Smallest Indian National Flag: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేళ నెల్లూరు స్వర్ణకారుడి అద్భుత ప్రతిభ, అతిచిన్న జాతీయ పతాకం
Independence Day 2022: స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ.. నెల్లూరుకు చెందిన స్వర్ణకారుడు, సూక్ష్మ కళాకారుడు షేక్ ముసవీర్ అద్భుతమైన కళాఖండం తయారు చేశాడు. ఒకే ప్టాల్ ఫామ్ పై 15 జాతీయ జెండాలను రూపొందించాడు.
75th Independence Day: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ.. నెల్లూరుకు చెందిన ప్రముఖ స్వర్ణకారుడు, సూక్ష్మ కళాకారుడు షేక్ ముసవీర్ అద్భుతమైన కళాఖండాన్ని తయారు చేశాడు. ఒకే ప్టాల్ ఫామ్ పై 15 జాతీయ జెండాలను రూపొందించాడు. వాటన్నిటి బరువు కేవలం 1.7 గ్రాములు మాత్రమే. ఈ అరుదైన కళాఖండాన్ని ఆయన తన కంటిలో సైతం పెట్టుకున్నారు. కనుపాపపై పట్టేంత అతి చిన్న జాతీయ జెండాల సమాహారం బహుశా దేశం మొత్తం వెదికినా కనపడదేమో. ఈ అద్భుతమైన సూక్ష్మ జెండాలను ఇప్పుడు నెల్లూరీయులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.
అతి చిన్న జాతీయ పతాకం.. బంగారు తీగతో జనగణమన
కేవలం జాతీయ జెండానే కాదు, దేశభక్తికి ప్రతిరూపమైన అనేక అంశాలతో ముసవీర్ జాతీయతా వాదాన్ని చాటిచెబుతున్నారు. బంగారు తీగతో జనగణమన రూపొందించారు. ఈ తీగ బరువు కేవలం 1.3 గ్రాములు. 1.4 గ్రాములతో ఇంగ్లిష్ లో కూడా జాతీయ గీతాన్ని రూపొందించారు. చిన్నారులు స్కూల్ ముందు నిలబడి జెండా వందనం చేస్తున్నట్టు ఉన్న ప్రతిమ కూడా బంగారంతో తయారు చేశారు ముసవీర్.
జాతీయ జెండాల రూపాన్ని రూపాయి కాయిన్ పై నిలబెడితే ఎంత ముచ్చటగా కనిపిస్తుందో చూడండి. చూడటానికే అపురూగంగా ఉండే ఈ జెండాలను కంటిలో అమర్చుకుని మరో అరుదైన ఫీట్ ని సాధించారు ముసవీర్. అందుకే ఆయనకు అవార్డులు, రివార్డులు అన్నీ సొంతమయ్యాయి. డాక్టరేట్ కూడా లభించింది.
సూక్ష్మ కళారూపాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు
షేక్ ముసవీర్.. దేశం మొత్తం మీద సూక్ష్మ కళాకారుల జాబితా రూపొందిస్తే, అందులో కచ్చితంగా తొలి రెండు స్థానాల్లో ఉండే పేరు షేక్ ముసవీర్. ఆయన తన సూక్ష్మ కళారూపాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అవార్డులు వచ్చాయి కానీ, ఆయన ఇంకా పేదరికంలోనే మగ్గిపోతున్నారు. ప్రతి రోజూ స్వర్ణకార వృత్తి చేస్తేనే ఆయనకు పూటగడిచేది. కుటుంబం కోసం, సోదరీమణులకు వివాహం చేసేందుకే తన జీవితాన్ని దారపోశాడు. తాను మాత్రం అవివాహితుడిగానే మిగిలిపోయాడు. ఎంతోమంది ఆయన్ను సూక్ష్మరూపాలను ఇవ్వాలని కోరుతుంటారు. కానీ కళను అమ్ముకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఆ కళారూపాలన్నిటినీ తన వద్దే ఉంచుకుని అవకాశం వచ్చినప్పుడు ప్రదర్శన ఇస్తుంటారు. తన ప్రతిభను ప్రోత్సహించేవారే కానీ, ఆర్థికంగా చేయూత అందించేవారు లేరని వాపోతుంటారు ముసవీర్. ఇప్పటికైనా ప్రభుత్వం ఆయన ప్రతిభను గుర్తించి ఆర్థిక చేయూత అందిస్తే.. ఆ కళ మరుగున పడిపోకుండా పదిమందికి నేర్పించాలనే పట్టుదలతో ఉన్నారు ముసవీర్.
తనతోపాటు తన జన్మస్థలానికి కూడా తన కళ ద్వారా మంచి పేరు సంపాదించి పెట్టారు షేక్ ముసవీర్. ఇప్పటికే సూక్ష్మ కళాకారుడుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ముసవీర్.. 30 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్నారు. డాక్టరేట్ కూడా అందుకున్నారు.