకవర్గం ఆశాకిరణంలా కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.