Volunteers In Nellore: రాష్ట్రమంతా వాలంటీర్లకు అవార్డులు, ప్రశంసలు - నెల్లూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్
Village And Ward Volunteers In Nellore: రాష్ట్రమంతా వాలంటీర్ల సేవలను గుర్తించి వారిని ప్రశంసిస్తూ అవార్డులు ఇస్తుంటే.. నెల్లూరు జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
Village And Ward Volunteers: గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లకు రాష్ట్రవ్యాప్తంగా పురస్కార ప్రదానోత్సవాలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పురస్కారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించగా అన్ని జిల్లాల్లో స్థానిక నాయకులు, ఎమ్మెల్యేలు వాలంటీర్లకు పురస్కారాలిస్తున్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేస్తూ వారు చేస్తున్న పనుల్ని ప్రశంసిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఓ పండుగలా జరుగుతోంది. అయితే నెల్లూరులో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. నెల్లూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో వాలంటీర్లకు చీవాట్లు పడ్డాయి. ఇద్దరు ఎమ్మెల్యేలు వాలంటీర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
వెంకటగిరిలో ఆనం..
ఇదే మొదటి, చివరి హెచ్చరిక, ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగోదంటూ సచివాలయ స్టాఫ్ కి, వాలంటీర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Venkatagiri MLA Anam Ramnarayana Reddy). రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం వాలంటీర్ల ప్రతిభా ప్రోత్సాహకాలను అందిస్తున్న క్రమంలో వాలంటీర్లకు ఈరేంజ్ లో వార్నింగ్ పడటం కలకలం రేపింది. ప్రతిభా పురస్కారాలు తీసుకోడానికి వాలంటీర్లు రాకపోవడంతో ఫైర్ అయ్యారు ఆనం. అవార్డులు తీసుకోడానికి వాలంటీర్లకు నామోషీ అయితే, అలాంటి వాలంటీర్లు అక్కర్లేదని అన్నారు. సచివాలయం స్టాఫ్ ఐడీ కార్డులు లేకుండా ఎందుకొచ్చారని మండిపడ్డారు. ఎంపీడీవోపై కూడా వేదికపైనుంచే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం ఉగ్రరూపం చూసి సచివాలయ ఉద్యోగులు వణికిపోయారు. క్రమశిక్షణ లోపిస్తే.. కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు ఆనం.
కోవూరులో ప్రసన్న..
కోవూరు నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇక్కడ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వాలంటీర్లపై విరుచుకుపడ్డారు. ఓవైపు పురస్కారాలు ఇచ్చి ప్రశంసించిన ప్రసన్న, మరోవైపు వారి పనితీరు మార్చుకోవాలని హితవుపలికారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రజలకు మేలు చేయడంతోపాటు, ప్రభుత్వం పథకాలను తప్పనిసరిగా ప్రచారం చేయాలని లేకపోతే దానివల్ల ఫలితం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి. నేతలు చెప్పినట్టు చేస్తే.. ప్రజల్లో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పారు ప్రసన్న. నేతల ఆదేశాల ప్రకారం వాలంటీర్లు నడుచుకోవాలన్నారు, సంక్షేమ పథకాల గురించి మరింత ప్రచారం చేయాలని చెప్పారు.
ఏపీలో వాలంటీర్లకు పురస్కారాలు..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది వాలంటీర్లకు రూ.258.74 కోట్ల నగదు పురస్కారాలు అందచేస్తోంది ప్రభుత్వం. ఏప్రిల్ 7 వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డుల ప్రదాన కార్యక్రమం మొదలైంది. కనీసం సంవత్సర కాలంగా నిరంతరాయంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు, వారు అందించిన సేవల ఆధారంగా 3 కేటగిరీల్లో పురస్కారాలకు ఎంపిక చేశారు. సేవా వజ్ర పేరిట.. సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్‌తో పాటు రూ. 30,000 నగదు బహుమతి అందిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 175 నియోజకవర్గాల్లో 875 మంది వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డుల ప్రదానం చేశారు. సేవా రత్నకు 20వేల రూపాయల నగదు బహుమతి, సేవా మిత్రకు 10వేల రూపాయల నగదు బహుమతి అందిస్తోంది ప్రభుత్వం. ఈ అవార్డులతో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల సేవలను గుర్తు చేసుకుంటోంది ప్రభుత్వం, వారిని ప్రోత్సహించేందుకు క్యాష్ అవార్డులు ఇస్తోంది.
రాష్ట్రమంతా వాలంటీర్ల సేవలను గుర్తించి వారిని ప్రశంసిస్తూ అవార్డులు ఇస్తుంటే.. నెల్లూరు జిల్లాలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పురస్కారాల ప్రదానోత్సవంలో వాలంటీర్లపై ప్రశంసల జల్లు కురుస్తుందనుకుంటే.. ఇక్కడ మాత్రం ఇలా తిట్లు తినాల్సి వచ్చింది.