నీఛాతి నీఛంగా నన్ను అవమానించారు- ఎస్పీకి నెల్లూరు మేయర్ స్రవంతి ఫిర్యాదు
నపై నీఛాతి నీఛంగా దాడికి ప్రయత్నించిన కార్పొరేటర్లపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు నెల్లూరు నగర మేయర్ స్రవంతి. జిల్లా ఎస్పీ ఆఫీస్ కి గిరిజన సంఘాల నాయకుల తో కలసి వచ్చారామె.
తనపై నీఛాతి నీఛంగా దాడికి ప్రయత్నించిన కార్పొరేటర్లపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి. జిల్లా ఎస్పీ ఆఫీస్ కి గిరిజన సంఘాల నాయకులు, సహచర కార్పొరేటర్లతో కలసి వచ్చారామె. ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిని కలిశారు. అప్పటికే ఆమె మొయిళ్ల గౌరి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, విజయ భాస్కర్ రెడ్డిపై నెల్లూరు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీని కోరారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారని ఆమె మీడియాకు తెలిపారు.
తనను అవమానించిన కార్పొరేటర్లు తిరిగి తనతో ఉన్న కార్పొరేటర్ల భర్తలపై కేసులు పెట్టారని, వాటి విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ఫాల్స్ కేసుల్ని కొట్టేయాలని జిల్లా ఎస్పీని కోరారు మేయర్ స్రవంతి. తనపై దాడి చేసి తిరిగి తమవారిపైనే కేసులు పెట్టడం సరికాదని చెప్పారు. ఈ ఘటనపై తాను ఎంతదూరమైనా వెళ్తానని, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్తానన్నారు మేయర్ స్రవంతి.
ఎమ్మెల్యే పక్షాన ఉన్నాననే..
తన తండ్రి సమానులైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పక్షాన తాను ఉన్నాననే కోపంతోనే తనపై కార్పొరేటర్లు దాడికి దిగారని ఆరోపించారు మేయర్ స్రవంతి. కోటంరెడ్డి వర్గంలో తాను ఉన్నానని, వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు పగబట్టారని, తనను అవమానానికి గురి చేయాలనుకున్నారని, అందుకే సీఎం జగన్ ఫొటోని అడ్డుపెట్టుకుని తనపై దాడి చేశారని అన్నారు. తన ఛాంబర్ లో కూడా సీఎం జగన్ ఫొటో ఉంటుందని, అలాంటిది కౌన్సిల్ హాల్ లో ఆయన ఫొటో పెడితే తానెందుకు అభ్యంతరం తెలియజేస్తాననన్నారు స్రవంతి. కావాలనే రాజకీయ స్వలాభం కోసమే తనపై దాడి జరిగిందన్నారు.
మేయర్ కి అండగా గిరిజన సంఘాలు..
నెల్లూరులోని గిరిజన సంఘాల నేతలు మేయర్ కి అండగా ఎస్పీ ఆఫీస్ కి తరలి వచ్చారు. మేయర్ పై జరిగిన దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. దేశ ప్రథమ పౌరురాలిగా ఓ గిరిజన మహిళ ఉందని, నెల్లూరు నగర ప్రథమ పౌరురాలిగా కూడా మరో గిరిజన మహిళ ఉండటం సంతోషమని, అలాంటిది.. దురహంకారంతో తమపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు గిరిజన సంఘాల నేతలు. తప్పుడు కేసులు పెట్టి మేయర్ కి మద్దతిచ్చినవారిని కూడా బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
గిరిజనులంటే అంత చులకనా అని ప్రశ్నించారు నేతలు. దళిత, గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చామంటున్నవారే, తిరిగి ఇలా తమపై దాడులు చేస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. దళిత, గిరిజనులపై దాడులకు నిరసనగా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామన్నారు నాయకులు.
ఎస్పీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు మేయర్ సహా మరికొంతమంది నేతలు రావడంతో మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. కొంతమందికి మాత్రమే అనుమతి ఉందని చెప్పారు. కొంతసేపు అక్కడ పోలీసులతో మేయర్ వర్గానికి వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసులు మేయర్ సహా మరికొందరు గిరిజన నేతల్ని లోపలికి పంపించారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన స్రవంతి, అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై జరిగింది రాజకీయ దాడి అని అన్నారామె.