ఏపీలో మూడు రోజులు పర్యటించనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!
Nirmala Sitharaman AP Visit: ఏపీ మూడ్రోజుల పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాత్రి విజయవాడ చేరుకోనున్నారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు.
Nirmala Sitharaman AP Visit: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు(అక్టోబర్26) రాత్రి విజయవాడకు చేరుకోనున్నారు. రేపు(అక్టోబర్ 27) ఉదయం పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ప్రాంతంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు(అక్టోబర్ 27) రాత్రికి కాకినాడ చేరుకొని శుక్రవారం రోజు ఐఐఎఫ్టి ప్రాంగణాన్ని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో కలిపి ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం బయల‌్దేరి అక్కడి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులతోపాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పాల్గొననున్నారు.
దత్తత తీసుకున్న పెదమైనవాని లంకకు..
సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదమైనవాని లంకను నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తాను దత్తత తీసుకున్న గ్రామ సందర్శన కోసమే ఆమె ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పెదమైనవాని లంకలో ఏర్పాటు చేసిన డిజిటల్ కమ్యూనిటీ సెంటర్ ఆమె సందర్శించబోతున్నారు. తన దత్తత గ్రామ సందర్శనకు ముందు ఆమె జిల్లాలోని మత్స్యపురం గ్రామాన్ని కూడా సందర్శించనున్నారు. రేపు(అక్టోబర్ 27) ఢిల్లీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న నిర్మల.. అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురం గ్రామానికి చేరుకుంటారు.
గ్రామంలో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాలను పరిశీలించిన అనంతరం ఆమె నర్సాపూర్ మీదుగా పెదమైనవాని లంకకు చేరుకుంటారు. పెదమైనవాని లంక పరిశీలను అనంతరం నర్సాపూర్ మీదుగా ఆమె కాకినాడ చేరుకుంటారు. రేపు(అక్టోబర్ 27) రాత్రికి కాకినాడలో బస చేయనున్న నిర్మల.. శుక్రవారం(అక్టోబర్ 28) కాకినాడతోపాటు విశాఖలో పలు కార్యక్రమాలకు హాజరు అవుతారు. శుక్రవారం(అక్టోబర్ 29) రాత్రి విశాఖలోనే బస చేయునున్న మంత్రి శనివారం(అక్టోబర్ 29) రోజు తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు.
వారం రోజుల క్రితమే తిరుపతి వచ్చిన కేంద్ర మంత్రి..
వారం రోజుల క్రితమే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి వచ్చారు. తిరుపతి జిల్లా మూడు రోజులు పర్యటించారు. అక్టోబర్ 19వ తేదీ మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం గుండా తిరుపతికి బయల‌్దేరారు. తిరుపతిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 .00 గంటలకు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. ఈరోజు రాత్రి తిరుమలలోని పద్మావతి అతిధి గృహంలో బస చేసి, 20వ తేదీన ఉదయం తిరుమల శ్రీవారిని నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు.
తిరుపతిలో జరుగనున్న టాక్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. తిరిగి తిరుమలకు చేరుకుని బస చేశారు. 21వ తేదీ ఉదయం మరోమారు శ్రీవారిని దర్శించుకుని, శ్రీకాళహస్తి దేవస్ధానానికు చేరుకుని స్వామి, అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అటు తర్వాత రోడ్డు మార్గం గుండా మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు.