Pawan Kalyan Donation: రైతుల కోసం పవన్ కళ్యాణ్ రూ.5 కోట్ల విరాళం - భీమ్లానాయక్ డబ్బులు అన్న జనసేనాని
Pawan Kalyan Donates Rs 5 Crore: భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
Janasena Chief Pawan Kalyan Donates Rs 5 Crore For Farmers: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతుల కోసం రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన డబ్బులో రూ.5 కోట్లను జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని, ఈ నగదును రైతుల కోంస వినియోగించాలని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చెక్కును పార్టీ కోశాధికారి ఏ.వి.రత్నంకు జనసేనాని పవన్ అందజేశారు.
వైఎస్ జగన్ వింత చట్టాలతో కౌలు రైతులకు కష్టాలు..
జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో రైతాంగం చితికిపోయిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కౌలు రైతులను రాష్ట్రంలో పట్టించుకునే నాథుడే లేడనీ, ఏపీ ప్రభుత్వం మాత్రం రైతు భరోసా అని అబద్ధాలు చెబుతుందన్నారు. జగన్ సీఎం అయ్యాక వింత చట్టాలు తీసుకొచ్చి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు దూరం చేశారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల ఇళ్లకు వెళ్లి బాధితులను పరామర్శించి జనసేన పార్టీ ఆర్థిక సాయం చేయం చేయబోతుందని తెలిపారు.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర రైతాంగం చితికిపోయింది pic.twitter.com/1WLSiyNEaL
— JanaSena Party (@JanaSenaParty) April 5, 2022
జనసేన రైతు భరోసా యాత్ర.. (Janasena Rythu Bharosa Yatra)
ఈ నెల 12వ తేదీ అనంతపురం నుంచి రైతులకు ఆర్థిక సాయం చేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కౌలు రైతులకు సాయం చేసే ఈ కార్యక్రమానికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది రాష్ట్రంలో 1019 మంది , రెండో ఏడాది 889 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎన్సీఆర్బీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని దాచిపెడుతోందనన్నారు.
తమ వద్ద ఉన్న ప్రాథమిక సమాచారం మేరకు కర్నూలు జిల్లాలో 353 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా, అనంతరం జిల్లాలో 170 మంది, ప్రకాశంలో 49 మంది, ఉభయ గోదావరి జిల్లాల్లో 87 మంది బలవన్మరణం చెందారని తెలిపారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసిన ముద్దుపెట్టిన జగన్ ఇప్పుడు బయటకు రావడం లేదని.. మాట తప్పారని, మడమ తిప్పారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు.
మళ్లీ పాదయాత్ర చేస్తే సెగ తప్పదు..
రాష్ట్రంలోని రైతులు జగన్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. సీఎం జగన్ మరోసారి పాదయాత్ర చేస్తే వెళ్లిన ప్రతిచోట రైతులు నిరసన తెలుపుతారు. వారు ఎంతో కష్టపడి పంట పండిస్తే ఏపీ ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మక్కై బస్తా రూ.700కు కొని, రూ.1400కు అమ్ముకుంటుందని జనసేన పార్టీ ఆరోపించింది. నివార్ తుఫాను వచ్చి రైతులు నష్టపోతే జనసేన పార్టీ తరఫున ఏకరానికి కనీసం రూ.25 వేల సాయం అందించాలని ధర్నా చేశామని, కానీ సీఎం జగన్ ఏమాత్రం స్పందించలేదన్నారు. 17 లక్షల మంది కౌలు రైతుల్లో 5 లక్షల మందికి కార్డులు అందించే ప్రయత్నాలు చేశారు. ప్రతి గ్రామంలో నష్టపోయిన రైతులు ఉన్నారని, పార్టీ నాయకులు వారి పక్షాన బలంగా నిలబడాలని జనసేన శ్రేణులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Also Read: Jagan PM Meet : రాష్ట్ర సమస్యలే ఎజెండా - ప్రధానితో జగన్ భేటీ