Nellore Crime : తండ్రి ప్రేమ దూరమవుతుందని తల్లిని హత్య చేసిన కొడుకులు
Nellore Crime : తండ్రి ప్రేమ తమకు దూరమవుతుందనే ఉద్దేశంతో వారిద్దరూ సవతి తల్లిని కిరాతకంగా హతమార్చారు. వారిద్దరినీ నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒకరి వయసు 19 ఏళ్లు, మరొకరి వయసు 21 ఏళ్లు. పెద్దగా ప్రపంచం తెలియని వయసు. భావోద్వేగాలకు, చెప్పుడు మాటలకు సులభంగా మారిపోయే మనసు. తండ్రిప్రేమ తమకు దూరమవుతుందనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి సవతి తల్లిని కిరాతకంగా హతమార్చారు. సవతి తల్లి అనే కనికరం కూడా లేకుండా ఆమెను కత్తితో నరికి చంపారు. వారిద్దరినీ నెల్లూరు జిల్లా కోవూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి తమ తల్లితో ఉండకుండా.. సవతి తల్లి వద్దే ఎక్కువ సమయం ఉంటున్నాడనే కోపంతో వారిద్దరూ ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వేగూరు హరిజనవాడకు చెందిన గోళ్ల చిన్నమ్మ, దాసరి శివయ్యకు 24ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి వారు విడిపోయారు. 12 ఏళ్ల క్రితం ఇందుకూరు పేట మండలానికి చెందిన మాధురిని వివాహం చేసుకున్నాడు శివయ్య. మాధురి, శివయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరు సర్వేపల్లిలో కాపురం ఉంటున్నారు. కొన్నాళ్లుగా శివయ్య తన మొదటి భార్య దగ్గరకు రాకపోకలు కొనసాగిస్తున్నాడు. ఇద్దరు కొడుకులతో ఆ విషయంలో గొడవలు అవుతున్నా శివయ్య మాత్రం మొదటి భార్య దగ్గరకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో తండ్రి తమకు దూరమవుతున్నాడన్నకోపంతో వంశీ, నితీష్ ఇద్దరూ తమ తండ్రి మొదటి భార్య చిన్నమ్మను దారుణంగా నరికి హత్య చేశారు. నిందితులిద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మొదటి భార్య వద్దకు వెళ్లొద్దని
చిన్నమ్మకు సంతానం లేదు. భర్త వదిలేసిన తర్వాత తన పని తాను చేసుకుంటోంది. ఒంటరిగానే వేగూరు హరిజనవాడలో జీవిస్తోంది. కొన్నాళ్లుగా భర్త తన వద్దకు వస్తుండటంతో ఆమె తిరిగి సంతోషపడింది. గతంలో తనను దూరం పెట్టిన భర్త తిరిగి తన వద్దకు వస్తున్నాడని బంధువులకు చెప్పుకుని సంతోషంగా ఉంటోంది. అయితే శివయ్య రెండో భార్య మాధురికి, ఆమె కొడుకులకు అది ఇష్టంలేదు. చాలా సార్లు ఈ విషయంలో తండ్రి శివయ్యను ఇద్దరు కొడుకులు వారించారు. మొదటి భార్య వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు.
తండ్రి పట్టించుకోడనే అనుమానంతో
పిల్లల మాటను పెడచెవిన పెట్టారు శివయ్య. మొదటి భార్య వద్దకు రాకపోకలు సాగించాడు. కొన్నిరోజులపాటు ఆమెవద్ద ఉంటుండే సరికి కొడుకులకు అనుమానం మరింతబలపడింది. తమని తండ్రి పూర్తిగా దూరం పెడతాడేమోనన్న ఆందోళన పెరిగింది. తమ తల్లి ఒంటరి అవుతోందనే బాధ మొదలైంది. అంతే వారు క్షణికావేశంలో ఏం చేస్తున్నామనే విషయాన్ని మరచిపోయారు. తమకి ఎలాంటి హాని తలపెట్టకపోయినా, కేవలం తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న బాధతో సవతి తల్లిని దారుణంగా హత్య చేశారు. వారిద్దరినీ పోలీసులు సర్వేపల్లి ప్రాంతంలో అరెస్ట్ చేశారు. క్షణికావేశంలో తప్పు చేసి తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. వారిద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నట్టు తెలిపారు నెల్లూరు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి.