Chedi Talimkhana: అమలాపురం దసరా స్పెషల్ చెడీ తాలింఖానా - బ్రిటీష్ కాలం నాటి యుద్ధ విద్య, గగుర్పాటు కలిగించే ప్రదర్శనలు
Amalapuram: బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది చెడీ తాలింఖానా అనే యుద్ధ విద్య.. 1856 నుంచి దసరా పండుగను పురస్కరించుకుని అమలాపురంలో ఇది కొనసాగుతూ వస్తోంది..

Amalapuram Amalapuram: : చెడుపై మంచి విజయమే దసరా పండుగగా చెబుతారు.. దేశ సంపదను గుప్పెట్లో పెట్టుకుని భారతీయులను కట్టు బానిసలుగా మార్చిన బ్రిటీష్ పరిపాలకుల దాష్టికాలకు తిరుగుబాటు ద్వారా తగిన బుద్ధిచెప్పేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సహితం ఏదోక యుద్ధ నైపుణ్యాలను నేర్చుకుని సన్నద్ధంగా ఉండేందుకు తాపత్రయ పడేవారు.. సరిగ్గా ఇటువంటి ఆలోచన లోనుంచ బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు సంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది చెడీ తాలింఖానా అనే యుద్ధ విద్య.. 1856 నుంచి దసరా పండుగను పురస్కరించుకుని అమలాపురంలో ఇది కొనసాగుతూ వస్తోంది..
అమలాపురంలోనే ఎందుకు ప్రత్యేకం అంటే..
అమలాపురంలో దసరా పండుగ సందర్భంగా ప్రదర్శించే 'చెడీ తాలింఖానా' (Chedi Talimkhana) అనేది ప్రాచీన యుద్ధవిద్యకళలో ఒకటిగా చెబుతుంటారు.. శారీరక దృడత్వంతోపాటు ఆత్మరక్షణ, కర్రసాము, కత్తులతో ఒళ్లు గగుర్పాటు అయ్యేలా యుద్ధ విన్యాసాలు ఈ సాంప్రదాయిక కళలో భాగంగా చెబుతారు.. ఈ విద్య దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాల్లో ప్రదర్శించబడినా, అమలాపురంలో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో దసరా ఉత్సవాలు దశాబ్దాల చారిత్రక నేపథ్యంలో కలిగి ఉండగా ప్రతి ఏటా దసరా పంగుగ రోజున పట్టణ వీధుల్లో చెడీ తాలింఖానా ప్రదర్శనలు అద్భుతంగా జరుగుతాయి.. అమ్మవారి ఊరేగింపులో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆడపిల్లలు కూడా వీధుల్లో ఆయుధాలతో, కర్రలతో యుద్ధ విన్యాసాలు చేస్తారు. చెడి తాలింఖానాలో యుద్ధ వీరులు ప్రదర్శించే కత్తి సాము, కర్ర సాము, అగ్గి బరాటా తదితర 60 రకాల యుద్ధ విన్యాసాలు చూపరు లకు గగుర్పాటు కలిగిస్తాయి. ఇక పట్టణంలోని ఏడు వీధుల్లో ప్రతిష్టించిన అమ్మవారి మండపాల నుండి వాహనాల (ఐరావతం, హంస వాహనాలు) ఊరేగింపు సాగుతుంది. కళ్ళు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలు బాణాసంచా కాల్పుల మధ్య ఉత్సవాలు జరుగుతాయి. అమలాపురంలో కొంకాపల్లి, మహిపాల వీధి, గండు వీధి, రవణం వీధి, రవణం మల్లయ్య వీధి, నల్లా వీధి, శ్రీరామపురం ఇలా ఏడు వీధులకు చెందిన వాహనాలను పట్టణంలోని అన్ని వీధుల్లో రాత్రంతా ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో ఆయా వీధులకు చెందిన వందలాది మంది యువకులు పోటా పోటీగా చెడీ తాళింఖానా విద్యను ప్రదర్శిస్తారు. కత్తి సాము, కర్ర సాము, లేడి కొమ్ములు, బంతుల తాళ్లు, జువ్వలు, అగ్గి బరాటాలతో యువకులు చేసే ప్రదర్శనలు వీక్షకులకు గగుర్పాటు కలిగిస్తాయి. విజయదశమి రోజు రాత్రి నుండి మరుసటి రోజు తెల్లవారు జాము వరకు ఏడు వాహనాల ఊరేగింపు నిర్వహిస్తారు.
