AP News: లూజు పెట్రోల్, డీజిల్ అమ్మకాలు నిషేధం, కారణం ఏంటంటే?
AP Latest News: ఎన్నికల తరువాత చోటుచేసుకున్న అల్లర్లలో అల్లరి మూకలు ప్రధానంగా పెట్రోల్‌తో పలు వాహనాలకు నిప్పుపెట్టడం, రాళ్లు రువ్వడం వంటి హింసాకాండకు పాల్పడిన పరిస్థితి కనిపించింది.
AP Elections News: ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.. కానీ ఎన్నికల తరువాత రాయలసీమ ప్రాంతంలో చెలరేగిన అల్లర్లతో రాష్ట్రంలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఏపీలో జరిగిన ఈ అల్లర్లపై కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ అల్లర్లలో విధ్వంస కాండ చేసేందుకు ప్రధాన అస్త్రం పెట్రోల్ వినియోగం జరిగిందని గుర్తించిన అధికారులు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎన్నికల తరువాత చోటుచేసుకున్న అల్లర్లలో అల్లరి మూకలు ప్రధానంగా పెట్రోల్‌తో పలు వాహనాలకు నిప్పుపెట్టడం, రాళ్లు రువ్వడం వంటి హింసాకాండకు పాల్పడిన పరిస్థితి కనిపించింది.
వాహనాలకే కాదు పెట్రోల్ బాంబులు విసిరి పలు వాహనాలను దగ్ధం చేసిన పరిస్థితి కనిపించింది. అందుకే అధికారులు అప్రమత్తం అయ్యారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్టవేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పెట్రోల్ బంకుల వద్ద కానీ, ఇతర దుకాణాల వద్ద కానీ లూజు పెట్రోల్ విక్రయాలు పూర్తిగా నిషేదించారు. వాహనాల్లో తప్పితే బాటిళ్లలోనూ, డబ్బాల్లోనూ పెట్రోల్ కానీ, డీజిల్ ఆయిల్ కానీ నింపవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ ద్వారా ఈ ఆ దేశాలు జారీ చేయగా రాష్ట్రంలో ప్రధానంగా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన జిల్లాల్లోనూ ప్రాంతాల్లోనూ ఈ నిబంధనను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
అమలాపురం అల్లర్లలో ఇదే తరహా దాడులు..
జిల్లాల పునర్విభజన తరువాత కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు పెట్టిన విషయంపై అమలాపురం కేంద్రంగా చెలరేగిన అల్లర్లలో పెట్రోల్ బాంబుల తరహా దాడులకు పాల్పడిన అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడ్డారు. ముందస్తుగా కుట్రపూరితంగా పథక రచన చేసుకున్న అల్లరి మూకలు పెట్రోల్ ప్యాకెట్లతో వాహనాలు, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లపై దాడులు చేసి ఆపై నిప్పుపెట్టారు. ఈ విధ్వంస కాండలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీవ్రంగా నష్టం వాటిల్లిన పరిస్థితి కనిపించింది. ఈ విధ్వంసకాండకు ముందస్తుగానే ప్రణాళిక సిద్ధంచేసుకున్న దుండగులు అందుకు తగ్గట్టుగా పెట్రోల్ బంకుల నుంచి టిన్నుల్లో పెట్రోల్ తెచ్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
ఆక్వారైతులకు మినహాయింపు నివ్వాలి..
శాంతిభద్రతల పరిరక్షణ నేపథ్యంలో లూజు పెట్రోల్ విక్రయాలు అధికారులు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ముఖ్యంగా ఆక్వారైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఆక్వా సాగులో విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలిగినప్పుడు జనరేటర్లు వెంటనే పనిచేయాల్సి ఉంటుంది. జనరేటర్లు నడవాలంటే డీజిల్ ఆయిల్ పెద్దమొత్తంలో అవసరం ఉంటుంది. అందుకని రైతులు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవసరమైన ఆక్వారైతులు స్థానికంగా ఉన్న ఎస్సై లేదా తహసీల్దార్ ద్వారా అనుమతి పత్రం తీసుకుంటే పెట్రోల్ బంకుల్లో కేవలం డీజిల్ విక్రయాలు చేయాలని కొంత మినహాయింపు ఇచ్చారు.