వెంటబడిన ఎస్సై, స్పీడ్ పెంచిన ప్రియుడు, ప్రాణం విడిచిన ప్రియురాలు!
ఓ ప్రేమజంట పలుకూరు గ్రామ శివారులో కారులో ఉండగా కందుకూరు రూరల్ ఎస్సై శివ నాంచారయ్య వారి వద్దకు వెళ్లాడు. ఆ క్రమంలో అతను వారిని బెదిరించాడని, సెల్ ఫోన్లో ఫొటోలు తీసిబెదిరించాడని సమాచారం.
జంటగా చేరి ఊసులాడుకునే ప్రేమికులంటే చాలామందికి బాగా అలుసు. వారి వద్దకు వెళ్లి బెదిరించడం, డబ్బులు అడగటం, లేదా వారిని ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. సరిగ్గా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పలుకూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది.
ఓ ప్రేమజంట పలుకూరు గ్రామ శివారులో కారులో ఉండగా కందుకూరు రూరల్ ఎస్సై శివ నాంచారయ్య వారి వద్దకు వెళ్లాడు. ఆ క్రమంలో అతను వారిని బెదిరించాడని, సెల్ ఫోన్లో ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరించాడని సమాచారం. ప్రియుడు మహేష్ డబ్బులిస్తానంటూ బతిమిలాడుకున్నా ఎస్సై వినలేదట. దీంతో మహేష్ తన ప్రేయసితో కలసి కారులో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడని, ఎదురుగా వస్తున్న బస్సుని తప్పించబోయి, మరో బైక్ ని ఢీకొట్టి, ఆ తర్వాత చెట్టుని కారుతో ఢీకొట్టాడు మహేష్. ఈ ప్రమాదంలో ముందు సీటులో ఉన్న యువతి అక్కడికక్కడే చనిపోగా, మహేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మహేష్ పై కేసు నమోదు..
ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదానికి కారణం అయ్యాడంటూ పోలీసులు మహేష్ పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మహేష్ ఎస్సైపై ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను కారు వేగంగా నడపడానికి కారణం ఆ ఎస్సై అని, అతని వల్లే ప్రమాదం జరిగిందని మహేష్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు. అయితే యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నెల్లూరు జిల్లాలోకి రావడంతో బాధితుడి బంధువులు నెల్లూరు పోలీసుల్ని కూడా ఆశ్రయించారు.
ఎవరా యువతి..?
మహేష్ అనే వ్యక్తితోపాటు ఉన్న ఆ యువతి ఎవరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఆ యువతికి భర్త లేకపోవడంతో మహేష్ తో చనువుగా ఉంటుందని చెబుతున్నారు. ఆ యువతి గతంలోనే ఎస్సైకి తెలుసని, ఆమెను టార్గెట్ చేసి ఎస్సై ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్లాడనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద మహేష్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఇది కేవలం ఓ ప్రమాదంగానే మిగిలిపోయేది.
ఎస్సై స్థాయి వ్యక్తి దగ్గరకు వచ్చి ఫొటోలు తీయడం, ఆ ఫొటోలు చూపించి బెదిరించడంతో మహేష్ వెంటనే తప్పించుకుని పారిపోవాలని చూశాడు. తనతోపాటు యువతిని కూడా కారులో ఎక్కించుకుని అక్కడినుంచి వేగంగా ముందుకు కదిలాడు. పోలీసుల కళ్లుగప్పి పారిపోయే క్రమంలో యాక్సిడెంట్ చేసి ఆ యువతి మరణానికి కారణం అయ్యాడు మహేష్. అయితే అసలు కారణం ఎస్సై అంటూ అతను ఆస్పత్రి నుంచే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రెండు జిల్లాల ఎస్పీల ఆరా..
ఈ వ్యవహారంపై రెండు జిల్లాల ఎస్పీలు ఆరా తీశారు. కందుకూరు ఎస్సై నెల్లూరు జిల్లా పరిధిలోకే వచ్చినా ఎస్సై ఫొటోలు తీసిన ఘటన ప్రకాశం జిల్లా పరిధిలో ఉంటుంది. తిరిగి యాక్సిడెంట్ అయింది నెల్లూరు జిల్లా లిమిట్స్ లోనే కావడం విశేషం. అందులోనూ ఎస్సైపై నేరుగా ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీలు ఈ కేసుపై దృష్టిపెట్టారు.