Somireddy Comments: క్వారీల వద్దే తిండి, నిద్ర - మైనింగ్ దోపిడీకి వ్యతిరేకంగా సోమిరెడ్డి దీక్ష
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై మీడియాలో వార్తలొస్తున్నా అధికారులు అటువైపు చూడటంలేదు, తమ గ్రామాలపైనుంచి వెళ్తున్న భారీ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజలు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు.
నెల్లూరు జిల్లాలో క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కి వ్యతిరేకంగా టీడీపీ పోరాటం మొదలు పెట్టింది. టీడీపీ నేతలు ఇటీవల క్వార్ట్జ్ మైనింగ్ జరిగే ప్రాంతాలకు వెళ్లి అధికారులకు సమాచారం ఇచ్చారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పుడు నిరసన దీక్షకు దిగారు. క్వార్ట్జ్ క్వారీల వద్ద ఆయన దీక్ష చేపట్టారు. అక్కడే తిండి, నిద్ర ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు అక్రమ మైనింగ్ ఆగే వరకు తాను ఇక్కడే ఉంటానంటున్నారు సోమిరెడ్డి.
సోమిరెడ్డి దీక్షకు జిల్లా టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. ఆయన వద్దకు వెళ్లి పరామర్శించారు. రాత్రి వేళ క్వారీల వద్ద దీక్షకు దిగిన సోమిరెడ్డిని కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరామర్శించారు. ఆయన దీక్షకు సంఘీభావం తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా సోమిరెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించారు. రాత్రి వేళ ఆయన వద్దే కొంతసేపు ఉన్నారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సహజ వనరులను అధికార వైసీపీ నేతలు దోచుకుంటున్నారని మండిపడ్డారు కోటంరెడ్డి. ఇక రెండు నెలలు మాత్రమే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అన్నారు. ఎన్నికల తర్వాత భవిష్యత్ లో వైసీపీ ఎప్పటికీ అధికారాన్ని చూడలేదన్నారు కోటంరెడ్డి.
నెల్లూరు జిల్లాలో సిలికా, ఇసుక, క్వార్ట్జ్ ను ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు కోటంరెడ్డి. ధ్వంసం అవుతున్న గ్రామాల్లోని రోడ్లుకోసం కొంతమంది నిరసనలకు దిగుతున్నారని, ప్రజలు ప్రశ్నిస్తే ఇది జగన్మోహన్ రెడ్ది వ్యాపారం అని బదులు చెబుతున్నారని, నాయకులు అంతగా తెగించారని చెప్పారు కోటంరెడ్డి. మంత్రి కాకాణి సొంత గ్రామానికి సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కోటంరెడ్డి.
ఇటీవల కొంతకాలంగా నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం వార్తల్లోకెక్కుతోంది. ముఖ్యంగా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సొంత ఊరికి సమీపంలో అక్రమ మైనింగ్ జరుగుతుందనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ.. రెడ్ హ్యాండెడ్ గా మైనింగ్ యంత్రాలను పట్టుకున్నారు. టీడీపీ నేతల్ని చూడగానే అక్రమంగా తవ్వేస్తున్న వాహనాల నిర్వాహకులు అక్కడినుంచి పారిపోయారు. ఆ వాహనాలను టీడీపీ నేతలు అధికారులకు అప్పగించారు. ఈ క్రమంలో అధికారులు తాము ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామని ఫోన్ లో సమాచారం ఇవ్వడం గమనార్హం.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై మీడియాలో వార్తలొస్తున్నా అధికారులు అటువైపు చూడటంలేదు, తమ గ్రామాలపైనుంచి వెళ్తున్న భారీ వాహనాల వల్ల రోడ్లు దెబ్బతింటున్నాయని ప్రజలు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదు. దీంతో టీడీపీ నేతలు ఇలా బహిరంగ నిరసనలకు దిగారు. సోమిరెడ్డి, కోటంరెడ్డి, కురుగొండ్ల.. ఇలా ఒకరి తర్వాత మరొకరు రంగంలోకి దిగుతున్నారు. వైసీపీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. మొత్తమ్మీద ఈసారి తాడోపేడో తేల్చుకోడానికే టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఈ విషయంలో మంత్రి కాకాణిని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.