ఆక్వాలో 3,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు
పశ్చిమ గోదావరిలో ఫిషరీస్ యునివర్సిటీ, ఆక్వా పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీని ద్వార మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలని ప్లాన్ చేస్తోంది.
ఆంధ్రప్రదేస్ ప్రభుత్వం ఫిషరీస్,ఆక్వా రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల నిజాంపట్నం బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలో మత్స్య శాఖలో పెట్టుబడులకు సిద్దం అని స్పష్టం చేశారు. ఏకంగా 3,800 కోట్ల రూపాయలను అక్వా,ఫిషరీస్ రంగాల్లో పెట్టేందుకు రెడిగా ఉన్నామని చెప్పారు. దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తోంది.
ఇప్పుడు ఉన్న ఫిషింగ్ హార్బర్‌లకు తోడు మరో పది కొత్త హార్బర్‌లను, వాటితోపాటు మరో ఆరు ఫిష్ లాండింగ్ సెంటర్‌లను నిర్మించబోతోంది. దీని కోసం 3వేల 800కోట్లను పెట్టుబడిగా పెడతామని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న ఏపీలో మత్స్య, మెరైన్ రంగాల్లో పెట్టుబడులు పెడితే డెవలప్‌మెంట్ పెద్ద ఎత్తున జరుగుతుంది అని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఆ దిశగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది .
ఇటీవల వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా స్కీం కింద 123.52 కోట్ల రూపాయలను 1.23 లక్షల మత్స్యకారుల ఖాతాల్లోకి జమ చేసిన ఏపీ సీఎం ఆ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని స్థాపించబోతున్నట్టు తెలిపారు. నరసాపురం సమీపంలో ఏర్పాటు అయ్యే ఈ ఫిషరీస్ విశ్వ విద్యాలయం ద్వారా రాష్ట్రంలో మెరైన్, ఆక్వా, ఫిషరీస్ రంగాలలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
అతిపెద్ద మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుదారుగా ఉన్న ఏపీలో అవసరాలకు తగిన స్థాయిలో మ్యాన్‌పవర్, వనరుల లభ్యత, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ వంటి విషయాల్లో వెనుకబడి ఉంది. వాటిని ఈ ఫిషరీస్ యూనివర్శిటీ భర్తీ చేస్తుంది అనేది సీఎం ఆలోచనగా అధికారులు చెబుతున్నారు .
దిండిలో 280 ఎకరాల్లో ఆక్వా ఫార్మ్
దిండి సమీపంలో 280 ఎకరాల్లో ఆక్వా ఫార్మ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనివల్ల 11,385 మంది ఆక్వా రైతుల లబ్ధి పొందుతారని ఆయన చెబుతున్నారు. మత్స్యకారులు, మత్స్యకార రైతుల అభివృద్ధి కోసం ఎంత వరకైనా సాయం చెయ్యడానికి తాము రెడీ అంటున్న సీఎం ఇటీవలే 417 కోట్లతో నిజాం పట్నం ఫిషింగ్ హార్బర్ కు శంకుస్థాపన చేశారు.
గత ప్రభుత్వం 5 ఏళ్లలో మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో 104 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే.. తమ ప్రభుత్వం మాత్రం 4 ఏళ్ళలోనే 538 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు జగన్ చెబుతున్నారు. ప్రస్తుతం వేల కోట్ల ఖర్చుతో ఆక్వా,ఫిషరీస్,మెరైన్ రంగాలలో కొత్తగా 10 ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణం, ఫిషరీస్ యూనివర్సిటీ, ఆక్వా ఫార్మ్‌ల వంటివి ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. అవి వాస్తవ రూపం దాల్చితే జీవనోపాధి కోసం మత్స్యకారులు వలసలు వెళ్ళడం వంటి ఘటనలు ఆగిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. మరి అవి ఏ మేరకు వాస్తవ రూపం దాల్చుతాయో చూడాలి.
Also Read: తులసి మొక్కలాంటిది ఈ వాలంటీర్ వ్యవస్థ: సీఎం జగన్
Also Read: వాలంటీర్లపైనే జగన్ ఎక్కున నమ్మకం పెట్టుకున్నారా ? లీడర్లను చేస్తానన్న హామీ దేని కోసం ?