Nellore: 200 ఏళ్ల క్రితం నాటి గుడి - అందులో ప్రభాస్ సినిమా షూటింగ్, స్పెషల్ ఏంటో తెలుసా?
Nellore Shivalayam: 200 ఏళ్ల చరిత్ర ఉన్న నాగేశ్వరాలయం ఇది. అప్పట్లో నదీ తీరంలో పెరుమాళ్లపాడు గ్రామం ఉండేది.
Nellore Shivalayam: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెన్నాతీరం అది. 2020 జూన్ 16వ తేదీ.. స్థానిక యువకులు అక్కడ ఇసుక మేటల్లో జేసీబీలతో తవ్వకాలు చేపట్టారు. శివాలయం వెలుగు చూసింది. ఆ తర్వాత ఒక్కసారిగా అది దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది. ఎంతోమంది నెల్లూరుకి వచ్చి నదీ తీరంలో ఇసుక తిన్నెల్లో నుంచి బయటకు వచ్చిన ఆలయాన్ని చూసి వెళ్లారు.
కట్ చేస్తే.. రెండేళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఆ ఆలయం నదీ తీరంలో ఇసుక తిన్నెల్లోనే ఉండిపోయింది. స్థానికులు కూడా ఆలయాన్ని పట్టించుకోవడం మానేశారు. పురావస్తు శాఖ, ఏపీ దేవాదాయ శాఖ అప్పట్లో ఈ ఆలయం విషయంలో హడావిడి చేసినా ఇప్పుడు ఆ ప్రాంతం నిర్మానుష్యంగానే ఉంది. చుట్టూ వేరుశెనగ పైరు మధ్య ఇసుక తిన్నెల్లో శివుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. సడన్ గా ఇటీవల ప్రభాస్ కొత్త సినిమా టీమ్ అక్కడకు షూటింగ్ కోసం రావడంతో మరోసారి నెల్లూరు జిల్లా పెరుమాళ్లపాడు వార్తల్లోకెక్కింది. రెండు రోజులపాటు అక్కడ సినిమా షూటింగ్ చేసి వెళ్లింది చిత్ర బృందం. సువిశాల పెన్నా తీరం, చుట్టూ ఇసుక తిన్నెలు.. పచ్చని చెట్లు వీటన్నిటి మధ్య సగం ఇసుకలోకి కూరుకుపోయిన ఆలయం.. ఇలాంటి అరుదైన దృశ్యాలు ఉన్నాయి కాబట్టే సినిమా యూనిట్ చిత్రీకరణకోసం ఇంత దూరం వచ్చింది.
200 ఏళ్ల చరిత్ర ఉన్న నాగేశ్వరాలయం ఇది. అప్పట్లో నదీ తీరంలో పెరుమాళ్లపాడు గ్రామం ఉండేది. కాలక్రమంలో తీరం కోతకు గురికావడంతో ఊరు ఊరంతా అక్కడినుంచి తరలి వెళ్లింది. ఇళ్లు, పొలాలు, ఇతర నిర్మాణాలన్నీ నది ఇసుకతో మేట వేసుకు పోయాయి. ఆ తర్వాత ఊరి గురించి ఎవరూ పట్టించుకోలేదు. గ్రామంలోని వృద్ధులు మాత్రం అప్పుడప్పుడూ అసలు పెరుమాళ్లపాడు పెన్నా తీరంలో ఉండేదని, అక్కడ ఓ గుడి కూడా ఉండేదని యువకులకు చెబుతుండేవారు. రెండేళ్ల క్రితం లాక్ డౌన్ సమయంలో ఇసుక తవ్వకాల సమయంలో ఈ గుడి ఆనవాళ్లు కనపడ్డాయి. యువకులు ఉత్సాహంతో జేసీబీలతో ఇసుకను తవ్వగా గుడి గోపురం కనపడింది. అక్కడితో ఆగిపోయారు. ముందుకెళ్లాలంటే పురాతన ఆలయం కూలిపోతుందేమోననే భయంతో ఆపేశారు. అప్పట్లో పురావస్తు శాఖ అధికారులు కూడా వచ్చారు. ఆలయంలో ఉన్న శివ లింగాన్ని ప్రస్తుతం ఉన్న పెరుమాళ్లపాడు గ్రామానికి తరలించాలనే ప్రయత్నం చేశారు కానీ, మధ్యలోనే ఆపేశారు.
నాగేశ్వరాలయం అనే పేరుకి తగ్గట్టే శివాలయంలో నిత్యం పాముల సంచారం ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. పాము కుబుసాలు ఆలయ ప్రాంగణంలో నిత్యం కనిపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ ఆలయాన్ని పునర్నిర్మించాలన్నా కష్టసాధ్యంగా కనిపిస్తోంది. ఇసుకను తవ్వి పూర్తిగా ఆలయాన్ని బయటకు తీస్తే ఆలయ నిర్మాణం కూలిపోతుందనే భయంతో దాన్ని అలాగే ఉంచారు. ప్రస్తుతం ఆ చుట్టుపక్కలకు ఎవరూ వెళ్లరు. ఇటీవల వర్షాలకు ఇసుక మరింతగా ఆలయంలోకి వెళ్లిపోయింది. ఆలయ గోపురం పైభాగం మాత్రమే కనపడుతుంటుంది. 1850లో పెన్నా నదికి వచ్చిన వరదల్లో ఆలయం పూర్తిగా నీటమునిగిపోయిన తర్వాత దాదాపు 200 ఏళ్లకు అది బయటపడటం నిజంగా విచిత్రమే.