దళితులకు స్వేచ్ఛ కల్పించండి- సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ
Mudragada Padmanabham: దళిత నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని ముద్రగడ సూచించారు.
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి జగన్ కు లెటర్ రాశారు. ఈసారి దళితుల అంశంపై లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా దళిత వారి పదవులకు వాళ్లే ఓట్లు వేసుకునే విధానం తీసుకురావాలని జగన్‌కు పద్మనాభం సూచించారు. కొన్ని పదవుల్లోనైనా దళితులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అభ్యర్థించారు.
అన్ని పదవులు కాకపోయినా పంచాయతీ స్థాయి ప్రెసిడెంట్, వార్డు మెంబర్లలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉండాలన్నారు. జనాభా 300 నుంచి పైబడిన దళితవాడలను గుర్తించి పంచాయతీలుగా మార్చినప్పుడు వారికి వచ్చిన గ్రాంట్లు అన్నీ వారి ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు పెట్టే వీలు ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కొన్ని ప్రాంతాల్లో మిగతా సమాజిక వర్గాలతో కలిసి ఉన్న దళితులపై నిధులు ఖర్చు పెట్టడం వల్ల మిగిలిన వాళ్లు నష్టపోతున్నారని ముద్రగడ పద్మనాభం తెలిపారు. నాలుగు లేదా ఐదు దళిత కుటుంబాలు ఇతర సమాజిక వర్గాలతో కలిసి ఉండటం వల్ల దళితులకు సంబంధఇంచిన లక్షలాది రూపాయలు గ్రాంటు వాళ్లకే ఖర్చు చేయడం వల్ల మిగతా జనాభా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దళిత నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్లాలని ముద్రగడ సూచించారు.
నాలుగు రోజుల క్రితం కూడా సీఎంకు ముద్రగడ ఓ లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ల అంశంపై సీఎం జగన్ కు ఆ లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్‌పై ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంపై దృష్టి పెట్టాలని లేఖలో ముద్రగడ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. 2019 ఎన్నికల్లో మెజార్టీ నియోజకవర్గాలలో కాపు జాతి మీ గెలుపుకు కృషి చేశారని.. కాపు జాతికి రిజర్వేషన్ కల్పించి మరొకసారి కాపులు మీ విజయానికి ఉపయోగపడేలా చూసుకుంటే బాగుంటుందని సూచించారు.
ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో లేఖ రాయలేదని ముద్రగడ వివరణ
మిగతా కులాలు వారిలాగే కాపు జాతికి వెలుగులు చూపించాలని ముద్రగడ పద్మనాభం జగన్ ను కోరారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లను ప్రజలు దేవుళ్ళులా భావించారు, పేద వర్గాలకు మంచి చేసి మీరు ప్రేమించేందుకు పునాదులు వేసుకోవాలని సలహా ఇచ్చారు. రిజర్వేషన్లు కల్పించుటకు ఆలోచన చేసి పేద కాపులకు న్యాయం చేయాలన్నారు. తన ఈ లేఖల వల్ల జగన్ ఇబ్బంది పడతారని ముద్రగడ పద్మనాభం అనుకున్నారేమో కానీ చివరిలో వివరణ కూడా ఇచ్చారు. తన జాతి కోసం తపన తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచన తనకు లేదని లేఖలో వివరణ ఇచ్చారు. ఈ రెండు లేఖలు కూడా తన వ్యక్తిగతమన్నారు.