Anil Challenges Anam: నాపై ఆనం గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా- అనిల్ సంచలన వ్యాఖ్యలు
MLA Anil Kumar challenges Anam: సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీనుంచి తాను బరిలో దిగుతానని, టీడీపీ తరపున బరిలోకి దిగి ఆనం తనను ఓడిస్తే రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు అనిల్.
YSRCP MLA Anil Kumar challenges Anam: రాజీనామా విషయంలో ఆనం రామనారాయణ రెడ్డి నుంచి ఊహించని సవాల్ ఎదురవడంతో ఎమ్మెల్యే అనిల్ వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేస్తే వెంటనే ఎన్నికలొస్తాయని, ఫలితాలు వచ్చిన మూడు నెలల్లోనే మళ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశముందని, అందుకే ఇప్పుడు రాజీనామాలు వద్దని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తలపడతామని ఆనంకు అనిల్ బదులిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు సిటీనుంచి తాను బరిలో దిగుతానని, టీడీపీ తరపున ఆనం బరిలో దిగితే ఆయన్ను ఓడిస్తానన్నారు. అలా జరక్కపోతే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు అనిల్. అనిల్ వ్యాఖ్యలు నెల్లూరు రాజకీయాల్లో మరింత సంచలనంగా మారాయి. ఓవైపు పార్టీలోనే కొంతమంది నేతలు ఆయనకు వ్యతిరేకంగా మారితే, ఇప్పుడు టీడీపీ నాయకులు కూడా అనిల్ ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు.
ఆనం కోరిక తీరుస్తా..
నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టిన ఆనం రామనారాయణ రెడ్డి.. తన రాజకీయ జీవితాన్ని నెల్లూరుతోనే ముగించాలని ఉందని చెప్పారు. తాను మొదట ఎమ్మెల్యేగా ఎన్నికైన నెల్లూరు నుంచే, తనకు చివరిగా ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని ఉందన్నారు. ఆ కోరికను తాను తీరుస్తానని, అయితే ఆనంను ఎమ్మెల్యేగా ఎన్నిక కానివ్వబోనని, ఆయన రాజకీయ చరిత్రను నెల్లూరులోనే ముగించేస్తానంటూ సెటైర్లు పేల్చారు. దమ్ముంటే ఆయన నెల్లూరు సిటీ టీడీపీ టికెట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. సుదీర్ఘ రాజకీయ కుటుంబం తమది అని జబ్బలు చరుసుకునే ఆనం రామనారాయణరెడ్డి రాజకీయ జీవితాన్ని నెల్లూరులోనే ముగించేస్తానని అన్నారు అనిల్ కుమార్ యాదవ్.
నిన్న అరేయ్ ఒరేయ్.. ఈరోజు వాడు వీడు
నారా లోకేష్ పై కూడా అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రెస్ మీట్ లో అరేయ్, ఒరేయ్ అంటూ లోకేష్ ని సంబోధించిన అనిల్.. ఈరోజు వాడు వీడు అంటూ మాట్లాడారు. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టు, వాడిని పట్టుకుని అధికారంలోకి వస్తారా..? అంటూ టీడీపీ నేతల్ని ప్రశ్నించారు. తనది లోకేష్ స్థాయి కాదని, రెండు సార్లు ప్రజా క్షేత్రంలో గెలిచి తాను ఎమ్మెల్యే అయ్యానని, లోకేష్ ఎమ్మెల్యేగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు. తాత సీఎం, తండ్రి సీఎం అయిఉండి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడంటే లోకేష్ స్థాయి ఏంటో తెలిసిపోతుందని అన్నారు అనిల్.
ఆనం కుటుంబం పెద్దది, చరిత్ర ఉన్నది అని చెప్పుకుంటున్న రామనారాయణ రెడ్డి, లోకేష్ ముందుకెళ్లి చేతులు కట్టుకుని సార్ సార్ అని అనడం ఎందుకని ప్రశ్నించారు అనిల్. లోకేష్ ప్రాపకం కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. అది యువగళం కాదని, వృద్ధులంతా కలసి నడుస్తున్న వృద్ధగళం అని కౌంటర్ ఇచ్చారు.
వరుస ప్రెస్ మీట్లతో నెల్లూరు రాజకీయం వేడెక్కింది. అనిల్ ఒంటరిగా ప్రెస్ మీట్లు పెడుతూ లోకేష్ పై మండిపడుతున్నారు. అటు టీడీపీ నుంచి అందరూ అనిల్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనిల్ పై మూకుమ్మడిగా దాడి జరుగుతున్నా.. వైసీపీ నుంచి సపోర్ట్ మాత్రం లేదు. దాదాపుగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనిల్ ఒంటరిగా మారారనే చెప్పుకోవాలి.