Cyclone Montha Latest News:మొంథా తుపాను బీభత్సం.. కాకినాడ పోర్టుకు 7వ ప్రమాద హెచ్చరిక, విశాఖలో విరిగిపడిన కొండ చరియలు
Cyclone Montha impact on Andhra Pradesh | ఏపీలో మొంథా తుపాను పలు జిల్లాల్లో ప్రభావం చూపుతోంది. తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోకంగా మారింది. తీర ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయి.

Andhra Pradesh Rains | అమరావతి: మొంథా తుఫాను తీవ్రతపై సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా ఏపీ మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. భారీ వర్షాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసి అందుకు అనుగుణంగా సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను నారా లోకేష్ ఆదేశించారు. సోమవారం నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన భారీ వర్షపాతంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు అందుబాటులో ఉండి ప్రజలకు అవసరమైన సహాయక చర్యలలో పాల్గొనాలని సూచించారు. ఆదేశించాను.
వేగంగా కదులుతున్న తుపాను..
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా బలపడిన మొంథా గత 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలి ప్రస్తుతానికి మచిలీపట్నంకి 160 కి.మీ, కాకినాడకి 240 కి.మీ, విశాఖపట్నంకి 320 కిమీ దూరంలో కేంద్రీకృతం అయిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. విశాఖ జిల్లాలోనూ మొంథా తుపాను బీభత్సం సృష్టిస్తోంది. గాజువాక నుంచి యారాడ వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో హహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచించారు. శ్రీకృష్ణాపురంలో ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు కూలిపోయాయి. నెల్లూరులోనూ వర్షం తీవ్ర ప్రభావం చూపుతోంది.
విశాఖపట్నం: మొంథా తుపాను ఏపీలోని తీర ప్రాంత జిల్లాలపై ప్రభావం చూపుతోంది. శ్రీకాకుళం నుంచి మొదలుకుని నెల్లూరు వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుపాను వేగంగా కదుతులూ తీరం వైపు దూసుకొస్తోంది. నేటి రాత్రి కాకినాడ, మచిలీపట్నం మధ్య తుపాను తీరం దాటనుందని అధికారులు తెలిపారు. తీరందాటే సమయంలో గంటకు 90-110 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచనున్నాయి. దీని ప్రభావంతో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయి. బుధవారం సైతం ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాలు, తీర ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అక్కడే వారికి నిత్యావసర సరుకులు, మంచినీళ్లు ఏర్పాటు చేస్తున్నారు.
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా బలపడిన మొంథా
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 28, 2025
గడిచిన 6 గంటల్లో గంటకు 12 కి.మీ వేగంతో కదిలిన తుపాన్
ప్రస్తుతానికి మచిలీపట్నంకి 160 కిమీ, కాకినాడకి 240 కిమీ, విశాఖపట్నంకి 320 కిమీ దూరంలో కేంద్రీకృతం
విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
పోర్టులకు ప్రమాద హెచ్చరికలు జారీ
మొంథా తుపాను నేపథ్యంలో రాష్ట్రంలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని పెంచారు. ముఖ్యంగా కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుకు ఐదో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్ర. మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని, బీచ్‌లు తీర ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లకూడదని సూచించారు. అత్యవసరమైతే తప్పా తీర ప్రాంతాల ప్రజలు భారీ వర్షాల సమయంలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు.






















