YSRCP Mekapati : వైఎస్ఆర్‌సీపీలో కలకలం రేపిన ఎమ్మెల్యే మేకపాటి ! సజ్జలపై ఏమన్నారంటే ?
వైఎస్ఆర్‌సీపీలో ఎమ్మెల్యే మేకపాటి తన వ్యాఖ్యలతో కలకలం రేపారు. సజ్జలకు చెప్పినంత మాత్రాన తనకు టిక్కెట్ ఇవ్వరా అని ఆయన ప్రశ్నించారు .
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే c మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీలోని తన వ్యతిరేకులపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి వైఎస్ఆర్‌సీపీలో ( YSRCP ) కలకలం రేపారు. తన ఎమ్మెల్యే పదవి విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గతంలో కొంతమంది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అడ్డుపడ్డారని, కానీ జగన్ టికెట్ ఇవ్వడంతో తాను గెలిచానని, అలాంటి వారందరికీ అధికారంలోకి వచ్చాక తాను మంచే చేశానని అన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. మళ్లీ ఇప్పుడు కొంతమంది సజ్జల రామకృష్ణారెడ్డి ( Sajjala ) దగ్గరకు వెళ్లాలనుకుంటున్నారని, సజ్జలకు చెప్పిన వెంటనే తనకు టికెట్ రాకుండా ఉంటుందా అని ప్రశ్నించారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని, వచ్చే దఫా తాను ఉదయగిరి నుంచి మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఇటీవల మరణించిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సొంత బాబాయ్. మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి సోదరుడు. రాజమోహన్ రెడ్డి ఎంపీగా ఉంటే ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేవారు. 2014 ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డిగా ఎంపీగా.. ఆయన కుమారుడు గౌతం రెడ్డి ఆత్మకూరు ఎమ్మెల్యేగా.. చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీచేశారు. కానీ చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాజమోహన్ రెడ్డి పోటీ చేయలేదు కానీ.. గౌతం రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గెలిచారు.
అయితే 2019 ఎన్నికల సమయంలో టిక్కెట్ కేటాయింపులు చేస్తున్నప్పుడు మేకపాటి కుటుంబంలో ఉదయగిరి ( Udayagiri) టిక్కెట్‌పై చర్చ జరిగింది. ఆ స్థానాన్ని కూడా చంద్రశేఖర్ రెడ్డికి కాకుండా మేకపాటి మరో కుమారుడికి అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం వినించింది.అయితే సీఎం జగన్ మాత్రం మాజీ ఎమ్మెల్యేకే అవకాశం కల్పించారు. ఇటీవల మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఈ కారణంగా నియోజకవర్గంలో ఆయన ఎవరికీ అందుబాటులో ఉండటం లేదని.. ఆయన పేరుతో ఇతరులు పెత్తనం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో అక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి మరో కుమారుడు పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. ఉదయగిరి వైఎస్ఆర్‌సీపీలో మేకపాటి కుటుంబాన్ని కాదని తమకు టిక్కెట్ అడిగేంత నేత లేరు. అందుకే ఎమ్మెల్యే మేకపాటి అసంతృప్తి.. సొంత కుటుంబ సభ్యులపైనేనని భావిస్తున్నారు. అందుకే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది.