Prakasham News: రాధను హత్య చేసింది ఎవరు? భర్తపై పోలీసుల అనుమానం - కోటి రూపాయల ఇన్సూరెన్స్ కారణమా?
అన్నిటికంటే పెద్ద అనుమానం కోటిన్నర రూపాయల ఇన్సూరెన్స్ తో మొదలైంది. ఇటీవలే రాధ పేరుమీద భర్త మోహన్ రెడ్డి కోటిన్నర రూపాయల ఇన్సూరెన్స్ చేయించారు. ఆ విషయం బయటపడటంతో ఆయనమీదకు అనుమానం మళ్లింది.
ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టించిన రాధ అనే వివాహిత హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ హత్యకు సంబంధం ఉందని రాధ స్నేహితుడు కాశిరెడ్డికోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే అదే సమయంలో రాధ భర్త మోహన్ రెడ్డిపై కూడా పోలీసులకు అనుమానం పెరిగింది. అందుకే ఆయన్ను కూడా పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ చేపట్టారు. కూపీ లాగుతున్నారు.
భర్తపై అనుమానం ఎందుకు..?
భార్య పుట్టింటిరి రాగా, భర్త ఆమెతో రాలేదు. కనీసం ఆమె బాకీ వసూలు చేసుకోడానికి వెళ్లినా కూడా వెంట భర్త లేడు. ఇక అన్నిటికంటే పెద్ద అనుమానం కోటిన్నర రూపాయల ఇన్సూరెన్స్ తో మొదలైంది. ఇటీవలే రాధ పేరుమీద భర్త మోహన్ రెడ్డి కోటిన్నర రూపాయల ఇన్సూరెన్స్ చేయించారు. ఆ విషయం బయటపడటంతో ఆయనమీదకు అనుమానం మళ్లింది. ఆ విషయాన్ని రూఢీ చేసుకునేందుకు తెలంగాణ నుంచి భర్త మోహన్ రెడ్డిని పోలీసులు పిలిపించారు, విచారణ మొదలు పెట్టారు.
అప్పుతోనే విభేదాలు..
స్నేహితుడు కాశిరెడ్డికి.. రాధ, మోహన్ రెడ్డి దంపతులు రూ.80 లక్షలు అప్పు ఇచ్చారు. అయితే కాశిరెడ్డి తిరిగి డబ్బు ఇవ్వకపోవడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. అవి గొడవలకు దారితీసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ విడిపోయేదాకా వ్యవహారం వెళ్లిందని అంటున్నారు. అదే సమయంలో భర్త కోటిన్నర రూపాయల ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారమే రాధ హత్య జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలంలో జిల్లెళ్లపాడులో ఈ నెల 17వ తేదీ రాత్రి రాధ హత్య జరిగింది. రాధను హత్య చేయడానికి ఆర్థిక కారణాలా? లేదంటే ఇతర అంశాలేమైనా ముడిపడి ఉన్నాయా?.. ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. ఆమెను హత్య చేసిందెవరు? చేయించింది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.
కాశిరెడ్డిపై అనుమానం ఉన్నా..
రాధ హత్య జరిగిన రోజు ఆమెకు కాశిరెడ్డి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెబుతున్నారు ఆమె కుటుంబ సభ్యులు. ఆ కాల్ తోనే ఆమె అతడిని కలిసేందుకు వెళ్లిందని అంటున్నారు. అయితే కుటుంబ సభ్యులెవరూ ఆమెతో తోడు ఎందుకు వెళ్లలేదనేది అసలు ప్రశ్న. పెద్ద మొత్తంలో బాకీ వసూలు చేసుకోడానికి రాధ వెళ్తున్న క్రమంలో, ఆర్థిక లావేదీవీల సమయంలో కనీసం కుటుంబ సభ్యులు తోడుగా ఎందుకు వెళ్లలేదనే అనుమానాలు మొదలవుతున్నాయి. అసలు రాధను అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
రాధ హత్యతో ఒక్కసారిగా ప్రకాశం జిల్లా ఉలిక్కిపడింది. ఒక వివాహితను అత్యంత కిరాతకంగా హింసించి చంపేంత కసి స్నేహితుడికి ఉంటుందా, కేవలం అప్పు తీర్చలేకపోవడం వల్ల, అంత కసి పెంచుకుని అతడు చంపిస్తాడా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైరు భర్త విషయంలో కూడా అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో పోలీసులు పక్కా ఇన్ఫర్మేషన్ సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులకోసం గాలిస్తున్నారు. మూడు రాష్ట్రాలకు టీమ్ లను పంపించి విచారణ చేపట్టారు.