Chalamalasetty Sunil: మూడు పార్టీలు, 3 ఓటములు - అయినా ధైర్యం చేసి ఆయనకు టికెట్ ఇచ్చిన జగన్
YSRCP Candidates: కాకినాడ పార్లమెంటు సభ్యునిగా పోటీచేసిన ప్రతీసారి పార్టీలు మారగా.. పోటీ చేసిన మూడు సార్లు ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వైసీపీ తరపున కాకినాడ ఎంపీగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు.
Kakinada ysrcp parlament candidate: కాకినాడ: చాలా కీలకమైన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మల్లిపూడి మంగపతి పళ్లంరాజు, తోట గోపాలకృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham), తోట నరసింహం వంటి కీలకనేతలు గెలుపొందారు... అయితే 2009 నుంచి పార్లమెంటు సభ్యునిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఒక అభ్యర్ధి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన మూడు సార్లు కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీచేసినా, ప్రతీసారి పార్టీలు మారగా.. అప్పటివరకు అధికారంలో ఉన్న పార్టీ, ఆతరువాత ఎన్నికల్లో ఓటమి చెందారు. ఆపార్టీ తరపున కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా బరిలో దిగిన ఆయన ఓటమి చెందడం ఇది మూడోసారి. ఇప్పుడు ఆయన వైసీపీ అభ్యర్ధిగా నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆయనే కాకినాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ (Chalamalasetty Sunil). ఈసారైనా ఆయన గెలుస్తారా.. లేక నాలుగోసారి చేదు అనుభవాన్ని మూటకట్టుకుంటారా అనేది ఎన్నికల ఫలితాల తరువాతే తేలాల్సి ఉంది.
మూడు పార్టీలు... మూడు సార్లు ఓటమి...
కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్ 2009లో తొలిసారిగా కాకినాడ పార్లమెంటు స్థానానికి నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో దిగారు.. కాంగ్రెస్, పీఆర్పీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో జరగ్గా.. పీఆర్పీ తరపున పోటీచేసిన చలమలశెట్టి సునీల్‌పై కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన మంగపతి పల్లంరాజు 34,044 ఓట్లు ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో వైఎస్సార్‌సీపీ తీర్ధం పుచ్చుకున్న సునీల్ వైసీపీ పార్లమెంటు అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీడీపీ తరపున పోటీచేసిన తోట నరసింహారావుపై సునీల్ కేవలం 3,431 ఓట్లు తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2019లో ఈసారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న చలమలశెట్టి సునీల్ మూడోసారి కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ నుంచి బరిలో దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఈసారి వైసీపీ తరపున అనూహ్యంగా బరిలో దిగిన వంగా గీతావిశ్వనాధ్‌పై సునీల్ 25,738 ఓట్లు తేడాతో ఓటమి పాలయ్యారు.
ఈసారైనా గెలుపు వరించేనా...
2009 నుంచి 2019 వరకు జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి మూడు పార్టీల తరుపన మూడు సార్లు ఎన్నికల బరిలో నిలిచిన చలమలశెట్టి సునీల్ ఓటమి చవిచూశారు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ తమ కాకినాడ పార్లమెంటు అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ పేరును ప్రకటించింది. కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, ప్రత్తిపాడు, తుని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తుపై ఎన్నికల బరిలోకి వస్తుండగా జనసేన ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలు మూడుకుపైగా ఉన్నాయి.. ఈనేపథ్యంలో నాలుగోసారి పార్లమెంటు అభ్యర్ధిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న చలమలశెట్టి సునీల్‌కు ఈసారైనా గెలుపు వరిస్తుందా అనేది, ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడక తప్పదు.