(Source: ECI/ABP News/ABP Majha)
New District Politics In Nellore: ఆనం స్టార్ట్ చేస్తే ఆదాల కొనసాగిస్తున్నారు, నెల్లూరు వైసీపీకి కొత్త తలనొప్పి
ఏపీలో కొత్త జిల్లాల రాజకీయం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. అధికార పార్టీ నుంచే నేతలు కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపక్షం నుంచే కాకుండా అధికార పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లాలో ఇది మరింత ఎక్కువగా ఉంది. వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కొనసాగించాలంటూ ఇటీవల ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఏకంగా నిరాహార దీక్షలకు సైతం దిగారు. నిరసనకారులతో కలసి ఆయన కూడా పోరాటాల్లో పాల్గొంటున్నారు. అటు చిత్తూరు జిల్లాలోనే నగరి నియోజకవర్గాన్ని కొనసాగించాలంటూ మరో ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ కి లేఖ రాయడంతోపాటు, పర్సనల్ అపాయింట్ మెంట్ కూడా అడిగారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లైన్లోకి వచ్చారు. ఆయన గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కొనసాగించాలంటున్నారు. నెల్లూరులో అదనంగా చేరుస్తున్న కందుకూరుని ప్రకాశంలోనే ఉండనీయాలంటున్నారు.
ఆదాల ప్రధాన డిమాండ్ ఏంటి..?
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రధానంగా రెండు నియోజకవర్గాలపై పట్టుబట్టడం విశేషం. నెల్లూరు జిల్లాలో మమేకమై అభివృద్ధి చెందిన గూడూరు ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని కోరుతున్నారు ఆదాల. ముఖ్యమంత్రి జగన్ కి , నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకి ఆయన లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెబుతూనే.. ఆ రెండు నియోజకవర్గాల విషయంలో మెలిక పెట్టారు ఆదాల.
చిన్న జిల్లాల విభజన వల్ల సత్వర ప్రగతి సాధ్యమవుతుందని అంటున్న ఆదాల, కందుకూరు నియోజకవర్గ ప్రజలు పని మీద నెల్లూరుకు రావాలంటే 110 కిలోమీటర్ల దూరం రావాల్సి ఉంటుందని, అదే ఒంగోలు వారికి 40 కిలోమీటర్ల దూరంలో ఉండి అందుబాటులో ఉందని తెలిపారు. గూడూరు నియోజకవర్గాన్ని బాలాజీ జిల్లాలో కలపడం వల్ల ఇక్కడి ప్రజలు 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి జిల్లా కేంద్రం తిరుపతికి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. తద్వారా ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు.ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కందుకూరును ప్రకాశంలో, గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇంత లేటెందుకు..?
జిల్లాల విభజనపై నోటిఫికేషన్ విడుదల కావడం, అభ్యంతరాలు తెలపాలని చెప్పడం జరిగి రోజులు గడుస్తున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి కాస్త ఆలస్యంగా స్పందించారు అనుకుంటే, ఆదాల మరింత ఆలస్యంగా తన విజ్ఞప్తిని జనంలోకి తెస్తున్నారు. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటుకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాలనుంచే పాలన సాగాలని కూడా సీఎం జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన కసరత్తులన్నీ పూర్తవుతున్నాయి. కొత్త జిల్లాల్లో కలెక్టరేట్ భవనాలకు కూడా అధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. కొత్త బిల్డింగ్ ల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దాదాపుగా అభ్యంతరాలన్నిటినీ.. కలెక్టర్లే వడపోస్తారని, ఆపై ప్రభుత్వానికి చేరుస్తారని సమాచారం. అంటే కలెక్టర్ల వద్దే అభ్యంతరాలన్నీ వీగిపోతాయనమాట. ప్రభుత్వం సుముఖంగా ఉన్నవాటినే ఉన్నతాధికారుల కమిటీకి పంపిస్తారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తుంది. అయితే ఇలా బహిరంగ లేఖలు, ప్రదర్శనల ద్వారా ఫలితం ఉండదని అంటున్నారు. సీఎం జగన్ సుముఖంగా ఉంటే అంతా చర్చలతోనే పరిష్కారం అవుతుంది. ఆయన అంగీకారం లేకపోతేనే.. ప్రజల కంటితుడుపుగా ఇలా నాయకులు లేఖలతో సరిపెడుతుంటారు.