Nellore: బిడ్డ కోసం కన్న తల్లి పోరాటం.. ప్రజా సంఘాల మద్దతు, నల్ల రిబ్బన్లతో కలెక్టరేట్ ముందు నిరసన
మనవడిని తీసుకున్న అజ్మా అత్త మామలు.. అబ్బాయిని కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకుంటామని చెప్పారు. అందుకు అజ్మా కూడా ఒప్పుకుంది. కానీ, ఆ తర్వాత వారు మాట తప్పారు.
కన్న బిడ్డ కోసం ఓ తల్లి పడుతున్న ఆవేదన ఇది. భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కనీసం కొడుకుని అయినా తన దగ్గర ఉంచుకొని చూసుకునే భాగ్యం లేదా అంటూ ఓ కన్న తల్లి ఇలా మౌన దీక్షకు దిగింది. తనకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకుంటోంది. తన బిడ్డ తనకు దక్కే వరకూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చుంది.
ఈ మహిళ పేరు సయ్యద్ అజ్మా. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెద్ద పడుగుపాడులో ఆమె నివాసం ఉంటుంది. అదే మండలం ఇందుకూరు పేటకు చెందిన బాల బొమ్మ సురేష్‌తో ఆమెకు కొద్ది కాలం క్రితం వివాహం అయింది. ప్రేమ వివాహమే అయినా ఆ తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొడుకుతో సహా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తకు దూరంగానే కొన్నాళ్ల పాటు ఉంటోంది.
ఈ క్రమంలో భర్త బాలబొమ్మ సురేష్ కొద్ది రోజుల కిందట ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. భర్త అంత్యక్రియల కోసం ఆమె కొడుకుని తీసుకుని అత్తగారింటికి వెళ్లింది. అయితే, మనవడిని తీసుకున్న అజ్మా అత్త మామలు.. అబ్బాయిని కొన్ని రోజులు తమ వద్ద ఉంచుకుంటామని చెప్పారు. అందుకు అజ్మా కూడా ఒప్పుకుంది. కానీ, ఆ తర్వాత వారు మాట తప్పారు. పిల్లవాడిని తిరిగి అప్పగించమంటే కాదు పొమ్మన్నారు. అసలు పిల్లవాడి ఆచూకీ తెలియకుండా చేశారు. దీంతో అజ్మా న్యాయ పోరాటానికి దిగింది. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదంటూ కలెక్టర్‌ను ఆశ్రయించింది. ఇలా కలెక్టరేట్ ముందు మౌన పోరాటానికి దిగింది. ఆమెతోపాటు బంధువులు, ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు అజ్మాకు మద్దతు పలికారు. అందరూ కలిసి నల్ల రిబ్బన్లతో నిరసన తెలుపుతున్నారు.
Also Read: Nellore Crime: కన్నతల్లిని చంపిన తనయుడు.. ఎందుకో తెలిసి అంతా షాక్..!
Also Read: Nellore News: నెల్లూరు జిల్లాలో కరోనా భయం... మూతపడ్డ సూళ్లూరుపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి