వెంకటగిరిలో ఒకేరోజు రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు
వెంకటగిరిలో ఆనం రామనారాయణ రెడ్డి ఒకేరోజు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. డిప్యూటీ సి ఎం నారాయణ స్వామి, మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా తిరుపతి జిల్లా అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రస్తుత తిరుపతి జిల్లాలోని వెంకటగిరి నియోజకవర్గం ఇప్పటికీ రెండు జిల్లాల్లో వ్యాపించి ఉంది. దీంతో రెండు జిల్లాల పరిధిలో దీనికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఒకేరోజు ఇక్కడ 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవాలకు డిప్యూటీ సి ఎం నారాయణ స్వామి, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహా తిరుపతి జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఒకే రోజు దాదాపు 200 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించిన ఘనత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖా మంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆనం రామనారాయణ రెడ్డి గారికే దక్కుతుందని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. పెరియవరంలో 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైతుల వసతి భవనాన్ని, కృషి విజ్ఞాన్ కేంద్రాన్ని మంత్ర కాకాణితో కలసి ప్రారంభించారు. పెరియవరం ప్రాంత ప్రజలకోసం, ఎల్ఈడీ లైట్ల నిర్మాణం కోసం నూతన స్తంభాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 12 లక్షల రూపాయలతో ఇక్కడ ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయబోతున్నారు.
మన బడి నాడు నేడు ద్వారా వెంకటగిరి టీచర్స్ కాలనీ లోని జడ్పీ హైస్కూల్ వద్ద.. నూతన భవనాలకోసం 20 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ను తాత్కాలికంగా.. విశ్వోదయ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం వెంకటగిరి పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్లను ప్రారంభించారు మంత్రులు. దీనికి తిరుపతి ఎంపీ గురుమూర్తి 87 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారు.
వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ డ్రెయిన్లను ప్రారంభించారు నేతలు. కోటీ అరవై లక్షలతో వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వెంకటగిరి మున్సిపాలిటీలో 45 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్త్రీ స్వశక్తి భవన్ ను మంత్రులు ప్రారంభించారు. కోటీ 40 లక్షల రూపాయల వ్యయంతో వాటర్ ఫ్రంట్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఏర్పేడు - చెన్నూరు రోడ్డు విస్తరణ మరియు పునర్నిమాణ పనులకు కూడా మంత్రులు శంకుస్థాపన చేశారు. 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్డు విస్తరణ చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాల అనంతరం వెంకటగిరి, రాపూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీల నూతన చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకరోత్సవం జరిగింది. ఆ తర్వాత రైతు సదస్సు నిర్వహించారు. మంత్రులతో పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.