Nellore: లేడీ కానిస్టేబుల్స్‌కి యూనిఫాం కొలతలు పురుషులతో..! వివాదాస్పదంగా పోలీసుల తీరు
నెల్లూరు జిల్లాలో మహిళా పోలీస్‌లకు ఈ రోజు (ఫిబ్రవరి 7) కొత్త యూనిఫామ్ కోసం కొలతలు తీసుకుంటున్నారు. అందుకోసం పురుషులే మహిళల కొలతలను తీసుకోవడం వివాదాస్పదం అయింది.
నెల్లూరులో పోలీసుల తీరు వివాదాస్పదం అయింది. స్థానిక ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో మహిళా పోలీసులకు యూనిఫామ్ కొలతలను పురుష పోలీసులే తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, కావలి డివిజన్ పరిధిలోని మహిళా పోలీస్‌లకు ఈ రోజు (ఫిబ్రవరి 7) కొత్త యూనిఫామ్ కోసం కొలతలు తీసుకుంటున్నారు. అయితే అందుకోసం పురుషులే మహిళల కొలతలను తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు బయటకొచ్చాయి. మహిళా పోలీసుల యూనిఫామ్ కొలతల కోసం పురుష పోలీసులకు డ్యూటీ వేసినట్లు తెలుస్తోంది. దీనిపై సదరు మహిళా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పురుషులు కొలతలు తీసుకొనేటప్పుడు అమ్మాయిలం అయినా తాము చాలా ఇబ్బంది పడ్డామని లేడీ కానిస్టేబుళ్లు వాపోయారు. మహిళల డ్రస్ సైజులు పురుషులు తియ్యడమేంటి సర్ అంటూ ప్రశ్నించారు.
వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు.. మహిళలతో కొలతలు
అయితే, దీనికి సంబంధించిన ఫోటోలు బయటికి రావడంతో కొలతలు తీసుకుంటున్న తీరు వివాదాస్పదం అయింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కొలతలు తీసుకుంటున్న పురుషులను తప్పించి మహిళలతో ఆ పని చేయించారు. జిల్లా అదనపు ఎస్పీ వెంకట రత్నం కూడా అక్కడికి చేరుకున్నారు.
హెడ్ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకున్న ఎస్పీ
ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ విజయరావుకు తెలియడంతో ఆయన స్పందించారు. టైలర్ మెజర్ మెంట్స్ తీసుకునే ఇంచార్జ్‌గా ఉన్న హెడ్ కానిస్టేబుల్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ సమక్షంలో అడిషనల్ ఎస్పీ వెంకటరత్నం ఆధ్వర్యంలో లేడీ పోలీసులకు మహిళల ద్వారానే కొత్త యూనిఫాం కోసం కొలతలు తీసుకున్నారు. అంతేకాక, అనుమతి లేని ప్రదేశంలోకి ప్రవేశించి ఫోటోలు తీసిన గుర్తు తెలియని వ్యక్తిపై చట్ట ప్రకారం ఎస్పీ చర్యలకు ఆదేశించారు.
జిల్లా ఎస్పీ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో జరిగేలా మొత్తం మహిళా అధికారులు, మహిళా టైలర్స్ నే నియమించాలని ఆదేశించారు. ‘‘జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా పోలీసుల మెజర్ మెంట్స్ ను ఎవరికీ అసౌకర్యం కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి గౌరవం పెంచడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం. ఎటువంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు.’’ అని జిల్లా ఎస్పీ అన్నారు.
‘‘నెల్లూరు పోలీస్ అధికారులకు మహిళలంటే అంత చులకనా! మహిళా పోలీసు యూనిఫామ్ కొలతలు తీసేందుకు మగ పోలీసులను వినియోగించటం దేనికి సంకేతం. జిల్లా ఎస్పీ కూడా దీనిని సమర్థిస్తూ తప్పేముంది అన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది. పరిశీలనకు వెళ్లిన యువజన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షాత్తు రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేదీ? మహిళా పోలీసుల పట్ల నెల్లూరు జిల్లా పోలీసు అధికారుల వైఖరిని తప్పుబడుతున్నాం.’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.