AP News: మహిళ కడుపులో 570 రాళ్లు, అరుదైన సర్జరీ చేసిన అమలాపురం డాక్టర్లు
AP Latest News: మహిళ కడుపులో 570 రాళ్లు ఉండగా.. సర్జరీ చేసి వాటన్నింటినీ అమలాపురం డాక్టర్లు బయటికి తీశారు. ఈ వివరాలను వైద్యులు ప్రకటించారు.
Amalapuram Surgery: అమలాపురం డాక్టర్లు ఓ మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి ఆమె గాల్ బ్లాడర్ నుంచి ఏకంగా 570 రాళ్లను తొలగించారు. అమలాపురంలోని ఏఎస్ఏ హాస్పిటల్ డాక్టర్లు ఈ సర్జరీ చేసి ఘనత సాధించారు. ఈ వివరాలను ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు.
పిత్తాశయంలో రాళ్లు (Gall bladder stones) సమస్య చాలా మంది ఎదుర్కొనే సమస్యే.. గాల్‌స్టోన్స్ చిన్నగా ఉంటే పెద్ద సమస్య ఉండదు కానీ, ఇవి పెద్దగా అయితే కడుపునకు కుడి పైభాగాన సడెన్‌గా, తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కొందరికి అత్యవసరంగా సర్జరీ చేయవలసి వస్తుంది. ఇలాంటి సమస్యతో అమలాపురంలో ఒక మహిళ తీవ్ర ఇబ్బంది పడుతోంది. దీంతో ASA ఆసుపత్రి వైద్యులు అరుదైన చికిత్స ద్వారా ఆ మహిళ కడుపులో ఉన్న 570 రాళ్లు తొలగించారు. వివరాల్లోకి వెళితే..
జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల మహిళ గత కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. ముఖ్యంగా భోజనం తర్వాత ఈ నొప్పి మరీ ఎక్కువగా ఉంటోంది. ఈమెను రెండు రోజుల కిందట దేవగుప్తం నుంచి అమలాపురం ASA హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అక్కడి సర్జన్ డాక్టర్ నర్రా శ్రీనివాసులు పరీక్ష చేసి, స్కానింగ్ చేయించగా, గాల్ బ్లాడర్ (పిత్తాశయం- పసరు సంచి)లో ఒక పెద్ద రాయి (6.1cms) లేక చిన్నవి చాలా ఉండొచ్చు అని అంచనా వేశారు. శనివారం సాయంత్రం (మే 18) లాప్రోస్కోపి విధానం ద్వారా సర్జరీ చేయగా ఏకంగా 570 రాళ్ళు పిత్తాశయంలో ఉన్నవి బయట పడ్డాయి. వాటిని సర్జరీ ద్వారా తొలగించామని ASA ఆసుపత్రి వైద్యులు డాక్టర్ అంజలి తెలిపారు.