శవాలపై చిల్లర కాదు- శవాలతో కరెన్సీ వ్యాపారం
ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ఓ ముఠాగా తయారయ్యారు. వీరు చెప్పిందే రేటు, మనుషులకు ఓ రేటు, శవాలకు ఓ రేటు.
శవాలపై పడిన చిల్లర ఏరుకోవడం అనేది పాత సామెత, కానీ శవాల్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ చేయడం అనేది కొత్త నానుడి. అవును, ఇప్పుడు ఏపీలో శవాలని అడ్డు పెట్టుకుని ప్రైవేట్ అంబులెన్స్ లు కాసుల దోపిడీకి సిద్ధపడ్డాయి. గతంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఇలాంటి ఘటన జరిగింది. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు అడిగినంత డబ్బులు ఇవ్వలేని తండ్రి తమ ఊరినుంచి మరో అంబులెన్స్ పిలిపించాడు. కానీ ఆ అంబులెన్స్ రుయా ఆస్పత్రిలోకి రావడానికి ఇక్కడి డ్రైవర్ల మాఫియా అడ్డు తగిలింది. దీంతో చేసేదేం లేక ఆ అంబులెన్స్ వరకు కన్నకొడుకు శవాన్ని భుజాన మోస్తూ బైక్ పై వెళ్లాడు తండ్రి. ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో రెండు ఘటనలు ఇలాగే సభ్యసమాజానికి మాయని మచ్చలా మారాయి. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మరోసారి ఇలాంటి ఘటన వెలుగులోకి రావడం దారుణం.
ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్లు ఓ ముఠాగా తయారయ్యారు. వీరు చెప్పిందే రేటు, మనుషులకు ఓ రేటు, శవాలకు ఓ రేటు. ఆ రేటు చెల్లించకపోతే ఏ ఒక్క ఆంబులెన్స్ కూడా కదలదు. ఒకరు రేటు ఫిక్స్ చేశారంటే, మిగతావారు కూడా అదేమాట మీద ఉంటారు. ఒకరికి కాకపోయినా ఇంకొకరికి గిరాకీ తగులుతుంది. కాదని బయటనుంచి ఆంబులెన్స్ లు తెచ్చే ధైర్యం ఎవరికీ లేదు. అందుకే వీరికి అడ్డు లేకుండా పోతోంది.
17కిలోమీటర్లకు 4వేల రూపాయలు..
ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కోట మండలం తిమ్మనాయుడు ప్రాంతానికి చెందిన యువకుడు చనిపోయాడు. గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టమ్ కోసం శవాన్ని తీసుకొచ్చారు. పంచనామా అయిపోయిన తర్వాత మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ప్రైవేట్ అంబులెన్స్ ని మాట్లాడారు కుటుంబ సభ్యులు. 17 కిలోమీటర్ల దూరానికి అంబులెన్స్ డ్రైవర్ 4 వేల రూపాయలు అడిగారు. తాము అంత ఇవ్వలేమని చెప్పారు. కాసేపు అక్కడే వేచి చూశారు. ఒకరు కాకపోయినా, ఇంకొకరైనా అంబులెన్స్ లో తీసుకెళ్తారనుకున్నారు. కానీ అందరూ ఓ ముఠా కావడంతో ఎవరూ ముందుకు రాలేదు.
మరో వాహనం కూడా రాకూడదు..
అదేమీ ప్రైవేటు ఆస్పత్రి కాదు, ప్రైవేటు ప్రాపర్టీ అంతకన్నా కాదు. ప్రభుత్వ ఆస్పత్రిలోకి కూడా వేరే వాహనం వచ్చి పేషెంట్లను కానీ, మృతేదాహాల్ని కానీ తీసుకెళ్లే వీలు లేదు. అంతలా అక్కడ అంబులెన్స్ ల మాఫియా చెలరేగిపోయింది. తాజాగా జరిగిన పోస్ట్ మార్టమ్ కేసులో కూడా బయటనుంచి మరో అంబులెన్స్ ని తక్కువధరకు మాట్లాడి తెచ్చుకున్నా.. ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఉన్న డ్రైవర్లు వారితో గొడవకు దిగారు. ఈ గొడవ పెద్దది కావడంతో చివరకు పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. మృతదేహాన్ని అక్కడినుంచి తరలించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇలాంటి పరిస్థితులున్నాయి. ఆస్పత్రుల సమీపంలోనే అంబులెన్స్ లు ఉంటాయి. వారు చెప్పినంత రేటు ఇస్తేనే అంబులెన్స్ తీస్తారు, లేదా పడిగాపులు పడాల్సిందే. బయటనుంచి మరో వాహనం రావడానికి కూడా వీలు లేదు. గతంలో ఇలాంటి ఘటనలపై సీరియస్ గా ఉంటామని మంత్రులు చెప్పారు. కానీ ఇప్పటి వరకూ అంబులెన్స్ మాఫియాపై చర్యలు తీసుకోలేదు.