చెడీ తాలింఖానాకు ఆద్యుడు అబ్బిరెడ్డి రాందాసు..
1856లో అబ్బిరెడ్డి రాందాసు (అమలాపురం స్వాతంత్ర్య సమరయోధుడు) ఈ విద్యను కోనసీమ ప్రాంతానికి తీసుకొచ్చాడు. బ్రిటిష్ వారు భారతదేశంలో సైనికులను బలహీనపరచడానికి ఆయుధాలు, శిక్షణలు పరిమితం చేశారు. దీనికి వ్యతిరేకంగా రాందాసు యువకులను శిక్షణ ఇవ్వడానికి కొంకపల్లి, మహిపాల వీధి, గాండు వీధి, రవనం వీధి వంటి చోట్ల శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేసి ఇక్కడ బాక్సింగ్, మల్‌ఖంబ్ (ప్రాచీన యుద్ధకళ) వంటివి నేర్పించాడు. ఈక్రమంలోనే బాల్ గంగాధర్ తిలక్ పిలుపు మేరకు అమలాపురంలో దసరా ఉత్సవాల్లో చెడీ తాలింఖానా ప్రదర్శనలు చేర్చారు. ఇది బ్రిటిష్‌కు వ్యతిరేకంగా యువకుల్లో దేశభక్తి, యుద్ధ నైపుణ్యాలు నింపడానికి ఉపయోగపడిందని చెబుతుంటారు. విజయనగర సామ్రాజ్య కాలంలో (కృష్ణదేవరాయలు) ఈ విద్యకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు అబ్బిరెడ్డి కుటింబికులు చెబుతుంటారు. అదేవిధంగా దసరా రోజుల ఈ విద్యను ప్రదర్శించుకునే విధంగా బ్రిటీష్ పాలకులు అనుమతులు జారీ చేసిన రాజముద్ర కూడా అబ్బిరెడ్డి కుటుంబికులు వద్ద ఉండడం విశేషం.. అయితే అబ్బిరెడ్డి రాందాసు మునిమనవలు ఈవిద్యను నేటికీ కాపాడుతూ రావడం విశేషం..
సినిమాల్లోనూ చెడీతాలింఖానా విద్య సన్నివేశాలు..
దసరా పండుగ దినాన అమలాపురంలో ప్రదర్శించే చెడీతాలింఖానా యుద్ధ విద్యను పలు సినిమాల్లో కొన్ని సన్నివేశాల్లో చూపించిన సందర్భాలున్నాయి.. 2009లో విడుదలైన తెలుగు సినిమా 'మగధీర'లో ఈ విద్యను ప్రదర్శిస్తూ తీసిన సన్నివేశం ఉంది.. అమలాపురం యువకుల ప్రదర్శనలను చూసిన అగ్రదర్శకుడు రాజమౌళి సినిమాలో పెట్టాడంటారు. అదేవిధంగా బాలివుడ్, కోలివుడ్ తదితర చిత్రాల్లోనూ ఈ చెడీతాలింఖానా యుద్ధ విన్యాసాల సన్నివేశాలను పోలిన సన్నివేశాలను తెరకెక్కించారు పలువురు దర్శకులు..
సుదూర ప్రాంతాలనుంచి తరలివచ్చి తిలకించేందుకు ఆసక్తి..
అంబేద్కర్ కోనసీమ జిల్లా దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. జిల్లా వాసులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే విజయదశమి రోజున మాత్రం రెక్కలు కట్టుకుని అమలాపురంలో వాలిపో తారు. పండుగ రోజున ప్రదర్శించే చెడి తాలింఖానా విన్యాసాలు కోసం ముందస్తుగానే ప్లాన్ చేసుకుని ఫ్లైట్ టిక్కెట్లు తీసుకుని మరీ తరలివస్తుంటారు.. ఈ ప్రదర్శనలపై పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించడం వారికి కత్తిమీద సాములా దసరా రోజు గడుస్తుందంటుంటారు..





















