Anil Kumar Yadav: నారా లోకేశ్‌కు ఎమ్మెల్యే అనిల్ యాదవ్ సవాల్, ఆలయానికి రావాలని డిమాండ్
ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ భూ అక్రమాలకు పాల్పడ్డారని, బినామీల పేరుతో దందాలు చేశారని ఇటీవల నారా లోకేశ్ ఆరోపించారు. దీనిపై తాజాగా అనిల్ స్పందించారు.

MLA Anil Kumar Yadav Challenges Nara Lokesh: నాలుగేళ్లలో తాను వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించానని నారా లోకేష్ (Nara Lokesh) అవాస్తవ ఆరోపణలు చేశారని మండిపడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. లోకేష్ విడుదల చేసిన జాబితాలో ఒక్క అంకణం కూడా తనకు తన బినామీలకు చెందినది కాదని, ఒకవేళ తనదే అని లోకేష్ నిరూపిస్తే వారికే ఆ స్థలాలను ఇచ్చి వేస్తానని అన్నారు. అక్కడితో అనిల్ కుమార్ ఆగలేదు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆస్తులకు సంబంధించి నెల్లూరు వెంకటేశ్వరపురంలో తన కులదైవమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు అనిల్. దమ్ముంటే నారా లోకేష్ ప్రమాణానికి రావాలని సవాలు విసిరారు. ఆయన రాకపోయినా తాను మాత్రం వెంకటేశ్వర పురం వెళ్లి ప్రమాణం చేస్తానని అనిల్ (MLA Anil Kumar Yadav) అన్నారు.
ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ (MLA Anil Kumar Yadav) భూ అక్రమాలకు పాల్పడ్డారని, బినామీల పేరుతో దందాలు చేశారని ఇటీవల నారా లోకేశ్ ఆరోపించారు. మంగళవారం (జూలై 4) నెల్లూరు నగరంలో జరిగిన బహిరంగ సభలో అనిల్ భూకబ్జాలు, అక్రమాలు అంటూ ఆరోపణలు చేశారు. బినామీల పేర్లతో రూ.వెయ్యి కోట్లు దోచుకున్నారని లోకేశ్ ఆరోపించారు. వాటికి సంబంధించిన ఆధారాలను నిన్న (జూలై 5) కోవూరు నియోజకవర్గంలోని సాలుచింతలలో విడుదల చేశారు. ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారో ఎమ్మెల్యే అనిల్ చెప్పాలని, అసలు ఆయనకు ఈసారి టికెట్ ఇస్తారో లేదో స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. తాను అవినీతికి పాల్పడలేదని అనిల్ వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేయాలని నారా లోకేశ్ సవాల్ విసిరారు.
నారా లోకేశ్ విడుదల చేసిన లిస్టు ఇదీ
మాజీ మంత్రి అనిల్ దోచుకున్నారని నారా లోకేశ్ విడుదల చేసిన లిస్టులో ఈ వివరాలు ఉన్నాయి. ‘‘నాయుడుపేటలో బినామీ పేర్లతో 58 ఎకరాలు దోచుకున్నారు. వాటి విలువ రూ.100 కోట్లు. దొంతాలివద్ద బినామీలు చిరంజీవి, అజంతా పేరుపై 50 ఎకరాలు కాజేయగా వాటి విలువ రూ.10 కోట్లుగా ఉంది. సాదరపాళెంలో డాక్టర్ అశ్విన్ పేరుతో 12 ఎకరాల విలువ రూ.48 కోట్లుగా ఉంది. ఇనుమడుగు వద్ద బినామీలు రాకేశ్, డాక్టర్ అశ్విన్ (అనిల్ తమ్ముడు) పేరుతో 400 అంకణాలు ఉన్నాయి. వాటి విలువ రూ.33 కోట్లుగా ఉంది. అల్లీపురంలో 4వ డివిజన్ కార్పొరేటర్, డాక్టర్ అశ్విన్ పేరుతో 42 ఎకరాలు కాజేశారు. వాటి విలువ రూ.105 కోట్లుగా ఉంది. ఇందులో 7 ఎకరాలు ఇరిగేషన్ భూమిగా ఉంది’’
‘‘గూడూరు - చెన్నూరు మధ్యలో 120 ఎకరాలు తీసుకున్నారు. అందులోని 40 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. పెద్ద కాంట్రాక్టర్ నుంచి దశల వారీగా అనిల్ బినామీ చిరంజీవికి రూ.కోట్లు వచ్చాయి. బృందావనంలో శెట్టి సురేష్ అనే బినామీ పేరుతో 4 ఎకరాలు ఉన్నాయి. వాటి విలువ రూ.25 కోట్లు. దామరమడుగులో బావమరిది పేరుతో 5 ఎకరాలు ఉండగా వాటి విలువ రూ.5 కోట్లుగా ఉంద’’ని నారా లోకేశ్ విడుదల చేసిన జాబితాలో ఆరోపణలు చేశారు.





















