పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ - అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన
కోవూరు టికెట్ వేరే వారికి ఇస్తానని జగన్ తనకు చెప్పినా కూడా తాను పార్టీని వీడిపోనని, ఆయన నిలబెట్టిన అభ్యర్థినే గెలిపిస్తానని చెప్పారు. తాను చనిపోయే వరకు జగన్ తోనే ఉంటానన్నారు ఎమ్మెల్యే ప్రసన్న.
నెల్లూరు జిల్లాలో వరుసగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం కావడం, అది కూడా సీఎం జగన్ సొంత సామాజిక వర్గం వారు పార్టీపై విమర్శలు చేయడంతో రాజకీయం వేడెక్కింది. అదే కోవలో మరో పెద్దారెడ్డి కూడా పార్టీకీ దూరమవుతారనే ప్రచారం జరిగింది. ఆయనెవరో కాదు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. టీడీపీలోనుంచి వైసీపీకి వచ్చిన ఆయన, తిరిగి టీడీపీ లేదా బీజేపీ గూటికి చేరతారంటూ సోమవారం వాట్సప్ లో వైరల్ న్యూస్ ఫార్వార్డ్ అయింది. దీన్ని చూసి కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు కూడా ప్రసన్న పార్టీ మారిపోతున్నారంటూ కథనాలిచ్చాయి. ఈ కథనాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆ యూట్యూబ్ ఛానెళ్ల వారికి కనీసం నీతి నిజాయితీ ఉన్నాయా అని ప్రశ్నించారు. వారేమైనా రెడ్ లైట్ ఏరియాలో పుట్టారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రసన్నపై ఎందుకీ ప్రచారం..
ప్రసన్న కుమార్ రెడ్డి సీనియర్ నేత, వైసీపీలో మొదటి నుంచీ జగన్ కి నమ్మకస్తుడిగా ఉంటూ వచ్చారు. ఆయన కూడా మంత్రి పదవి ఆశించి ఉండొచ్చు, కానీ నేరుగా ఎప్పుడూ బయటపడలేదు. ఇప్పుడు అదే మంత్రి పదవి విషయంలో ఆయన అలిగారని, అందుకే పార్టీ మారుతున్నారని వాట్సప్ లో స్ ఫార్వార్డ్ అయింది. అయితే ప్రసన్న మాత్రం ఆ వార్తల్ని ఖండించారు. తప్పుడు వార్తలతో తన ఇమేజ్ డ్యామేజీ అయిందన్నారు ప్రసన్న. అందరూ తనకు ఫోన్లు చేసి అడుగుతున్నారని, వారికి సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడ్డానన్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పినా కొంతమంది అనుమానంగా ఫోన్లు పెట్టేశారని చెప్పొరు ప్రసన్న. తానంటే గిట్టనివారు ఈ ప్రచారాన్ని మొదలు పెట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ప్రసన్న.
చివరి రక్తపు బొట్టు వరకూ..
తనపై సోషల్ మీడియాలో వచ్చినవన్నీ తప్పుడు కథనాలే అని మండిపడ్డారు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. కోవూరు టికెట్ వేరేవారికి ఇస్తానని జగన్ తనకు చెప్పినా కూడా తాను పార్టీని వీడిపోనని, ఆయన నిలబెట్టిన అభ్యర్థినే గెలిపిస్తానని చెప్పారు. తనకు జగన్ చాలా గౌరవం ఇస్తారని, తాను అడిగిన పనులన్నీ పూర్తి చేస్తున్నారని చెప్పారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూట్యూబ్ ఛానెళ్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వారంతా రెడ్ లైట్ ఏరియాలో పుట్టినట్టు ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోయే వరకు జగన్ తోనే ఉంటానన్నారు. తన చివరి రక్తపు బొట్టు కూడా జగన్ కోసమేనని స్పష్టం చేశారు. తాను చనిపోయిన తర్వాత తన కొడుకు రజత్ కుమార్ రెడ్డి జగన్ తోనే కొనసాగుతాడని అన్నారు.
చంద్రబాబుపై అనుమానం..
తనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయించి ఉంటారని అన్నారు ప్రసన్న కుమార్ రెడ్డి. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు డబ్బులిచ్చి ఈ వార్తలు వేయించారన్నారు. మీడియా మొత్తాన్ని తాను విమర్శించడంలేదని, తనని టార్గెట్ చేసిన వారిపై మాత్రమే తన ఆగ్రహం అని చెప్పారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ సస్పెండ్ చేసిందని, వారు టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినట్టు నిర్థారణ అయిందని చెప్పారు ప్రసన్న. తాను అలాంటి వాడిని కాదన్నారు.