(Source: ECI/ABP News/ABP Majha)
Nellore: నెల్లూరు జిల్లా గోల్డ్ షాపులపై సడెన్‌గా దాడుల కలకలం - వ్యాపారుల్లో ఒకటే హడల్!
Nellore జిల్లా కావలిలో ఐటీ అధికారుల దాడులతో వ్యాపారులు హడలిపోయారు. కావలిలోని బిజిలీ బజార్ లోని ఓ నగల దుకాణంపై గుంటూరు జోన్ ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.
Nellore Gold Shops: శ్రావణ మాసంలో బంగారం అమ్మకాలు, కొనుగోళ్లు జోరుగా సాగుతుంటాయి. ఆర్డర్లపై నగలు చేయించుకునేవారు, రెడీమేడ్ కాసులు, ఇతర ఆభరణాలు కొనుగోలు చేసేవారు శ్రావణ మాసాన్ని మంచి మహూర్తంగా భావిస్తారు. సహజంగానే శ్రావణ మాసంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. దీనిపై ఐటీ శాఖ కూడా దృష్టి పెడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న కార్పొరేట్ స్థాయి బంగారు షాపుల్లో లెక్కలు పక్కాగానే ఉంటాయి కానీ, చిన్న చిన్న షాపుల వాళ్లకే చిక్కులన్నీ ఎదురవుతుంటాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలిలో ఐటీ అధికారుల దాడులతో (Kavali IT Raids) వ్యాపారులు హడలిపోయారు. కావలిలోని బిజిలీ బజార్ (Kavali Bijili Bazar) లోని ఓ నగల దుకాణంపై గుంటూరు జోన్ ఆదాయపు పన్నుశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు చేశారు, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు, రికార్డులు పరిశీలించారు.
బిజిలీ బజార్ లోని వ్యాపారి తన సిబ్బందిలో ఒకరికి రూ. 50 లక్షలు ఇచ్చి చెన్నై పంపించారు. చెన్నైలో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి రావాలని చెప్పారు. దీంతో అతను కావలిలో రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అనుకోకుండా పోలీసులు చెక్ చేశారు. 50 లక్షల రూపాయలు దొరికాయి. కానీ వాటికి లెక్క చెప్పమంటే నీళ్లు నమిలాడు. సరైన ఆధారాలు లేకపోవడంతో విషయం ఆదాయపు పన్ను శాఖ అధికారులకు చెప్పారు పోలీసులు. వారు రంగప్రవేశం చేసి, కావలిలో సదరు నగల షాపు యజమానిని పట్టుకున్నారు. విచారణ చేపట్టారు. ఆ నివేదిక ఉన్నతాధికారులకు పంపిస్తామని చెబుతున్నారు.
నెల్లూరు వ్యాపారుల్లో వణుకు..
సహజంగా చిన్న చిన్న వ్యాపారులు బంగారు బిస్కెట్లకోసం తమ సిబ్బందిని చెన్నైకి పంపిస్తుంటారు. అయితే ఇదంతా అధికారికంగా జరిగే తంతు కాదు. బంగారు బిస్కెట్లు తెప్పించి వాటితో నగలు చేయించి అమ్ముతుంటారు. బంగారం జీఎస్టీ పరిధిలోకి వచ్చిన తర్వాత నగల అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ రికార్డులలోకి ఎక్కాల్సిన అవసరం ఉంది. పెద్ద షాపుల్లో జీఎస్టీతో కూడిన బిల్లులు ఇస్తుంటారు. చిన్న షాపుల్లో జీఎస్టీ లేకుండానే బిల్లులు రెడీ చేసి ఇస్తుంటారు. ఇటు కొనుగోలుదారులు కూడా తమకు బిల్లుల మోత తప్పుతుంది కాబట్టి, చిన్న షాపుల్లో బంగారం కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు.
గతంలో పలుమార్లు ఐటీ దాడులు..
పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారులు పెద్ద మొత్తంలో నగలకోసం బంగారు బిస్కెట్లు తెప్పిస్తున్నారు. తాజాగా కావలిలో బంగారు బిస్కెట్ కోసం పంపించిన వ్యక్తిని పోలీసులు పట్టుకోవడంతో ఈ వ్యవహారం మరోసారీ వార్తల్లోకెక్కింది. మిగతా వ్యాపారుల్లో హడావిడి మొదలైంది. గతంలో కూడా పలుమార్లు ఐటీ సిబ్బంది నెల్లూరు నగరంలో బంగారు షాపులను తనిఖీలు చేసిన సందర్భాలున్నాయ. ఒక షాపులోకి ఐటీ అధికారులు వచ్చారంటే, మిగతా షాపులన్నీ ఆరోజు మూత వేసుకోవాల్సిందే. ఎవరూ షాపులు తెరిచేందుకు సాహసించరు. ప్రస్తుతం కావలిలో ఐటీ అధికారులు ఉన్నారనే సమాచారంతో నెల్లూరులో కూడా కొంతసేపు బంగారు షాపులకు తాళాలు వేసి వ్యాపారులు వెళ్లిపోయారు.