Pawan Kalyan visit to Tamil Nadu: తమిళనాడ పవన్‌కు బీజేపీ క్యాడర్ స్వాగతాలు - రాజకీయాలు మాట్లాడేందుకు నిరాకరణ
Tamilnadu:తమిళనాడులో పలు ఆలయాలను పవన్ సందర్శిస్తున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Pawan is visiting many temples in Tamil Nadu : కేరళ నుంచి తమిళనాడుకు వెళ్లిన పవన్ కల్యాణ్ పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. మొదట స్వామిమలై శ్రీ స్వామినాథస్వామి వారిని దర్శించుకున్నారు. తర్వాత కుంభకోణంలోని ఆది కుంభేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మంత్రపీఠేశ్వరి అమ్మవారికి అర్చనలు చేశారు. శ్రీ అగస్త్య కుంభముని ధ్యాన పీఠాన్ని సందర్శించారు.
కుంభేశ్వరాలయ దర్శనానికి ఎవరు వచ్చినా మొదట ఆది గణపతి దర్శనం తర్వాతే మూల విరాట్ దర్శించాలన్న నియమం ఉంది. ఆలయ సంప్రదాయం మేరకు పవన్ కళ్యాణ్ ఆదివినాయగర్ ని మొదట పూజిచారు. ఆదికుంభేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత భాంఢం ఆకారంలో ఉన్న శివలింగ విశిష్టతను పవన్ కళ్యాణ్ కి అర్చకులు వివరించారు. అమృతం, ఇసుక కలిసి ఉద్భవించిన ఈ లింగానికి అభిషేకాలు నిర్వహించరు. అందుకే విశిష్ట పూజలు నిర్వహించారు. పంచ హారతులు ఇచ్చి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేశారు.
ఆది కుంభేశ్వరాలయంలో స్వామి వారికి ఎడమవైపు వెలసిన పార్వతీదేవి అవతారం మంగళనాయకి అమ్మాన్. అమ్మవారిని మంత్రపీఠేశ్వరిగానూ కొలుస్తారు. 72 కోట్ల మంత్రాల శక్తి అమ్మవారిలో నిక్షిప్తమై ఉండడం వల్ల అమ్మవారికి ఆ పేరు వచ్చింది. ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆది కుంభేశ్వరాలయ ప్రాంగణంలో ఉన్న మరో విశిష్ట ప్రదేశం శ్రీ అగస్త్య ధ్యాన పీఠ మందిరం. అమ్మవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ ప్రధాన ఆలయానికి నైరుతి దిశలో ఉన్న ఈ ధ్యానపీఠాన్ని సందర్శించారు. ఈ ప్రాంతంలో కూర్చుంటే తెలియకుండానే ధ్యాన ముద్రలోకి వెళ్లిపోతారని ధ్యాన మందిర విశిష్టతను అర్చకులు పవన్ కళ్యాణ్ కి వివరించారు. అంతకు ముందు ఆలయ ఆస్థాన గజం మంగళంతో కలసి అర్చకులు, అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు స్వాగతం పలికారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రముఖ పుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా, ఈరోజు ఉదయం ఆది ప్రణవనాదం ఓంకార మంత్ర రహస్యాన్ని సృష్టికి అందించిన, తమిళనాడు రాష్ట్రం, స్వామిమలై శ్రీ స్వామినాథ స్వామి వారి క్షేత్రాన్ని దర్శించుకుని, షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి… pic.twitter.com/iHQHBwD740
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 13, 2025
ఆలయ ఆస్థాన ఏనుగుకు అరటి పళ్లు అందించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. నాలుగు సంవత్సరాలుగా శ్రీ అగస్త్య మహా ముని ఆలయం, స్వామిమలై శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి చూస్తున్నానని, ఇప్పటికి ఆ మురుగన్ అనుగ్రహం లభించడంతో క్షేత్ర దర్శనం చేసుకోవడానికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయ అంశాల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆలయాల్లో రాజకీయాలు వద్దు అంటూ సున్నితంగా బదులిచ్చారు. స్వామిమలై, కుంభకోణం సందర్శనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ తమిళనాడు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పూల మాలలు, శాలువాలతో బీజేపీ నాయకులు సత్కరించారు. బాణసంచా పేల్చి సంబరాలు చేశారు. తిరుచెందూరు క్షేత్రానికి వెళ్లి అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు



















