Kotamreddy: ఎమ్మెల్యే అనిల్‌కి మాటలు ఫుల్, మేటర్ నిల్! కోటంరెడ్డి శ్రీధర్ వ్యాఖ్యలు
గతంలో కాకాణి గోవర్దన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత నెల్లూరు వచ్చినప్పుడు రెట్టింపు తిరిగిస్తానని అనిల్ శపథాలు చేశారని, కానీ కాకాణి కాలి గోరు కూడా అనిల్ పీకలేకపోయారని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి.
పార్టీ మారిన వారంతా ద్రోహులు, వారి లెక్కలు తేలుస్తానంటూ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఆల్రడీ వైసీపీ అధికారంలోనే ఉందని ఇప్పుడే తమ లెక్కలు తేల్చాలంటూ సవాల్ విసిరారు. అనిల్ కి మాటలు ఫుల్, మేటర్ నిల్ అని అన్నారు. టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు రోజుల్లోనే అనిల్ సంగతి తేల్చేస్తామన్నారాయన. సీఐడీ ఎంక్వయిరీ వేస్తామని, ఇసుక, క్వార్జ్ లో అనిల్ దోపిడీని బయటపెడతామని హెచ్చరించారు. అనిల్ కుమార్ పెద్ద డూప్ మాస్టర్ అని, నర్సరావుపేటలో అనిల్ ఓడిపోవచ్చేమో కానీ, రాష్ట్రవ్యాప్త డూప్ సంఘం అధ్యక్షుడిగా ఆయనకు భారీ మెజార్టీ వస్తుందని సెటైర్లు పేల్చారు కోటంరెడ్డి.
ఆనం వివేకానందరెడ్డి చలవ వల్ల అనిల్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు శ్రీధర్ రెడ్డి. అప్పట్లో ఆయన ఖాళీగా ఉన్న టైమ్ లో రూప్ కుమార్ యాదవ్, అనిల్ ని తన దగ్గరకు తెస్తే.. తామిద్దరం వివేకా దగ్గరకు తీసుకెళ్లామని, అప్పటికి వైఎస్ఆర్ కి అనిల్ పేరు కూడా తెలియదన్నారు. అలాంటి అనిల్ కి కాంగ్రెస్ టికెట్ ఇస్తే, తర్వాత ఆనం కుటుంబానికే ఆయన ద్రోహం చేశారని మండిపడ్డారు శ్రీధర్ రెడ్డి. అనిల్ తమ లెక్కలు తేల్చడం కాదని, ఎన్నికల తర్వాత అనిల్ దందాలన్నీ ఒక్కొక్కటే బయటకు తీస్తామని హెచ్చరించారు కోటంరెడ్డి.
జగన్ కూడ్ ద్రోహి కాదా..?
పార్టీలు మారినవారంతా దొంగలు, ద్రోహులు అని అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే కదా అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ మాట తాము అనడంలేదని, అనిల్ వ్యాఖ్యల ప్రకారం జగన్ ని కూడా అలాగే అనుకోవాలని చెప్పారు. పార్టీ మారడం తప్పు అని ఎవరూ చెప్పట్లేదని, అవసరం, అవకాశాన్ని బట్టి ఎవరైనా పార్టీ మారొచ్చని, కానీ అనిల్ తానొక్కడినే పత్తిత్తునని చెప్పుకోవడం సరికాదని అన్నారు కోటంరెడ్డి.
ఏం చేయగలవో చెప్పు..
గతంలో కాకాణి గోవర్దన్ రెడ్డి మంత్రి అయిన తర్వాత నెల్లూరు వచ్చినప్పుడు రెట్టింపు తిరిగిస్తానని అనిల్ శపథాలు చేశారని, కానీ కాకాణి కాలి గోరు కూడా అనిల్ పీకలేకపోయారని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి. ఇప్పుడు వైసీపీ అధికారంలోనే ఉందని ఇప్పుడైనా ఆయన ఏం చేస్తారో చెప్పాలన్నారు. తాము పార్టీకి దూరం జరిగి 16 నెలలు అయిందని ఇప్పటికీ సవాళ్లు విసురుతాడే కానీ, పని చేయలేడని.. ఆయనకు మాటలు ఎక్కువ, మేటర్ తక్కువ అని ఎద్దేవా చేశారు కోటంరెడ్డి.
తన అంతిమ యాత్రకు జగన్ రావాలి అని తాను చెప్పిన మాట వాస్తవం అని అన్నారు కోటమరెడ్డి. ఆయన్ని అంతగా అభిమానించిన తానే పార్టీ మారానంటే లోపం ఎక్కడ ఉందో అనిల్ యాదవ్ తెలుసుకోవాలని కోరారు కోటంరెడ్డి. నరసరావుపేట టీడీపి నాయకుల నెత్తిన అనిల్ పాలు పోశారని అక్కడ ఆయన ఓడిపోవడం గ్యారెంటీ అని చెప్పారు కోటంరెడ్డి. నర్సరావుపేట లోక్ సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీగెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నర్సరావుపేటలో పచ్చగా ఉన్న వైసీపీని అనిల్ సర్వ నాశనం చేసి వస్తాడని కౌంటర్ ఇచ్చారు.
స్వామిమాల దేనికో చెప్పు..
పాపాలు చేసే వారే పూజలు ఎక్కువ చేస్తారని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వెటకారం చేసిన అనిల్.. అన్ని సార్లు స్వామి మాల ఎందుకు వేసుకున్నారో చెప్పాలని నిలదీశారు కోటంరెడ్డి. అనిల్ కూడా పాపాలు చేసారా? అని ప్రశ్నించారు. అధికార మదంతో మత విశ్వాసాలను కించపరిచే రీతిలో మాట్లాడిన అనిల్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కోటంరెడ్డి.