వాట్సాప్ కలిపిన బంధం- 19 ఏళ్ల తర్వాత తండ్రీ కుమారుడిని కలిపిన మెసేజ్
19ఏళ్ల తర్వాత సురేష్ తండ్రి బండ్ల సుబ్బారావు తిరిగి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనారోగ్యంతో మనిషి కాస్త సన్నబడినా.. మునుపటి పోలికలు చూసి అందరూ షాకయ్యారు. కుటుంబ సభ్యుల ఆనందానికి అధుల్లేవు.
అయినవారు కనిపించకుండా పోతే కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. బిడ్డలు కనిపించకుండా పోతే ఏళ్లతరబడి వారికోసం వెదికే తల్లిదండ్రుల్ని మనం చూస్తుంటాం. అలాగే తల్లిదండ్రులు వయస్సు మీదపడటం వల్ల మానసిక సమస్యలతో ఇల్లు వదిలి పెట్టి పోతే వారికోసం వెతికి చివరకు 19ఏళ్ల తర్వాత కన్నతండ్రిని తనదగ్గరకు చేర్చుకున్న కొడుకు కథే ఇది.
నెల్లూరు జిల్లా కోవూరు గమళ్ల పాళెం వాసి బండ్ల సురేష్. కుమారుడిని పెళ్లి చేసిన సురేష్ తండ్రి ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి తండ్రి కోసం సురేష్ వెతకని చోటంటూ లేదు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తెలిసినవారి ద్వారా ఇతర ప్రాంతాల్లో వెతికించారు. అయినా ఫలితం లేకపోయింది. నెలలు గడిచిపోయాయి. సంవత్సరాలు కూడా గడచిపోయాయి.
ఓ రోజు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అందులో తండ్రిని చూసి షాక్ అయ్యాడు. 19ఏళ్ల తర్వాత దొరికిన చిన్న ఆచూకీతో మళ్లీ వెతకడం ప్రారంభించాడు. వాట్సప్ గ్రూప్ లో వచ్చిన మెసేజ్ ద్వారా తండ్రి జాడ తెలుసుకోగలిగాడు సురేష్. వెంటనే కేరళలోని కొట్టాయం వెళ్లాడు. అక్కడ నవజీవన్ ట్రస్ట్ సంరక్షణలో తండ్రి ఉన్నాడని తెలుసుకుని వారిని సంప్రదించాడు. ఆయన ఆనవాళ్లు చెప్పాడు. ఇతర రుజువులు కూడా చూపించాడు. వారి అనుమతితో, తండ్రి అంగీకారంతో ఆయన్ని తిరిగి నెల్లూరు జిల్లా కోవూరికి తీసుకొచ్చాడు సురేష్.
19ఏళ్ల తర్వాత సురేష్ తండ్రి బండ్ల సుబ్బారావు తిరిగి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అనారోగ్యంతో మనిషి కాస్త సన్నబడినా.. మునుపటి పోలికలు చూసి అందరూ షాకయ్యారు. కుటుంబ సభ్యుల ఆనందానికి అధుల్లేవు.
సుబ్బారావు తప్పిపోయి 19ఏళ్లవుతున్నా.. నవజీవన్ ట్రస్ట్ కి ఆయన చేరుకుని కేవలం ఆరు నెలలే అవుతుందని చెబుతున్నారు నిర్వాహకులు. ఆయనకు వైద్యం అందించాలని సూచించారు.
తెలిసినవారు తప్పిపోయి కొన్ని గంటల తర్వాత తిరిగొచ్చినా కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు ఉండవు. అలాంటిది 19 ఏళ్ల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తిని చూసి ఆ కుటుంబ సభ్యులు ఎంత సంబరపడి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ ఊరివారు ఎంతగా ఆశ్చర్యపోయి ఉంటారో ఊహించొచ్చు.