CM Jagan meets Union Ministers: గత ప్రభుత్వం హయంలో అలా చేసి ఇప్పుడెందుకు కోతలు- సరి చేయాలని కేంద్రమంత్రులకు సీఎం జగన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కేంద్రమంత్రులకు విన్నవించుకున్నారు సీఎం జగన్. ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులతో ఆయన సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి(Prime Minister) నరేంద్ర మోదీ(Narendra Modi)తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి(Chief Minister) జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు. మొదటగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్(Nirmala Seetaraman)తో సమావేశమయ్యారు. రెవెన్యూ గ్యాప్ భర్తీ కోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, పెండింగ్ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు, కార్యక్రమాలకు ఖర్చు చేసిన రూ.32,625.25 కోట్లను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో అదనపు రుణాలకు అనుమతిచ్చి, ఇప్పుడు ఆ రుణపరిమితుల్లో కోత విధించడం సరికాదన్నారు. దీన్ని వెంటనే సవరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram)కు సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం తదితర అంశాలపైనా కేంద్ర ఆర్థికశాఖమంత్రితో సీఎం చర్చించారు.
తర్వాత కేంద్ర జలశక్తిశాఖమంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్(Gajendra Singh Shekhawat)తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు పనులను సత్వరంగా పూర్తయ్యేలా తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్థారించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలన్నారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు.
వరద కారణంగా దెబ్బతిన్న పోలవరం ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పునాదులకు సంబంధించి ఈ సమావేశంలో కూడా చర్చ జరిగింది. దిగువ కాఫర్ డ్యాంకు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారు చేసిన అంశాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంకు సంబంధించి డయాఫ్రం వాల్ ఎలా పటిష్టంచేయాలి? లేదా కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై వరుసగా నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, ఇవి కూడా వారం పదిరోజుల్లో ఖరారు అవుతాయని సీఎంకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని సీఎం విజ్ఞప్తిచేశారు.
Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy arrives at Delhi airport to meet Prime Minister Narendra Modi, today pic.twitter.com/AlGMZThJ6A
— ANI (@ANI) April 5, 2022