టిఫిన్ బండిపై వివాదం- పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఆనం- సీఐకు స్ట్రాంగ్ వార్నింగ్
నెల్లూరులో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే అయినా ఒకరితో ఒకరికి పొసగకపోవడమే వచ్చిన పెద్ద సమస్య. ఇప్పుడు కొత్తగా నెల్లూరు రూరల్ పరిధిలో జరిగిన వివాదంలో మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు.
నెల్లూరులో సడన్ గా పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చారు, వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన సిబ్బందిని పోలీస్ స్టేషన్ కి ఎందుకు పిలిపించారంటూ ఆయన సీఐని ప్రశ్నించారు. ఏం విచారణ చేస్తారో చేయండి, నా ముందే వారిని విచారించండి అంటూ పట్టుబట్టారు. చివరకు సీఐ వారిని విడిచిపెడతామన్నా కూడా ఆయన శాంతించలేదు. అన్యాయంగా వారిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యేకి కోపం రావడంతో వెంటనే అధికార యంత్రాంగం వణికిపోయింది. ఏఎస్పీ హిమవతి హుటాహుటిన పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఎమ్మెల్యేకి నచ్చజెప్పాలని చూశారు. ఆ తర్వాత నేరుగా జిల్లా ఎస్పీ విజయరావు కూడా పోలీస్ స్టేషన్ కి పరిగెత్తాల్సి వచ్చింది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పోలీస్ స్టేషన్లో సీఐకి కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. వేణుగోపాల స్వామి దేవస్థానం ఛైర్మన్, సిబ్బందిని విచారణకు పిలిపించి గంటల సేపు స్టేషన్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. దేవస్థానం భూముల్లో కొంతమంది గుడిసెలు వేసుకుని ఆక్రమణకు పాల్పడ్డారని, వారి గుడిసెలను సిబ్బంది తొలగించారని, ఇది తప్పా అని ప్రశ్నించారు. గిరిజనులు అక్కడ గుడిసెలు వేసుకుని టిఫిన్ బండి పెట్టుకుని నడుపుతున్నారు. ఈ క్రమంలో దేవస్థానం సిబ్బంది ఆ గుడిసెలను తొలగించడంతో వివాదం మొదలైంది.
గుడిసెలు వేసుకున్న గిరిజనులు దేవస్థానం సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పోలీసులు స్టేషన్ కి పిలిపించారు. దేవస్థానం సిబ్బంది తరపున ఎమ్మెల్యే ఆనం నేరుగా ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి హల్ చల్ చేశారు. ఆనం రాకతో వెంటనే అడిషనల్ ఎస్పీ హిమవతి అక్కడికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ఆనం.. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఉండటం దారుణం అని అన్నారు. ఆలయ భూముల ఆక్రమణకు పోలీసులు వత్తాసు పలకడం ఏంటని ప్రశ్నించారు.
టిఫిన్ బండి వివాదం..
టిఫిన్ బండి వివాదం చివరకు ఎమ్మెల్యేని స్టేషన్‌కి రప్పించిందని ఇప్పుడు నెల్లూరులో గుసగుసలాడుకుంటున్నారు. ఆ టిఫిన్ బండి ఉన్న ప్రాంతం నెల్లూరు రూరల్ పరిధిలోకి రావడంతో పోలీసులు ఎవరికి సర్ది చెప్పుకోవాలో తెలియడంలేదు. రూరల్ పరిధిలో గిరిజనుల టిఫిన్ బండి తీసేశారంటే, వారికి న్యాయం చేయలేకపోతే కచ్చితంగా ఆ ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ ఉంటుంది. అందుకే పోలీసులు ఈ విషయంలో దేవస్థానం ఛైర్మన్‌ని, ఇతర సిబ్బందిని పిలిపించారు. ఆ దేవస్థానం వ్యవహారాలు మొదటి నుంచీ ఆనం కుటుంబమే చూసుకుంటుంది. సిబ్బంది కూడా ఆనం వర్గానికి చెందిన మనుషులే కావడంతో ఆయన నేరుగా రంగంలోకి దిగారు. దీంతో పరిస్థితి పోలీసులకు కూడా అంతుచిక్కడం లేదు. చివరకు ఎస్పీ నేరుగా పోలీస్ స్టేషన్ కి రావడంతో ఇరు వర్గాలు శాంతించాయి.
ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గానికే పరిమితం అయినా నెల్లూరు నగరంపై ఆయన పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. నగరంలో గడప గడపకు వెళ్తామని గతంలో ప్రకటించారు కూడా. అప్పట్లో ఆయనకు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో విభేదాలుండేవని అంటారు. అనిల్ కి మంత్రి పదవి పోయి, కాకాణికి మంత్రి పదవి వచ్చాక.. ఫ్లెక్సీల విషయంలో హడావిడి జరిగినా ప్రస్తుతం ఇరు వర్గాలు కాస్త ప్రశాంతంగానే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా నెల్లూరు రూరల్ పరిధిలో జరిగిన వివాదంలో మళ్లీ ఆనం రామనారాయణ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి పొలిటికల్ సీన్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. నెల్లూరులో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే అయినా ఒకరితో ఒకరికి పొసగకపోవడమే వచ్చిన పెద్ద సమస్య.