Minister Mekapati Humanity: న్యూ ఇయర్ సర్‌ప్రైజ్.. అనాథ బాలుడి ఇంటికి అనుకోని అతిథిగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజున నవదీప్ అనే పిల్లవాడి ఇంటికి అతిథిగా వెళ్లారు. ఆ అబ్బాయికి కొత్త బట్టలు కొనిచ్చారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కొత్త సంవత్సరం తొలి రోజున ఓ ఇంటికి అతిథిగా వెళ్లారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదు. చేతిలో కొత్త బట్టలు ఉన్న కవర్, పండ్లు తీసుకుని వెళ్లారు. మంత్రి స్వయంగా వెళ్తున్నారంటే ఆయన ఇంకెంత వీఐపీనో అనుకోవద్దు. అవతల ఉన్నది పదేళ్ల వయసున్న ఓ పిల్లవాడు. ఇటీవల నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగులో ఆటో బోల్తాపడ్డ దుర్ఘటనలో అయినవారిని కోల్పోయి అనాథగా మారాడు. ఆ ప్రమాదంలో నవదీప్ అనే పిల్లవాడు ఒక్కడే వాగులో పడకుండా రోడ్డుపై పడిపోయాడు. బతికి బయటపడిన ఆరుగురిలో నవదీప్ ఒకరు. అయితే నవదీప్ కుటుంబ సభ్యులు ఆటో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
ఆత్మకూరులోని జ్యోతి నగర్ కి చెందిన బాధితులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించింది. అదే సమయంలో అయిన వారిని కోల్పోయి అనాథగా మారిన నవదీప్ గురించి ఆరా తీశారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. తన సొంత నిధులు 10 లక్షల రూపాయలను పిల్లవాడి తరపున బ్యాంకులో జమ చేశారు. నవదీప్ కి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అక్కడితో సరిపెట్టలేదు మంత్రి మేకపాటి. నూతన సంవత్సరం రోజున తానే పిల్లవాడికి బట్టలు కొనుక్కుని, నేరుగా ఆ అబ్బాయి ఇంటికి వెళ్లి తన చేతుల మీదుగా అందించాడు. కొత్త సంవత్సరం రోజున మంత్రిని కలవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. వీఐపీలు, నాయకులు, అధికారులు అందరూ ఆయన కార్యాలయానికి వచ్చారు. కానీ ఆయన మాత్రం ఆ పిల్లవాడిని వెదుక్కుంటూ వారి ఇంటికే నేరుగా వెళ్లాడు.
మంత్రి ఆదేశిస్తే.. పిల్లవాడిని తీసుకుని అధికారులు ఆయన కార్యాలయానికి వచ్చేవారు. కానీ ఆయనే నేరుగా బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించి బట్టలు ఇచ్చి వచ్చారు. వారి బంధువులతో మాట్లాడి, పిల్లవాడి చదువుకు తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లవాడికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.
కాలనీవాసుల్లో సంతోషం..
మంత్రి స్వయంగా తమ కాలనీకి రావడం, తమలో ఒకరిని ఆప్యాయంగా పలకరించడం, బట్టలు పెట్టడం చూసి.. కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి నేరుగా తమమ కాలనీకి వస్తారని ఊహించలేదని వారు చెబుతున్నారు.
Also Read: Sankranti Special Trains: సంక్రాంతికి మరో 10 ప్రత్యేక రైళ్లు ... దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
Also Read: Anantapur: కొజ్జేపల్లి.. ఛీఛీ ఈ పేరు మా ఊరికే పెట్టాలా, గ్రామస్తుల నరకయాతన.. ఆ కథేంటో మీకు తెలుసా..!
Also Read: Nellore Car Fire Accident: నెల్లూరులో కారు దగ్ధమైన ఘటన.. వెలుగులోకి మరిన్ని విషయాలు