(Source: ECI/ABP News/ABP Majha)
ABP Desam Impact: ఏబీపీ దేశం కథనంపై స్పందించిన కలెక్టర్, వీఆర్‌లోకి అల్లవరం ఎస్సై
ఓ కేసులో నిర్లక్ష్యం వహించినదుందుకుగానూ అమలాపురం నియోజకవర్గం అల్లవరం ఎస్సై బి.ప్రభాకర్ రావును వీఆర్ లోకి పంపుతూ ఎస్పీ సుధీర్ ఆదేశాలు జారీ చేశారు.
ఓ కేసులో అల్లవరం ఎస్సై బి.ప్రభాకర్ రావు నిర్లక్ష్యం
అప్పట్లో బాధితుని దీనస్థితిపై ఏబీపీ దేశం కథనం...
స్పందించిన కలెక్టర్, వీఆర్‌లోకి అల్లవరం ఎస్సై
ఏబీపీ దేశం కథనంపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ సీహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ కేసులో నిర్లక్ష్యం వహించినదుందుకుగానూ అమలాపురం నియోజకవర్గం అల్లవరం ఎస్సై బి.ప్రభాకర్ రావును వీఆర్ లోకి పంపుతూ ఎస్పీ సుధీర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 22న తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వడ్డి సునీల్ కుమార్ (26)పై ఇదే గ్రామానికి చెందిన కుంచే సహదేవుడు మరికొంత మంది విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ దాడిలో సునీల్ కుమార్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో అత్యవసర చికిత్స పొందుతుండగా నిందితులపై సాధారణ కేసులు కట్టి వదిలేశారని బాధితుని కుటుంబం ఆరోపించింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది.
స్థానిక పోలీసులు ఉదాసీనత.. బాధితుడికి అన్యాయం
బాధితుని దీన పరిస్థితిపై " ఏబీపీ దేశం".. "పెరట్లోకి గేదె చొరబడిందని ప్రశ్నించిన పాపానికి..! " అనే శీర్షిక తో కధనం రాసింది... సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు నిందితులపై స్థానిక పోలీసులు ఉదాసీనత ప్రదర్శించారని, నిందితుల్లో ఒకరు గల్ఫ్ కూడా వెళ్లిపోయారని బాధిత యువకుని కుటుంబం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుతో పాటు ఏబీపీ దేశం స్టోరీ స్క్రీన్ షాట్స్, పత్రికల క్లిప్పింగ్స్ కూడా ఇందులో జతపరిచారు. ఈ వివరాలు పరిశీలించిన ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి బాధితులకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై ప్రభాకర్ రావు పై చర్యలు తీసుకున్నారు. ఎస్సైని వీఆర్ లోకి పంపుతూ నిర్ణయం తీసుకున్నారు. బాధితుల పక్షాన నిలిచి, ఏబీపీ దేశం ప్రచురించిన వార్తకు సంబంధించిన స్క్రీన్ షాట్ క్లిప్పింగ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
ఏప్రిల్ 22న అల్లవరం మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన వడ్డి సునీల్ కుమార్ (26) ఇంటి పెరట్లోకి ఇదే గ్రామానికి చెందిన కుంచే సహదేవుడుకు చెందిన గేదె చొరబడి అరటి మొక్కలను ధ్వంసం చేసింది. దీనిపై సునీల్ కుమార్ కు సహదేవునికి మధ్య స్వల్ప వాగ్వాదం ఏర్పడింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గేదె యజమాని సహదేవుడు బలమైన కర్ర తీసుకుని వచ్చి ఆదమరచి ఉన్న సునీల్ కుమార్ తలపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అయినా ఏమాత్రం ఆలోచించకుండా కిందపడిపోయిన బాధిత యువకుడి తలపై విచక్షణా రహితంగా కర్రతో మోదడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ పరిస్థితి గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించగా.. బాధిత యువకుని తల్లితండ్రులు రవి కుమార్, రత్నకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఆ సమయంలో పోలీసులు తెలిపారు.
తలకు తీవ్ర గాయాలతో ఆసుపత్రికి..
తలపై తీవ్ర గాయాలపాలైన బాధిత యువకుడు అమలాపురం కిమ్స్ ఆసుపత్రిలో ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుని పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. ఇప్పటికే తలలో రక్తం క్లాట్ ఏర్పడిందని శస్త్ర చికిత్స చేశారని, దాడిలో తల పైభాగం చాలా వరకు ఛిద్రమైందని వైద్యులు తెలిపారని కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంత దారుణంగా దాడి చేసిన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కొందరి సిఫారసులతో వదిలివేశారని, ఆ తరువాత అమలాపురం రూరల్ సీఐకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశాల తర్వాత అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని వాపోయారు. ఇంజనీరింగ్ చదువుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకుణ్ని ఇలా విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత యువకుని కుటుంబం డిమాండ్ చేస్తోంది.