AP News: వృత్తి నిపుణులుగా కౌలు రైతులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP News: ఏపీ ప్రభుత్వం.. ప్రైవేటు ఉద్యోగులతో పాటు వ్యవసాయం రంగంలోని కౌలు రైతులను కూడా వృత్తి నిపుణుల జాబితాలో చేర్చుతోంది.
AP News: ప్రైవేటు ఉద్యోగులతోపాటు వ్యవసాయ రంగంలోని కౌలు రైతులను కూడా ఏపీ ప్రభుత్వం వృత్తి నిపుణుల జాబితాలో కూడా చేర్చారు. ఇతర వృత్తి నిపుణులకు ఇస్తున్న మాదిరిగానే ఇకపై కౌలుదారులను కూడా అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ గా గుర్తిస్తూ.. ఇకపై వీరికి కూడా వ్యక్తిగత రుణాలు అందించేందుకు అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. పంట భూమి లేకపోయినా, వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ గా గుర్తించి జిల్లా యంత్రాంగం రుణాల మంజూరుకు శ్రీకారం చుట్టింది. కౌలు కార్డులు ఉన్నప్పటికీ రుణాలు అందుకోలేక ఇబ్బందులు పడుతున్న కౌలుదారుల దుస్థితిని గుర్తించిన అంబేడ్కర్ కోనసీమ జిల్లా యంత్రాంగం రైతుల పేరిట సెంటు భూమి లేకున్నా... సంబంధిత వీఆర్వో, వీఏవోలు, తహసీల్దార్ సిఫార్సు మేరకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ రుణాలు మంజూరు చేసింది.
540 మంది కౌలు రైతులకు రుణాలు ఇవ్వడమే లక్ష్యం
పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో తొలి విడతగా 10 మండలాల్లోని 10 గ్రామాలను ఎంపిక చేసి, ఆయా గ్రామాల్లో 540 మంది అగ్రికల్చర్ ప్రొఫెషనల్స్ కు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీరిలో 323 మందికి మంగళవారం రుణాలు అందజేశారు. కొత్తపేట మండలం అవిడిలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపిక చేసిన రైతులకు రూ.1,40,58,100 చెక్కు రూపంలో అందజేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ... తొలి దశలో 10 మండలాల్లోను, రెండో దశలో మిగిలిన 22 మండలాల్లోని 25 గ్రామాల్లో విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. వ్యక్తిగత రుణాలతో పాటు ఐదు మండలాల పరిధిలో 38 గ్రూపులకు చెందిన 526 మంది రైతులకు సైతం రుణాలు అందించనున్నారు. 6 నెలల్లో ఫలితాలు చూసి జిల్లాలోని అన్ని గ్రామాలకూ విస్తరిస్తామన్నారు. ఇందుకోసం డీసీసీబీతో పాటు యూనియన్ బ్యాంక్ సైతం ముందుకు వచ్చాయని కలెక్టర్ చెప్పారు.
కౌలు రైతులకు మేలు చేసేలా చేస్తాం..!
అలాగే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. పైలట్ ప్రాజెక్టుగా తమ జిల్లాలో దీన్ని అమలు చేయడం అభినందనీయం అన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి కౌలు రైతులకు మేలు చేసేలా కృషి చేస్తామని వివరించారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ఓ కౌలు రైతు మాట్లాడుతూ.. తమకు రుణం లభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 30 ఏళ్లుగా.. 10 నుంచి 20 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నానని... వడ్డీకి డబ్బులు అప్పుగా తెచ్చుకున్నాని చెప్పారు. కానీ మొదటి సారిగా ప్రభుత్వం నుంచి రుణ సాయం అందిందని, ఇలా సర్కారు సాయం చేస్తే తమ బతుకులు బాగు పడతాయని అన్నారు. అలాగే మరో కౌలు రైతు స్పందిస్తూ.. 3 నుంచి 5 రూపాయల వడ్డీకి డబ్బులు అప్పుగా తెచ్చుకొని, పంటలు పండించే వాళ్లమని చెప్పారు. నష్టం వస్తే అప్పులు పెరిగాయని, అయినా వ్యవసాయన్నే నమ్ముకొని కౌలు రైతుగా కొనసాగుతున్నట్లు వివరించాడు. ఇప్పుడు ప్రభుత్వమే రుణ సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని, వడ్డీ కాస్త తక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.