Volunteers In Andhra Pradesh: వలంటీర్ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
Pawan Kalyan: వలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా... పని నుంచి తీసేసిన వాళ్లు కూడా తమను తిరిగి నియమించాలని ధర్నా చేస్తున్నారు. కానీ పవన్ వ్యాఖ్యలు మాత్రం కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.
Andhra Pradesh: వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడూ వలంటీర్ వ్యవస్థదే కీలక పాత్ర. పింఛన్ల పంపిణీ నుంచి కీలకమైన సమాచారం తెప్పించుకునేంత వరకు అన్ని బాధ్యతలు వారిదే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వారే ప్రభుత్వానికి కళ్లూ చెవులూ అంటూ వాదిస్తూ వచ్చింది. వారి లేకుంటే అసలు రాష్ట్రంలో చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్పుకుంటూ వచ్చింది.
వలంటీర్ వ్యవస్థ అనేది ఫెసిలిటేటర్ మాత్రమేనని వారి లేకపోయే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదీ ఆగిపోదని ఇవాల్టి పింఛన్ల పంపిణీతో స్పష్టత ఇచ్చింది చంద్రబాబు సర్కారు. వారి ప్రమేయం లేకుండానే కేవలం సచివాలయ సిబ్బందితో రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిపించి వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చింది.
ఎన్నికల నోటిఫికేషన్ పడ్డ తర్వాత వలంటీర్ వ్యవస్థపై అప్పటి ఎన్నికల అధికారి ఆంక్షలు విధించారు. ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రమాదం ఉందన్న ప్రతిపక్షాల ఆరోపణలతో వారిని విధులకు దూరంగా ఉంచారు. అయితే వారు లేకుంటే పింఛన్ల పంపిణీ నుంచి ప్రతి విషయంలో ప్రభుత్వం హ్యాండిక్యాప్ అవుతుందని అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి వాదించారు.
వలంటీర్ వ్యవస్థపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర విమర్శ ప్రతి విమర్సలు జరిగాయి. ప్రభుత్వాధికారులు కూడా వలంటీర్లు లేకుంటే ఏం చేయలేమని చేతులు ఎత్తేశారు. దీంతో ఒక నెల సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. తర్వాత రెండు నెలలు బ్యాంకు ఖాతాల్లో నగదు వేశారు. దీంతో పింఛన్ సొమ్ములకు వెళ్లిన వృద్ధులు ఎండ దబ్బకు తాళలేక చనిపోయారు. దీనిపై కూడా ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయి.
సచివాలయ ఉద్యోగుల పింఛన్లు పంపిణీ చేయాలని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు సీఎస్‌కు లేఖలు రాశారు. వాటిని ఏమాత్రం అప్పటి సీఎస్ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతానికి వలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థతో పింఛన్లు పంపిణీ చేపట్టారు. జులై ఒకటన రాష్ట్రవ్యాప్తంగా ప్రక్రియను పూర్తి చేశారు.
దీనిపై కామెంట్ చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ వలంటీర్ లేకపోతే ఏమీ ఆగిపోదున్నారు. ఇదో సాకుగా చూపించి అమాయకుల జీవితాలతో అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఆడుకున్నారని ఆరోపించారు. వలంటీర్‌లు ప్రభుత్వానికి ఫెసిలిటేటర్‌గా మాత్రమే ఉండాలన్నారు. అలాంటి వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం ఏం చేయలేదనే వాదన కరెక్ట్ కాదన్నారు.
వలంటీర్ వ్యవస్థ లేకపోయినమంత మాత్రం ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చొదన్నారు పవన్ కల్యాణ్. అలాగని ఇప్పటి వరకు పని చేసిన వలంటీర్లకు కచ్చితంగా ప్రత్యామ్నాయాలు చూపిస్తామని అందుకే ఆలోచన చేస్తున్నట్టు వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వలంటీర్లకు ఇచ్చే జీతాలను ఐదు నుంచి పది వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు వలంటీర్ వ్యవస్థ అధికారికంగా తీసివేస్తున్నట్టు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కానీ వారి లేకుండా పాలన సాధ్యమని చేసి చూపించింది. దీని బట్టి చూస్తుంటే వేరే పనులకు వారిని ఉపయోగించుకొని పదివేలు ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ఇప్పటి వరకు 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఉండే వాళ్లు. వలంటీర్ల సంఖ్యను కుదించి వారిని ప్రభుత్వ పాలనలో భాగం చేయాలని కొత్త ప్రభుత్వం చూస్తోందని సమాచారం.
అసలే ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ వల్ల ఆర్థిక భారమే తప్ప ప్రభుత్వానికి, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రు. ఆ వ్యవస్థలేకుండానే అతి పెద్ద పింఛన్ కార్యక్రమం సజావుగా జరిపిన అధికారులకు మిగతావి చిన్నపనులే అన్నారు. అందుకే ఆ వ్యవస్థ ఏర్పాటుపై పునరాలోచించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.